28.2 C
Hyderabad
April 20, 2024 14: 05 PM
Slider సంపాదకీయం

దేవుడా కరోనా రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడు

#ventilator

కరోనా వ్యాక్సిన్ పై సరైన సమయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకుండా చోద్యం చూసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  వ్యాక్సిన్ తయారీదారులపై చేస్తున్న ఆరోపణలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీ సామర్ధ్యం అనేది ఒకే రోజులో పెంచుకోవడం సాధ్యం కాదు.

ఈ విషయం అందరికి తెలిసినా వ్యాక్సిన్ తయారీ కంపెనీలపై ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ కోవాక్సిన్ తయారీ సంస్థ అయిన భారత్ బయోటెక్ పై పలు రకాల ఆరోపణలు చేశారు.

కేంద్రం ఆదేశాల మేరకే తమ రాష్ట్రానికి భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణను ఆ సంస్థ ఖండించినా కేజ్రీవాల్ అదే విషయం చెబుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అయితే మరొక అడుగు ముందుకు వేసి భారత్ బయోటెక్ సంస్థకు కులాన్ని ఆపాదించారు.

భారత్ బయోటెక్ కు ఈనాడు రామోజీరావుకు, చంద్రబాబునాయుడికి ఆయన లింక్ కూడా పెట్టారు. అందుకే ఆంధ్రప్రదేశ్ కు వ్యాక్సిన్ లు రావడం లేదు అనే అర్ధం వచ్చేలా చేసి, వ్యాక్సిన్ కోసం తల్లడిల్లుతున్న ప్రజల ఆగ్రహాన్ని చంద్రబాబుపైకి మళ్లించే విధంగా ప్రయత్నించారు.

విచిత్రం ఏమిటంటే అప్పటి వరకూ భారత్ బయో టెక్ కమ్మ కులానికి చెందిన వారిదని తెలియని వారు కూడా ‘‘ఇది నిజమేనేమో’’ అనే అభిప్రాయానికి వచ్చారు. వాస్తవానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పినట్లు వ్యాక్సిన్ సరఫరాను నియంత్రిస్తున్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం.

వ్యాక్సిన్ సరఫరాను నియంత్రిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ ఆక్షేపించిన విధంగా జగన్ కూడా ఆక్షేపించి ఉండవచ్చు. కానీ అందరికి తెలిసిన కారణాలతో ఆయన ఆ పని చేయలేదు.

పైగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పే మాటలు ఆలకించండి మహాప్రభో అంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తే ‘‘ఈ సమయంలో ప్రధానికి అందరూ సహకరించాలి’’ అంటూ జగన్ మోహన్ రెడ్డి వత్తాసు పలికిన విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో బిజెపికి జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న మద్దతు ఎంతో విలువైనది గా చెప్పవచ్చు. ఇందుకు బిజెపి ఆయనకు ఎంతో రుణపడి ఉంటుంది కూడా. అదే సమయంలో భారత్ బయోటెక్ నుంచి వ్యాక్సిన్ తయారీని మరిన్ని సంస్థలకు బదలాయించాలని కూడా జగన్ మోహన్ రెడ్డి సలహా ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తన సలహా ప్రకారమే భారత్ బయోటెక్ నుంచి ఫార్ములాను వేరే సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు కూడా జగన్ అనుకూలురు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.

వాస్తవానికి నెల రోజుల కిందటే దీనికి సంబంధించిన ఒప్పందాలు జరిగిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఎవరో చెప్పడం వల్ల కేంద్రం తీసుకున్న నిర్ణయం కాదు. గత నెల మిషన్ కోవిడ్ సురక్ష కార్యక్రమం కింద డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ (డిబిటి) కోవ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రణాళిక రచించింది.

