35.2 C
Hyderabad
April 24, 2024 12: 03 PM
Slider ప్రపంచం

ఎనాలసిస్: చర్చల మాటున.. చిచ్చుల బాటన…

#India China Boarder

భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య పరస్పర భవిష్యత్సంబంధాల  అంశంపై అంతర్జాతీయ మీడియాలో చర్చ తెరపైకి వచ్చింది. చారిత్రక సైనో ఇండియాల ద్వైపాక్షిక ఒప్పందాలు, పరస్పర అంగీకార నిర్ణయాల అమలులో అనిశ్చితి చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

ఒక వైపు చర్చలు జరుగుతున్నా రెండువైపులా ఏదో తెలియని అనుమానమే వెంటాడుతున్నది. 1962 నాటి స్థితిగతులపై పునర్విచానాన్ని రెండు దేశాలు కోరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. జూన్ 6 నాటి ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చైనా అంటూనే యుద్ధ సన్నాహాలు చేస్తోంది.

శాంతివచనాలు పలుకుతూనే కవ్విస్తున్న దుష్ట చైనా

భారీ సైన్యాన్ని, యుద్ధసామాగ్రిని మోహరిస్తోంది. శాంతి వచనాలు పలుకుతూనే కవ్వింపు ధోరణికి తెగబడడం చైనా ద్వంద్వవైఖరికి అద్దం పడుతోంది. యూఎస్ ఎస్ ఆర్ చీలిక అనంతర పరిణామాలతో అమెరికా అజేయశక్తిగా అవతరించింది. కానీ…అతికొద్ది కాలంలోనే చైనా సర్వతోముఖాభివృద్ది సాధించి ప్రపంచదేశాలలో అమెరికాకు పోటీగా నిలబడడం విశేషం. ప్రపంచ మార్కెట్లో చైనా అత్యధిక భాగం చేజిక్కించుకుంది. 

చైనా ఉత్పత్తులను గణనీయంగా దిగుమతి చేసుకునే దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఫార్మా, టెలి కమ్యూనికేషన్, సాంకేతిక రంగాలలో చైనాపై ఆధారపడడం ఎక్కువైంది. చైనా ఉత్పత్తులు నాణ్యత విషయంలో అధమస్థానంలో ఉన్నా చౌకగా లభ్యం కావడంతో భారత్ లో వినియోగదారుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది.

వాణిజ్యం మాటున దాగి ఉన్న కుట్ర

భారత్, చైనాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు అనూ హ్యంగా పెరిగాయి. అయినా భారత్, చైనా సరిహద్దుల్లో చైనా జవానుల కవాతు లో మార్పు రాలేదు. వాస్తవాధీ న రేఖ పొడవునా కొన్ని వందల మైళ్ళ మేర దురాక్రమణలు, చొరబాట్లు చోటుచేసుకోవడం చైనా దమననీతిని తెలుపుతోంది.

ట్రిలియన్ డాలర్లుతో ముడిపడిన వాణిజ్య సంబంధాలు ఇప్పుడు డోలా యమానంలో పడ్డాయి. ఒకవైపు కోవిడ్-19 సంక్షోభం తో ప్రపంచం కలవరపడుతున్న సమయంలో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించే పన్నగానికి పాల్పడడం అనైతికచర్యగా బ్రిక్స్ సభ్యదేశాలు తప్పుపడుతున్నాయి.

కరోనా వ్యాప్తిపై ఐక్యరాజ్యసమితిని సైతం తప్పుదోవపట్టించి అంతర్జాతీయ సమాజం ముందు చైనా దోషిగా నిలబడినట్లు అమెరికా మొదటి నుంచి దుయ్యబదుతూనే ఉంది.  చైనాను గుడ్డిగా సమర్ధించిన ఐరాస ను అమెరికా లక్ష్యపెట్టని పరిస్థితి నెలకొంది. భారత్ సైతం తన వాదానికి మద్దతు తెలిపాలని అమెరికా ఒక దశలో ఒత్తిడి చేసినా భారత్ సంయమనం పాటించింది.

ఆసియాలో ఎదురులేని శక్తిగా మారాలనే దురాలోచన

చైనా తో ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక అంశాలపై ఎటువంటి నష్టపరిచే ప్రభావం పడకూడదని ఆచితూచి అడుగులు వేస్తోంది. అమెరికా బీజింగ్ ను ఆర్ధికంగా,సాంకేతికంగా కట్టడి చేసే నేపథ్యంలో భారత్ సహకారాన్ని కోరుకుంది. ఇదే అదనుగా భారత దేశం అమెరికా చేతిలో పావు కారాదని  హెచ్చరించి చైనా దురహంకారాన్ని ప్రదర్శించింది.

