36.2 C
Hyderabad
April 16, 2024 22: 41 PM
Slider సంపాదకీయం

బురద రాజకీయాల్లో కూరుకుపోతున్న విలువలు

#YSJaganmohanreddy

‘‘అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది… నన్నేం పీకలేకపోయారు’’ అంటూ చంద్రబాబునాయుడు మునిసిపల్ ఎన్నికల ప్రచారం లో చేసిన సవాల్ కు సమాధానం అన్నట్లు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనపై కేసు బిగించారు.

పాలనాపరమైన నిర్ణయాలకు ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని శిక్షించాలంటే ఏ ప్రభుత్వం ఏ పనీ చేయలేవు. కుంభకోణం జరిగింది అని నిరూపించడం కష్టం అనే విషయం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిసినంతగా వేరే రాజకీయ నాయకుడికి తెలియకపోవచ్చు.

అయినా సరే ఆయన తన వంతు ప్రయత్నంగా చంద్రబాబుపై కేసు పెట్టించేశారు. కేసు ఏమౌతుంది అందులో ఎంత బలం ఉంది అనేదానికన్నా ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు అని అనడం కరెక్టు. చంద్రబాబునాయుడిపై కేసు పెట్టడం అనేది చాలా మంది వైసీపీ అభిమానులకు ఆనందం కలిగించే విషయం.

వైసీపీ అభిమానులు, చంద్రబాబు వ్యతిరేకులు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం జరిగే పాలనలో లోపాలను చూడటం కన్నా చంద్రబాబును తిట్టడంలోనే చాలా మంది నిమగ్నమై ఉంటున్నారు. ఇదే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి నైతిక బలాన్ని ఇస్తున్నది.

అమరావతి ప్రాంతాన్ని రాజధాని గా ప్రకటించడానికి ముందుగానే అక్కడి భూములు కొనుగోలు చేసి వాటికి విలువ పెంచుకున్నారని ఇప్పటికి చాలా మంది నమ్ముతున్నారు. అంత బలంగా ఉంది ఆ ప్రచారం. అమరావతి ప్రాంతంలో భూమి కొన్న ప్రతి కమ్మవాడూ చంద్రబాబుకు చుట్టం కాడు.

ఈ చిన్న లాజిక్ ను అందరూ మరచిపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రతి కమ్మవాడూ చంద్రబాబుకు బినామి అంటే అందరూ సులభంగా నమ్మేస్తారు. ఇది చంద్రబాబుకు తొలి నుంచి ఉన్న శాపం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సైబరాబాద్ ప్లాన్ చేసినప్పుడు కూడా ఇదే ప్రచారం జరిగింది.

ఆ ప్రాంతంలో చాలా వెంచర్లకు ‘జయభేరి’ పేరు కనిపించడంతో అక్కడ అందరూ చంద్రబాబు బినామీలే ఉన్నారు అని చెప్పడం, దాన్ని సులభంగా నమ్మడం జరిగిపోయింది. అదే కథ అమరావతిలో రిపీట్ అయింది. చాలా మందికి కొత్తగా అనిపించవచ్చుగానీ బహుశ చంద్రబాబునాయుడికి ఈ ఆరోపణలు కొత్తగా అనిపించే అవకాశం లేదు.

చంద్రబాబునాయుడిపై సీబీసిఐడి కేసులు పెట్టడం అనే అంశం ఎంత వరకూ వెళుతుందో తెలియదు కానీ రాజకీయంగా చంద్రబాబునాయుడికి మాత్రం లాభం చేకూరుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఛిన్నాభిన్నమైన తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మళ్లీ చాలా చోట్ల బలం సమకూర్చుకున్నది.

మునిసిపల్ ఎన్నికల తర్వాత తన బలహీనతలను తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పూర్తిగా తెలుసుకున్నారు. ఆయనకు ఉన్న రాజకీయ అనుభవంతో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కచ్చితంగా చేస్తారు.

తెలుగు తమ్ముళ్లకు పాపులారిటీ తెస్తున్న వైసీపీ

వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెడుతూ వారికి పాపులారిటీ తెచ్చిపెడుతున్నది. అనునిత్యం తెలుగుదేశం పార్టీ నాయకులు జనం నోళ్లలో నానేలా చేస్తున్నది. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ మళ్లీ బలం పుంజుకుంటున్నదో అక్కడ ఉన్న నాయకులపై కేసులు ఎక్కువగా పెడుతున్నారు.

ఈ చైన్ రియాక్షన్ లో లాభపడుతున్నది తెలుగుదేశం పార్టీనే. ఇప్పటికే చాలా వర్గాలు వైసీపికి దూరం అయ్యాయి. ఫ్రీ తాయిలాలు తమను గెలిపిస్తాయని పాలకులు అనుకుంటున్నారు. అయితే ఆ ఫ్రీ లు అన్నీ కేవలం వైసీపీ కార్యకర్తల వద్దే ఆగిపోతున్నాయనేది నిజం.

న్యూట్రల్స్ కు, తెలుగుదేశం వాసన ఉన్న వారికి కూడా అవి అందితే కదా అవి ఓట్లుగా మారేది? మునిసిపల్ ఎన్నికలలో గెలుపు నిజంగా గొప్పదే. బలప్రయోగం చేసినా గెలవని సందర్భాలు ఈ డెమోక్రసీలో చాలా ఉన్నాయి.

అమరావతి, పోలవరం నుంచి ఇప్పటి విశాఖ ఉక్కు వరకూ అన్నీ వైసీపీకి గుదిబండలే. ఇవన్నీ సరదిద్దుకోకపోతే నష్టం తప్పదు. అయితే ఇవే తమకు బలం ఇస్తాయని… ఇస్తున్నాయని వైసీపీ బలంగా నమ్ముతున్నది…. అందువల్ల ఏది కరెక్టు అనేది కాలమే నిర్ణయించాలి.

Related posts

సినిమా సౌథానికి “శంకుస్థాపన” చేసిన అశోకచక్ర మూవీస్

Bhavani

వెంకటేశుడికి భక్తులకు మధ్యలో తిరుమల దేవస్థానం

Satyam NEWS

పబ్లిక్ పాలసీ సలహాదారుగా భాద్యత స్వీకరించిన కేఆర్ మూర్తి

Satyam NEWS

Leave a Comment