27.2 C
Hyderabad
October 21, 2020 17: 58 PM
Slider ప్రత్యేకం

Analysis: కరోనా కాటేస్తున్నా పట్టించుకోని ప్రజలు

#CoronaVirus

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్యను పరిశీలిస్తే, ఈ నెలాఖరుకు 60 లక్షల మార్కు దాటగల సూచనలు కనిపిస్తున్నాయి.

అన్ లాక్ -4 ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రజా జీవనంలో మరింత కదలిక వచ్చింది. మాస్కుల ధారణ, శానిటైజేషన్ , భౌతికదూరం వంటి వ్యక్తిగత జాగ్రత్తలలో నిర్లక్ష్యం పెరుగుతున్న వైఖరి కనిపిస్తోంది.

గత కొద్ది రోజులుగా గమనిస్తే శానిటైజర్స్ విక్రయాలు గణనీయంగా తగ్గినట్లు ఒక అధ్యయనం స్పష్టం చేసింది. ఒకవైపు ప్రతి 24 గంటలకు వేలాది కేసులు కొత్తగా పుట్టుకొస్తున్నా, మరణాల రేటు 1.64 శాతానికి పడిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

పేదల నుంచి పెద్దల దాకా వదలని కరోనా

సామాన్యులనుంచి వీవీఐపీల వరకు కరోనా వైరస్ సోకుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చట్ట సభలు నిర్దేశించిన సమయాన్ని కుదించుకుంటున్నాయి.

తాజాగా తెలంగాణా శాసనసభ వానాకాల సమావేశాలు ఈ నెల 28వరకు నిర్వహించాలని నిర్ణయించినా కరోనా విస్తరణ ప్రమాదాన్ని గుర్తించి కుదించింది.

ఇదిలా ఉండగా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవిషయంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. 2024  ఏడాది చివరినాటికి కూడా ప్రపంచంలోని అన్నిదేశాల పౌరులకు వాక్సిన్ అందడం కష్టమేనని సీరమ్ సీఈవో అదావార్ పూనావాలా ప్రకటించారు.

వ్యాక్సిన్ అందరికి అందేది ఎప్పుడో?

అందరికీ వాక్సిన్ అందించాలంటే కనీసం 15 బిలియన్ డోస్ లు అవసరమవుతాయని , ఆ స్థాయిలో ఉత్పత్తి సాధించడానికి కనీసం 4 ఏళ్ళు పట్టవచ్చని ఆయన తెలిపారు.

రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వాక్సిన్ ఉమ్మడిగా ఉత్పత్తి చేసుకునే అవకాశం భారత్ కు ఉన్నది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వాక్సిన్ ప్రయోగాలకు తాత్కాలిక బ్రేక్ పడింది.

అయినా… ఆక్స్ ఫర్డ్ రెండోదశ ప్రయోగాల్లో భారత్ కు ఎటువంటి ఇబ్బంది లేదని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. కోవిడ్ వైద్యంలో భాగంగా విస్తృత ప్రచారం చేసిన ప్లాస్మా చికిత్స ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదని ఐసీఎమ్ ఆర్ స్పష్టం చేసింది.

ప్లాస్మా చికిత్స ప్రభావం పెద్దగా లేదు

మరణాల రేటు తగ్గించడంలో గానీ..కోవిడ్ తీవ్రతను తగ్గించడంలో గానీ ప్లాస్మా చికిత్స ప్రభావం చూపలేదని తెలిపింది. కోవిడ్ -19 కోసం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ ఈ పరిశోధన ను పరిశీలించి, ఆమోదించిందని ఐసీఎమ్ ఆర్ స్పష్టం చేసింది.

కోవిడ్-19 వాక్సిన్ వచ్చేఏడాది మొదట్లో వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా వాక్సిన్ ప్రయోగాలు బ్రిటన్ లో మళ్ళీమొదలైన నేపథ్యంలో కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

టీకా భద్రత, నాణ్యత, ధర, ఉత్పత్తి , సరఫరా వంటి అన్ని అంశాల్లోనూ ఇప్పటికే విసృత స్థాయిలో చర్చలు పూర్తయినట్లు ఆయన తెలిపారు.

మరోవైపు కరోనా వైరస్ నియంత్రణ లక్ష్యంగా తయారుచేసిన కోవాక్జిన్ టీకా జంతువులపై జరిపిన ప్రయోగాలలో మంచి ఫలితాలు చూపిందని భారత్ బయోటెక్ వెల్లడించింది.

కోతులపై చేస్తున్న ప్రయోగాలు సఫలమై , మానవుల వినియోగానికి పనికొచ్చే విధంగా టీకా తయారీకి అన్నిరకాల నియమనిబంధనలు ( ఎస్ ఓ పీ) పాటిస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

వ్యాక్సిన్ వస్తే అందరికి ఇస్తాం

పరిస్థితులు అనుకూలించి వాక్సిన్ లేదా టీకా అందుబాటులోకి వస్తే దేశ ప్రజలకు అవసరమైన మేరకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కొత్త కేసులు భయాందోళనలు కలిగిస్తున్నా కరోనా వైరస్ ను పూర్తిగా అంతం చేయగల వాక్సిన్ ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులో కి తేవడానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ ఉత్పత్తి చేస్తున్న దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంస్థ ప్రతినిధులు భరోసా ఇస్తున్నారు.

రాగల కొన్ని నెలల్లో వాక్సిన్ అందుబాటులో కి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షదాయకం.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

కడప జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ 19 పాజిటివ్ కేసులు

Satyam NEWS

కాటేదాన్ పారిశ్రామిక వాడలో చిరుత పులి

Satyam NEWS

హెల్తీ హార్ట్: గుండె జబ్బులు పెరగడానికి కారణాలెన్నో

Satyam NEWS

Leave a Comment