ఆసియాలో ఎదురులేని శక్తిగా అవతరించాలన్న దురాశతో భారత్ ప్రగతికి మోకాలడ్డుతోంది. అంతే కాక..పొరుగున ఉన్న దక్షిణాసియా దేశాలతో భారత్ కు ఆకారణ విభేదాలు సృష్టిస్తోంది. ఐక్యరాజ్య సమితి కి చెందిన భద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం విషయంలో చైనా కుత్సితంగా వ్యవహిరిస్తోంది.

అణు ఇంధన సరఫరా వ్యవహారం లో కూడా చైనా భారత్ కు వ్యతిరేకంగా కుయుక్తులు పన్నుతున్నట్లు ఆయా రంగ నిపుణులు అంటున్నారు. భారత్,పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలలో చైనా జోక్యం చేసుకోవాలని వేసిన పథకాన్ని భారత్ విజయవంతంగా తిప్పి కొట్టింది. 

పాకిస్థాన్ ను భారత్ కు వ్యతిరేకంగా ఎగదోయడానికి  చైనా అనేక విధాల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భారత్, చైనాల మధ్య సంబంధాలు ఏ రీతిలో ఉండగలవన్నది ప్రస్తుత పరిస్థితుల్లో ఊహకందనిది. భారత దేశం చైనా పెట్టుబడులను నియంత్రిస్తే రాగల పరిణామాలు ప్రశ్నగా మిగిలాయి.

చైనా స్వరం భవిష్యత్తులో మారే అవకాశం ఉందా?

సూపర్ శక్తిగా అవతరించాలని కలలు కంటున్న చైనా భారత్ వంటి లౌకిక దేశంతో తెగతెంపులు చేసుకోవడం అసంభవం. చర్చలు ద్వారా శాంతినెల కొల్పాలని చైనా స్వరం మార్చినా ఆశ్చర్యం లేదు. అమెరికా తో సమఉజ్జీగా తలపడాలంటే భారత్ తో స్నేహసంబంధాలు ఉండాల్సిందేనని చైనా ప్రభుత్వం లో కొందరు రాజకీయ మేథావులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ విదేశాంగ నిపుణుల అంచనా ప్రకారం ఇరుగుపొరుగు దేశాలతో సాధ్యమైన మేరకు సంయమనం పాటించే భారత దేశానికి బ్రిక్స్ సభ్యదేశాలు సహా ఐరాస దేశాలు మద్దతుగా  నిలబడగలవన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కోవిడ్-19 సృష్టించిన ఆర్ధిక ఇబ్బందులను అధిగమించి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశప్రగతి సానుకూల దిశగా అడుగులు వేయగలదు.

దేశీయంగా అన్నింటిని ఉత్పత్తి చేసుకోవాలి

విదేశీ ఉత్పత్తుల దిగుమతులను క్రమంగా తగ్గించుకుని , స్వదేశీ ఉత్పత్తులను పెంచుకునే విధంగా భారతదేశం సంకల్పిస్తే మెరుగైన ఫలితాలుఅనతి కాలంలోనే సాధించ వచ్చు. గ్రామీణ ఉపాధి కల్పన అవకాశాలకు పెద్దపీట వేసి దేశ జాతీయ సంపదను పెంచవచ్చు.

చైనా వంటి దేశాలను నాసిరకం ఉత్పత్తుల కోసం వెంపర్లాడడం మానుకుని దేశీయంగా యోచిస్తే ఆర్ధిక ప్రగతి సుసాధ్యమంటున్న ఆర్ధిక రంగ నిపుణుల సూచన ఆచరణీయం. చైనా కుటిల యత్నానికి చెక్ పెట్టడానికి ఇదే అనువైన సమయం.

పొలమరశెట్టి కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ఏకగ్రీవ ఎన్నిక

Satyam NEWS

సి-డాక్ తో సిబిఐటి అవగాహన ఒప్పందం

Bhavani

ఎన్ఎస్ఎస్‌ వాలంటీర్ అవార్డుకు వీఎస్యూ విద్యార్థి ఎంపిక‌

Sub Editor

Leave a Comment