ఇదే విషయాన్ని భారత్ బయోటెక్ కు వివరించగా అందుకు భారత్ బయో టెక్ అంగీకరించింది. ఈ మేరకు మూడు ప్రభుత్వ రంగ సంస్థలను డిబిటి ఎంపిక చేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని హాఫ్ కిన్ బయో ఫార్మస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలోని ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ (హైదరాబాద్), డిబిటి ఆధ్వర్యంలోని భారత్ ఇమ్యునోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్ (బులంద్ షెహర్) లను కోవాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ఎంపిక చేశారు.

మే జూన్ నెలల నాటికి అంటే ఈ నెల వచ్చే నెల సమయానికి కోవాక్సిన్ ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది ప్రణాళిక. ఏప్రిల్ నాటికి కోటి డోసుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని జులై ఆగస్టు నాటికి ఆరు నుంచి ఏడు కోట్ల డోసులకు పెంచాలని ప్రణాళిక వేసుకున్నారు.

సెప్టెంబర్ నాటికి ఇది పది కోట్ల డోసులకు చేరుతుంది. భారత్ బయోటెక్ ఫార్ములా ఇచ్చేసినంత మాత్రాన సరిపోదు. ఈ వ్యాక్సిన్ అభివృద్ధి పరచాలంటే అధునాతనమైన 3వ స్థాయి బయో సేఫ్టీ లాబొరేటరీ ఉండాలి. మన దేశంలో ఏ కంపెనీ వద్దా అవి లేవు.

ఈ కొరతను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీర్చి ఉండాల్సింది (సాంకేతికంగా సాధ్యమో కాదో తెలియదు) అయితే కేంద్రం నుంచి అలాంటి ప్రయత్నాలు మాత్రం జరగలేదు. మన దేశంలో వ్యాక్సిన్ తయారీ కి కంపెనీలు సిద్ధం అయ్యే నాటికి కరోనా రెండో దశ తీవ్రత లేదు.

పైగా కరోనా కొత్త స్రెయిన్ వచ్చిందని తెలిసినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చినా వాటికి రూ.200 కోట్లు కేటాయించలేదు. తొలి దశ కరోనా పూర్తిగా పోకముందే దేశాన్ని లాక్ డౌన్ నుంచి విముక్తం చేశారు. దేశంలో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పడకల సామర్ధ్యాన్ని పెంచుకున్నాయి తప్ప కేంద్రం నుంచి దానికి సాయం కూడా లభించలేదు.

కరోనా వ్యాక్సిన్ సిద్ధం అయిన వెంటనే కేంద్రం ఆ వ్యాక్సిన్ ను తీసుకుని తమకు అందిస్తుందని రాష్ట్రాలూ, రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవాలని కేంద్రం స్థిరమైన అభిప్రాయానికి రాలేకపోయాయి.

దీనికి సంబంధించి ఎవరూ కేంద్రాన్ని క్లారిటీ అడగలేదు… కేంద్రమూ చెప్పలేదు… వెరసి ఆక్సిజన్ అందక చనిపోతున్న రోగులు… వ్యాక్సిన్ అందక ఇబ్బంది పడుతున్న ప్రజలు….. ఇలా ఎన్నో తప్పులు చేసిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్, ఆక్సిజన్ పై రాజకీయాలు మాత్రం చేస్తున్నాయి.

బిజెపి, బిజెపి వత్తాసు పార్టీలు, బిజెపి వ్యతిరేక పార్టీలు, తటస్థులు….  ఇలా నాలుగు వర్గాలుగా విడిపోయి ‘‘కరోనా రాజకీయాలు’’ చేసుకుంటున్నాయి.

ప్రజలారా చావకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోండి.

Related posts

ధనుర్మాస వ్రతంలో భాగంగా ఘనంగా శ్రీ గోదాదేవి రంగనాథుని కళ్యాణం

Satyam NEWS

వేసవి లో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు

Satyam NEWS

మూడు రాజధానుల బిల్లుపై సత్యం న్యూస్ ముందే చెప్పింది

Satyam NEWS

Leave a Comment