39.2 C
Hyderabad
March 29, 2024 16: 16 PM
Slider సంపాదకీయం

కులాల రొష్టులో పడ్డ ఈ కమలం వికసించేనా?

#BJPAP

తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తే కమలం వికసిస్తుందని భావించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కొత్త పాఠం నేర్పి ఉండాలి. రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అనే బేసిక్ సిద్ధాంతాన్ని బిజెపి మర్చిపోయి ప్రవర్తించింది.

తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావాలంటే అది వేరేవారు చేసే ప్రయత్నాల వల్లగాదు తనంతతాను చేసే తప్పులవల్ల జరగాలి. అలాంటిది తెలుగుదేశం పార్టీని అణచివేయడానికి ఆంధ్రప్రదేశ్ బిజెపి తీవ్రంగా ప్రయత్నించింది. మరీ ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేస్తున్నారని వచ్చిన ఆరోపణలను నమ్మిన బిజెపి అధిష్టానం, చంద్రబాబునాయుడిని వ్యక్తిగతంగా తీవ్రంగా వ్యతిరేకించే సోము వీర్రాజును ఆ స్థానంలో నియమించింది.

అధికార పక్షం కన్నా ప్రతిపక్షంపైనే గురి

సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తప్పులపై తప్పులు చేస్తూనే వచ్చారు. రాజకీయంగా ఎవరిని ఎదుర్కొవాలో తెలియని అనిశ్చిత స్థితిలోనే ప్రవర్తించారు. అధికారంలో ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువగా చంద్రబాబునాయుడిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నాడా లేడా అనే విషయాన్ని కూడా మర్చిపోయి, చంద్రబాబునాయుడు మాత్రమే అన్ని పనులకు కారణం అనే రీతిలో సోము వీర్రాజు ప్రవర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో బిజెపి తీవ్రంగా విఫలం అయింది.

రాముడి తల నరికినా చలనం లేదు….?

అంతర్వేదిలో రథం తగటబెట్టిన సంఘటనలో సీబీఐ విచారణ జరిపించలేకపోయింది. రామతీర్ధంలో రాముడి విగ్రహం తలనరికినా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయడంలో బిజెపి ఘోరంగా విఫలం అయింది. ఇప్పటికీ ఈ రెండు అతి పెద్ద సంఘటనలతో బాటు పలు చోట్ల దేవాలయాలపై జరిగిన దాడుల్లో నిందితులకు శిక్ష పడలేదు. రాముడి పేరు చెప్పి జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చిన బిజెపి, ఆంధ్రప్రదేశ్ లో రాముడి తలనరికినా కదల్లేదు.

తాము పోరాటం చేస్తే చంద్రబాబునాయుడు లాభపడతాడనే ఉద్దేశ్యంతో ప్రవర్తించిన బిజెపి ఇప్పుడు తన మిత్రుడు పవన్ కల్యాణ్ కన్నా అతి తక్కువ సీట్లు, ఓట్లు పొందిన దారుణమైన పరిస్థితి చేరుకున్నది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో బిజపి ఎదుగుదలకు అడ్డుగా వెంకయ్యనాయుడు ఉండేవారని అప్పటిలో చాలా మంది బిజెపి నాయకులు ఆరోపించేవారు.

బిజెపి ఎదిగితే తెలుగుదేశం పార్టీకి దెబ్బ తగులుతుందని వెంకయ్యనాయుడు ఎవరిని ఎదగనివ్వలేదని బిజెపిలోని ఒక వర్గం గట్టిగా వాదించేది. ఇప్పుడు వెంకయ్యనాయుడి ‘‘అడ్డు’’ లేదు కదా? మరి విభజిత ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఎందుకు పెరగడం లేదు? తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బిజెపి ఎదగడం లేదని కూడా ఇంతకాలం కొందరు బిజెపి సిద్ధాంతకర్తలు చెప్పేవారు.

వెంకయ్యనాయుడు లేడూ… చంద్రబాబునాయుడూ లేడు…

చంద్రబాబునాయుడు జాతీయ స్థాయిలో ‘‘మేనేజ్ ’’ చేసి ఇక్కడి నాయకులను అణచివేసేవారని అనేవారు. ఇప్పుడు ఆ అడ్డంకి కూడా లేదు కదా? మరి ఇక బిజెపి పెరగడానికి అడ్డేముంది? తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ శూన్య స్థితికి చేరుకున్నందున బిజెపి గణనీయమైన ప్రగతి సాధించింది.

మరి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా లేదు కదా? బిజెపి ఎందుకు పెరగడం లేదు? వెంకయ్యనాయుడు అడ్డుపడ్డాడు, చంద్రబాబునాయుడు అడ్డుపడ్డాడు అనేది కేవలం కుంటు సాకు మాత్రమే. రాజకీయంగా అంకిత భావం లేని నాయకులే బిజెపి దుస్థితికి కారణం.

పక్కనోడి త్యాగంపై ఆశల సౌధం కట్టుకుందామని తప్ప తాము త్యాగం చేద్దామని ఆలోచించే నాయకులు ఉండటమే బిజెపి ఎదుగుదలకు అడ్డుపడుతున్నది. కులాల లెక్కలు వేసుకుని కమ్మోళ్ల కన్నా రెడ్డోళ్లు బెటర్ అనే సిద్ధాంతం ఆకళింపు చేసుకుని, వాళ్లూ వీళ్లూ ఇచ్చే సౌకర్యాలకు తాకట్టుపడిపోయే నాయకులు ఉండటమే ఆంధ్రప్రదేశ్  బిజెపికి శాపం. రాజకీయంగా అగాహన లేకుండా వ్యక్తిగతంగా కులాల రొష్టులో పడి కొట్టుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ బిజెపికి మంచి రోజులు వచ్చే అవకాశం కనిపించడం లేదు.  

Related posts

Bonus Z Brakiem Depozytu W Ice Casino Odbierz Bonus Na Start!

Bhavani

విశాఖలో గీతం యూనివర్సిటీ కొంత భాగం కూల్చివేత

Satyam NEWS

నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి

Murali Krishna

Leave a Comment