38.2 C
Hyderabad
April 25, 2024 12: 56 PM
Slider సంపాదకీయం

‘‘మైండ్ గేమ్’’ కు బలి అవుతావా పవన్?

#jagan

గత అసెంబ్లీ ఎన్నికలలో ఫెయిల్ అయిన పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తారనే విషయాన్ని ముందుగానే పసిగట్టిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ‘‘మైండ్ గేమ్’’ మొదలు పెట్టారు. పదే పదే ‘‘చంద్రబాబు దత్తపుత్రుడు’’ అంటూ పవన్ కల్యాణ్ ను సంబోధించడం ద్వారా జగన్ ఆయన నిర్ణయాలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే పవన్ కల్యాణ్ బిజెపితో జత కట్టి ఉన్నారు. బిజెపికి వైసీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

పైగా బిజెపికి చంద్రబాబు పార్టీ అంటే అస్సలు గిట్టడం లేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అధికార వైసీపీని ఎంత విమర్శిస్తున్నారో అంతకన్నా ఎక్కువగా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూనే ఉన్నారు. ఇది ప్రత్యక్షంగా వైసీపీకి లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు.

పవన్ వ్యాఖ్యలతొో పెరిగిన హీటు

కేంద్రంలోని బిజెపి పెద్దలతో జగన్ సన్నిహితులు అత్యంత సన్నిహితంగా మెలగుతున్నారు. కేంద్రంలో తమకు కావాల్సిన పనులన్నీ చేసుకుంటున్నారు. ఈ దశలో తెలుగుదేశం పార్టీ పవన్ కల్యాణ్ తో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తాను అని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో తెలుగుదేశం ఈ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

అయితే చంద్రబాబు వ్యతిరేక బిజెపి కౌగిలిలో ఇరుక్కుపోయి ఉన్న పవన్ కల్యాణ్ చంద్రబాబు వైపు వచ్చే ‘‘సాహసం’’ చేయగలరా? అనే ప్రశ్న చాలా మందిని ఆలోచనలో పడేస్తున్నది. అయితే బిజెపితో ఉండటం వల్ల పవన్ కల్యాణ్ కు వచ్చే రాజకీయ లబ్ది ఏ మాత్రం లేదు.

బిజెపి నాయకులు వైసీపీకి ఎలాంటి నష్టం కలగకుండా వ్యవహరిస్తున్న ఈ దశలో వారితో కలిసి జగన్ తో పోరాటం చేయడం కుదిరేపని కాదు. బిజెపితో కలిసి నడిస్తే జనసేన పార్టీ ఈ సారి ఎన్నికలలో కూడా ఒకటో రెండో సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మరీ విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే బిజెపితో కలిపి పది సీట్లు రావచ్చేమో అనే అంచనా ఉంది.

ఈ అవకాశం వదులుకుంటే…….

అంతే తప్ప రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఐదేళ్లలో కూడా ఎలాంటి నిర్ణయాత్మక శక్తిగా జనసేన మారే అవకాశం లేదు. 2029 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగాలంటే అప్పటి వరకూ జనసేన పార్టీని కాపాడుకోవడం కష్టమే. మరో 8 ఏళ్లు ఆగితే పవన్ కల్యాణ్ కు సినీ గ్లామర్ కూడా తగ్గిపోవచ్చు. ఈ దశలో తెలుగుదేశం పార్టీతో కలుద్దామంటే బిజెపి తో బంధం తెంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ప

వన్ కల్యాణ్ రాబోయే రోజుల్లో బిజెపితో బంధం తెంచుకుని తెలుగుదేశంతో జతకట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని జగన్ బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కలిస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికన్నా జగన్ కే ఎక్కువగా తెలుసు. పవన్ కల్యాణ్ ను తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లకుండా చూసే శక్తి బిజెపికి లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలయికను ఆపాల్సిన అవసరం జగన్ కు ఎక్కువగా కనిపిస్తున్నది.

