40.2 C
Hyderabad
April 24, 2024 17: 12 PM
Slider జాతీయం

Analysis: కాంగ్రెస్ కు ప్రధాన శత్రువు కాంగ్రెస్సే

#SoniaGandhi1

కొన్ని దశాబ్దాల క్రితం ఉల్లేఖించిన రాజకీయ విశ్లేషకుల ఈ వ్యాఖ్య నేటికీ వర్తిస్తుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ జాతీయ నాయకుల వ్యవహార శైలితో ఖంగుతిన్న పార్టీ అధినాయకత్వం స్వరం మార్చి కాంగ్రెస్ లోని కొందరు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారని నోరుజారడం ఆ పార్టీ నిస్సహాయతను స్పష్టం చేస్తోంది.

దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని, అనేక క్లిష్ట సమయాలలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్, ఆనంద్ శర్మ వంటి సీనియర్ నేతలను శంకించడం సహేతుకం కాదని కాంగ్రెస్ పార్టీ లోని అత్యధికులు వాదిస్తున్నారు.

బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెసును బలహీన పరచడానికి పార్టీకి చెందిన సీనియర్లు వ్యవహరించడం తప్పని పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించినట్లు వార్తలు వినిపించాయి. అయితే  రాహుల్ గాంధీ ఆ విధంగా వ్యాఖ్యానించలేదని ఒకవర్గం మీడియా వక్రీకరించిందని ఏఐసిసి అధికారుల ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా ప్రకటించడంతో అంతర్గత పోరు సద్దుమణిగింది.

సీనియర్ల లేఖతో చెలరేగిన చిచ్చు

క్రియాశీలంగా ఉండే, పూర్తిసమయం కేటాయించే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కోరుతూ 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ నెల 20న పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు లేఖ రాయడంతో  పార్టీలో అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉన్నట్లు బహిర్గతమైంది.

దీనిపై రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, రాజస్థాన్ లో పార్టీ రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఈ లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. ట్వీట్ల యుద్ధంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

పరిస్థితిని వెంటనే చక్కదిద్దేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించి ఇదంతా’ టీ కప్పులో తుపాను’ చందంగా చిత్రీకరించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియాలో, బాహాటంగా చర్చించకూడదని వాటిని పార్టీ వేదిక పైనే లేవనెత్తాలని  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

సోనియా కొనసాగింపు ఊహించినదే

 ఏఐసీసీ సమావేశం నిర్వహణకు పరిస్థితులు అనుకూలించేదాకా కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో కొనసాగాలని సోనియాగాంధీని కోరుతూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించడం ముందుగా ఊహించిందే. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వచ్చినా పార్టీకి లాభం లేదా నష్టం ఏమీలేదని రాజకీయ పండితులు అంటున్నారు.

నెహ్రు-గాంధీ కుటుంబానికి చెందిన ఐదుగురే దాదాపు 40 ఏళ్ళు పార్టీ పగ్గాలు చేపట్టిన చరిత్ర కాంగ్రెస్ పెంచి, పోషించిన వారసత్వ రాజకీయాలకు పరాకాష్ట. 20 ఏళ్లుగా అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలిగా సోనియాగాంధీ వ్యవహరించడం ఒక రికార్డు.

సోనియాగాంధీ నుంచి రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడం, గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరపరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం తిరిగి సోనియా గాంధిని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించడం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా పరిణమించింది.

నాయకత్వ వైఫల్యం వారసత్వ జాఢ్యం

సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి వారసత్వ రాజకీయాలకు అతీతంగా సమర్ధవంతమైన నాయకత్వాన్ని గుర్తించడంలో విఫలమవుతున్న తీరు కాంగ్రెస్ పార్టీలో ద్వితీయశ్రేణి, క్షేత్ర స్థాయి కార్యకర్తలలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ గణనీయస్థాయిలో ఓటుబ్యాంకు కలిగిఉన్న కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శతో సమీక్షించుకుంటే ఫలితాలు మెరుగయ్యే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన పెద్దలు నర్మగర్భంగా చెబుతున్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీ పుంజుకోవాలంటే అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేయాలని అంటున్న మాటలు సహేతుకం. గాంధీ-నెహ్రూ కుటుంబం ఒక్కటే  గట్టెంకించగలదన్న భ్రమ వీడనంత వరకు కాంగ్రెస్ కు మంచిరోజులు రావడం ఊహించలేమంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి వాదుల మాటలు ఆలోచింపచేసేవే.

ఏది ఏమైనా సమీప భవిష్యత్తులో బలమైన బీజేపీ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ కొత్త జవసత్వాలు స్వీకరించక తప్పదని రాజకీయ విశ్లేషకుల అభిభాషణ. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎలా ముసలం వస్తుందో ఎలా సమసిపోతుందో రాజకీయ పరిశీలకులకు, మీడియాకు ఒక వార్తావినోదం.

– పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

కొల్లాపూర్ సమీపంలో తుఫాన్ వ్యాన్ బోల్తా

Satyam NEWS

రక్త హీనత లోపo లేకుండా చర్యలు

Bhavani

తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల మోత

Satyam NEWS

Leave a Comment