28.7 C
Hyderabad
April 25, 2024 06: 08 AM
Slider ప్రత్యేకం

Analysis: బతుకు-బతుకుదెరువు మధ్య సాగుతున్న పోరాటం

#CoronaVirus

మన దేశంలో ఒక్కరోజే 75వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు 60 వేలు దాటిపోయాయి. కరోనా వైరస్ వీర విజృంభణ కొనసాగుతూనే వుంది. దేశంలో మొత్తంగా ఇప్పటికి కరోనా కేసుల సంఖ్య 33 లక్షలకు చేరింది. కరోనా సోకిన వారిలో 25లక్షల మంది కోలుకున్నారు.

8 లక్షల మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 76 శాతం నమోదు కావడం ఆనందించదగ్గ పరిణామం. మరణాల రేటు 1.8 శాతం ఉంది. కోవిడ్ బారిన పడిన వారు కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతోందని గగ్గోలు పెడుతున్నారు.

దారుణంగా ఉన్న కరోనా తర్వాతి పరిస్థితి

రికవరీ అయి బయటకు వచ్చిన తర్వాత కూడా, కొందరు దుష్ప్రభావాలకు గురవుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా కరోనా సోకుతున్న చిన్న పిల్లలకు దీని ప్రభావం చాలా దారుణంగా ఉంది. అధిక జ్వరం, వళ్లంతా  దద్దుర్లు, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి మొదలైనవి  రావడం చాలా ప్రమాదకర ధోరణిగా భావించాలి.

10ఏళ్ళ లోపు పిల్లలకు కూడా వైరస్ సోకడం, సోకిన తర్వాత వస్తున్న ఆందోళనకర పరిణామాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సత్వరమే గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతోంది. సహజమైన కోవిడ్ లక్షణాలతో పాటు అదనంగా దుష్ప్రభావాలు కలుగడం వైద్యులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో ఏమో

కరోనావ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. అందరూ వ్యాక్సిన్ల మీద ఆశ పెట్టుకున్నారు. వ్యాక్సిన్లు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయి, వచ్చినా, ఏ మేరకు పనిచేస్తాయన్న విషయంలోనూ ఇంతవరకూ స్పష్టత లేకపోవడం కూడా ఆందోళన కల్పించే అంశంగా మారింది.

ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న టీకా రెండో దశ క్లినికల్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయని అంటున్నారు. ఇప్పటి వరకూ ప్రయోగాలు చేసిన వారిని గమనిస్తే, ఎటువంటి ఇబ్బందులు, దుష్ప్రభావాలు కలుగలేదని చెబుతున్నారు.

మెల్ బోర్న్ టీకా నుంచి మంచి ఫలితాలు

 వీటన్నింటి కంటే కీలకమైనవి మూడవ దశ ప్రయోగాలు. ఇవి కొన్ని వేల మంది మీద జరపాలి. విభిన్న వయస్సులు,ప్రాంతాలు జన్యుపరమైన వైవిధ్యం కలిగినవారు, వివిధ ఆరోగ్యాల నేపధ్యం ఉన్నవారిపై జరపాలి. అదే విధంగా ఫలితాల  తీరును పరీక్షించడానికి  పట్టే సమయం కూడా ఎక్కువ ఉంటుంది.

మెల్ బోర్న్ టీకా కూడా ప్రయోగాల్లో మంచి ఫలితాలను నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తోందనే వార్తలు వింటున్నాం. మెడెర్నా కంపెనీ తయారుచేస్తున్న టీకా తుది దశ ప్రయోగాల్లో ఉందని సమాచారం. ఇప్పటి వరకూ జరిపిన ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని తెలుస్తోంది.

ఫైజర్ వ్యాక్సిన్ కూడా తుది దశలోనే…

55నుండి 70ఏళ్ళు, 70ఏళ్ళు పైబడిన వారిపై ఇప్పటి వరకూ జరిపిన ప్రయోగాల్లోనూ మంచి ఫలితాలు రావడం ఈ టీకాకు సంబంధించిన అంశంలో విశేషమైనదిగా చెప్పాలి. వ్యాక్సిన్ వయోవృద్ధులకు కూడా పనిచేస్తుందనే భరోసా ఈ టీకా ప్రయోగాల ద్వారా కలగడం శుభ పరిణామంగా భావించాలి.

ఫైజర్ కంపెనీ రూపొందిస్తున్న వ్యాక్సిన్ కూడా తుది దశ ప్రయోగాల్లో నిమగ్నమైందని సమాచారం. భారత్ సంస్థలు కూడా వ్యాక్సిన్ ప్రయోగాల్లో తలమునకలై ఉన్నాయి. ఏది ఏమైనా, త్వరలో వ్యాక్సిన్ రావాలి. వచ్చిన వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేయాలి.

అప్పటి వరకూ జరిగే చికిత్సలు, వాడే మందుల్లో నాణ్యతా ప్రమాణాలు పెరగాలి. వీటన్నింటిపై పటిష్టమైన పర్యవేక్షణ జరగాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, స్పష్టమైన మార్గదర్శనం చేస్తూ, ప్రభుత్వాలు ముందుకు సాగాలి.

కోట్లాది మంది ప్రజలు వ్యాక్సిన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. బతుకు-బతుకుదెరువు మధ్య సాగుతున్న ఈ పోరాటానికి ముగింపు ఎన్నడో.

– మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

నల్లమలను కాపాడుకుందాం: పెరుగుతున్న మద్దతు

Satyam NEWS

పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనానికి మేం రెడీ

Satyam NEWS

అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించవద్దు

Satyam NEWS

Leave a Comment