రాజకీయంగా ఆ పని నేరుగా చేయలేరు కాబట్టి ఇప్పటి నుంచే ‘‘మైండ్ గేమ్’’ మొదలు పెట్టారు. పవన్ కల్యాణ్ ఎంతో సున్నితమైన మనిషి. చంద్రబాబులాగా అవకాశం దొరికే వరకూ వేచి చూసే మనస్తత్వం కూడా లేదు. ఎంత ప్రతికూలత ఉన్నా చంద్రబాబునాయుడి కదలికలలో మార్పు రాదు. అయితే సున్నితమైన పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలవకుండా చేయాలంటే ‘‘మైండ్ గేమ్’’ తప్పని సరి.

భవిష్యత్తు ప్రచారానికి ఇప్పటి నుంచే మైండ్ గేమ్

అందుకే ప్రతి సారీ దత్తపుత్రుడు…. దత్తపుత్రుడు…. అంటూ జగన్ ఆయనను సంబోధిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కల్యాణ్ కలిస్తే ‘‘మేం ముందే చెప్పాం.. చంద్రబాబుకి దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అని రుజువు అయింది’’ అంటూ వైసీపీ ప్రచారం చేసుకోవచ్చు.

కలవకపోతే ఇక ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చి రెండు పార్టీలనూ భూస్థాపితం చేసేయవచ్చు. బిజెపి కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఏపీలో చేసేది ఏమీ లేదు కనుక జగన్ కు ముంచుకువచ్చే ప్రమాదం ఏదీ ఉండదు. ఇవన్నీ బహుశ ఆలోచించే మైండ్ గేమ్ కు తెరతీశారు. పదే పదే దత్తపుత్తుడు అని సంబోధించడం ద్వారా పవన్ కల్యాణ్ ను చంద్రబాబునాయుడితో కలవకుండా రెచ్చగొడితే చాలు… మరేం చేయక్కరలేదు. ప్రభుత్వ వ్యతిరేకఓటు అనేది ఏపిలో తక్కువ.

అవునన్నా కాదన్నా కుల రాజకీయమే

అక్కడ ఉండేది కేవలం కుల రాజకీయమే. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాలలో ఎస్సీల్లో ఒక వర్గానికి కాపు కులస్తులకు ఆధిపత్య పోరు నడుస్తున్నది. అదే విధంగా ఉన్నత స్థాయిల్లో కమ్మ కులాన్ని తొక్కేసి రెడ్లు పైకి వస్తున్నారు. ఇప్పటికే కమ్మ కులానికి చెందిన వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల కమ్మ కాపు కులస్తులు కలవాలని అప్పుడే రెడ్లను, ఎస్సీల్లో ఒక వర్గ ఆధిపత్యాన్ని అడ్డుకోగలుగుతామని కొందరు ప్రతిపాదిస్తున్నారు.

ఈ మైండ్ గేమ్ కు పవన్ కల్యాణ్ బలి అవుతారో లేక సామాజిక కోణంలో ఆలోచించి చంద్రబాబుతో కలుస్తారో వేచి చూడాల్సిందే. గత ఎన్నికల ముందు ‘‘ప్రత్యేక హోదా’’ అనే మైండ్ గేమ్ తో చంద్రబాబు పదే పదే తన వాదనలు మార్చుకునేలా చేసిన జగన్ ఆయన క్రెడిబులిటీని పూర్తిగా దెబ్బ కొట్టారు.

ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో స్పష్టంగా చెప్పారు. జగన్ మైండ్ గేమ్ లోకి పోవద్దు చంద్రబాబూ అంటూ. అయితే చంద్రబాబు ఆ మాటల్ని పెడచెవిన పెట్టారు…. కథ మారింది. ఇప్పుడు పవన్ ఏం చేస్తారో అనే అంశంపైనే భవిష్యత్తు రాజకీయం ఆధారపడి ఉంటుంది.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

రామాలయం మూసివేత

Murali Krishna

కడప జిల్లా వైసీపీకి బీటలు: తెలుగుదేశం వైపు చూస్తున్న నేతలు

Satyam NEWS

ట్రాజెడీ: నేల రాలిన నెలల బాలుడు

Satyam NEWS

Leave a Comment