33.2 C
Hyderabad
April 26, 2024 01: 30 AM
Slider ప్రపంచం

Analysis:కదనం వైపు కదులుతూ శాంతి వచనం పలుకుతూ

#ChinaBorder

చైనా -భారత్ మధ్య యుద్ధం జరుగుతుందా? అని ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, శాంతి మంత్రాలు వినిపించాయి. పోరాటాన్ని విరమించేందుకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. పంచసూత్రాల ఒప్పందం కుదుర్చుకున్నాయి.

రెండు దేశాల మధ్య ఒకప్పటి సాధారణ పరిస్థితులు నెలకొల్పుతాం అంటూ భారత విదేశాంగశాఖ  మంత్రి ఎన్.జయశంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ సంయుక్త ప్రకటన చేశారు. ఇది రెండు దేశాల విదేశాంగ విధానంలో ఎంతో కీలకమైన పరిణామం.

వెనక నుండి గోతులు తవ్వేస్తున్న చైనా

భారత్ మొదటి నుండీ  శాంతి స్థాపన వైపే మొగ్గు చూపిస్తోంది. అది,  చైనాకు భయపడి కాదు, భారతదేశ సహజ సిద్ధమైన శాంతికాముకత మాత్రమే.  పైకి చైనా శాంతి వచనాలు పలుకుతూ, వెనుక నుండి గోతులు తవ్వుతూ, ముందునుండి దురాక్రమణలు చేస్తూ యుద్ధవాతావరణాన్ని కల్పించింది. నిరంతరం కవ్వింపు చర్యలు చేపట్టింది. ద్వంద్వ వైఖరి కాదు, బహుదుష్ట వైఖరి అవలంబించింది.

రెండు దేశాల సరిహద్దుల్లోనే కాకుండా, భారత్ చుట్టూ నానా యాగీ చేసింది.  చైనాకు దీటుగా భారతదేశం అనేకసార్లు సమాధానం చెప్పింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరిహద్దుల్లోకి వెళ్లి భారత సైనికులకు ధైర్యస్థైర్యాలను నింపడమేకాక, చైనాకు బలమైన హెచ్చరికలు కూడా చేశారు.

భారత్ ఆది నుంచి ధర్మ మార్గమే

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా భారతవాణిని బలంగా వినిపించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ శాంతి స్థాపనకు, ద్వైపాక్షి సంబంధాలు మెరుగుపడడానికి అనేక చర్చలు జరిపారు. భారతదేశం మొదటి నుండీ ధర్మమార్గంలోనే వెళ్తోంది.

ఇప్పుడు,  చైనా శాంతి స్థాపనకు, ఒకప్పటి సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడడానికి ముందుకు రావడం మంచి పరిణామంగా భావించాలి. దీని వెనకాల ఏదైనా వ్యూహం ఉందా,ఏవైనా అంశాలకు భయపడి,ముందుగానే ఊహించి, దిగివచ్చిందా అన్నది భావికాలంలో తప్పక తెలుస్తుంది.

ప్రస్తుతం రెండు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అధికారికంగా ప్రకటన కూడా చేశాయి. రెండు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చిన అంశాలు (1) రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పటిష్ఠం చేసుకుంటూ, విభేదాలు, వివాదాలుగా మారకుండా రెండు దేశాలు చొరవ చూపాలి

(2) రెండు దేశాల సైనిక బలగాల మధ్య చర్చలు కొనసాగించి, సమదూరం పాటిస్తూ, త్వరగా ఉపసంహరణను  చేపట్టి, ఉద్రిక్తతలు చల్లార్చి చల్లని వాతావరణం ఏర్పరచాలి (3) ఇప్పటి వరకూ ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, ప్రొటొకాల్స్ ను  పాటిస్తూ, శాంతి పెంపొందించాలి

(4) సరిహద్దుల్లో తలెత్తిన పరిస్థితులపై ప్రత్యేక ప్రాతినిధ్యం, యంత్రాంగం ఏర్పరచి చర్చలు కొనసాగించాలి (5) సరిహద్దుల్లో విభేదాలకు చరమగీతం పాడి, శాంతి, సుస్థిరత నెలకొల్పాలి. ఈ విధంగా, రెండు దేశాలు పంచ శాంతిసూత్రాలు ఏర్పాటుచేసుకున్నాయి.

చైనా కుయుక్తులు ఇప్పటికైనా ఆగేనా?

ఈ నేపథ్యంలో, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాస్తవాధీన రేఖ వెంట అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇది ఎంతో  కీలకమైన పరిణామమే అయినప్పటికీ, చైనా ఈ పంచసూత్రాలకు  ఎంతవరకూ కట్టుబడి వుంటుందన్నది అనుమానమే.

గతంలోనూ అనేకసార్లు ఎన్నో ఒప్పందాలను పెడచెవిన పెట్టి, తను అనుకున్న రీతిలో ప్రవర్తించింది. సామ్రాజ్యకాంక్ష, ఆర్ధిక ప్రయోజనాలు, ఆధిపత్య ధోరణుల మధ్య రగిలిపోతున్న చైనాకు శాంతి మంత్రాలు ఎంతవరకూ రుచిస్తాయన్నది అనుమానమే.

మొదటి నుండీ భారత్ పట్ల చైనా అవలంబిస్తున్న తీరును గమనిస్తే , తన స్వార్ధ ప్రయోజనాలకే పెద్దపీట వేసుకోవడం, భారత్ కున్న అవసరాలను తన ఆర్ధిక స్వార్ధాలకు మలచుకోవడం మనకు ఎదురైన చేదు అనుభవాలు.  జిన్ పింగ్ అధ్యక్షుడుగా వచ్చినప్పటి నుండీ ఈ వైఖరి మరింత బలపడింది.

గతంలో ఎప్పుడూ లేనట్లుగా నేపాల్ ను కూడా భారత్ పై చైనా రెచ్చగొట్టింది. చైనా-భారత్ సరిహద్దు అంశాల్లో కీలకమైన            మెక్ మోహన్ రేఖపై ఇంతవరకూ రెండు దేశాల మధ్య స్పష్టత లేదు. ఈ రేఖను చైనా అసలు గుర్తించడం లేదు. ఇదొక మిధ్యగా, బ్రహ్మపదార్థంగా మిగిలివుంది.

ఇవన్నీ సమసిపోయేది ఎప్పుడు,అన్నది పెద్ద ప్రశ్న. ప్రస్తుత ఈ పంచసూత్రాల ఒప్పందం కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, చైనాను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. బంధాలు పాడుచేసుకోకూడదు. అదే సమయంలో, మన దేశ  ప్రయోజనాలు మరువకూడదు.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

హెల్మెట్ ధరించి ప్రాణం కాపాడుకోండి

Satyam NEWS

ప్రకాశం జిల్లాలో వివాహిత ఆత్మహత్య

Satyam NEWS

శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాలకు కేసీఆర్ కు ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment