27.7 C
Hyderabad
March 29, 2024 01: 25 AM
Slider ప్రత్యేకం

ఎనాలసిస్: చొచ్చుకువచ్చే చైనాకు చుక్కలు చూపించగలం

#Indian Army

శాంతియుత వాతావరణం కోసం చర్చలు జరుగుతూ ఉన్నప్పటికీ, చైనా సమాంతరంగా మన సరిహద్దుల్లో సైన్యాన్ని పెద్దఎత్తున మోహరిస్తోంది. చైనా రోజు రోజుకూ దూకుడు పెంచుతోంది. ఇవ్వన్నీ గమనిస్తున్న మనవాళ్ళు కూడా, దీటుగా సిద్ధమవుతున్నారు. లడాఖ్ లో వివాదం ముదురుతున్నట్లుగానే భావించాలి.

ఈ నేపథ్యంలో, దిగుమతి చేసుకోవాల్సిన ఆయుధాలను శరవేగంగా రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో, రఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి భారత్ కు త్వరలో రానున్నాయని సమాచారం. భారతీయ పైలట్లకు శిక్షణ కొనసాగుతోంది. ఇవి భారత్ చేరడానికి సుమారు ఒక నెలరోజుల సమయం పట్టవచ్చు.

శక్తిమంతమైన ఆయుధాలను సమకూర్చుకుంటున్నాం

ఇవన్నీ అత్యాధునిక క్షిపణులతో కూడిన యుద్ధ విమానాలు. ఈ దశలో, ఇటువంటి శక్తివంతమైన ఆయుధాలు మన అంబులపొదిలో ఉండడం అత్యవసరం, అతిముఖ్యం. గగనతల రక్షణ వ్యవస్థను కూడా కొనుగోలు చేసే దిశలో భారత్ ముందుకు వెళ్తోంది. వీటిని ఎస్-400 అంటారు. దీనికి తోడు అదనపు ఆయుధ సామాగ్రి కూడా తెప్పించుకుంటోంది. ఇవన్నీ రష్యా నుండి రావాలి. ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యా పర్యటించిన సందర్భంలో, ఆ ప్రభుత్వాన్ని బలంగా కోరినట్లు సమాచారం.

ఇటువంటి గగనతల రక్షణ వ్యవస్థను చైనా ఈపాటికే కొని, దగ్గర పెట్టుకుంది. ఈ నేపథ్యంలో, వీటి దిగుమతి కోసం రష్యా ప్రభుత్వంపై భారత్ ఒత్తిడి పెడుతోంది. భారత్ కు అమెరికా ఇంటలిజెన్స్ సాయం అందిస్తోంది. శతఘ్నులలో వాడే ముఖ్యమైన గుండ్లను కూడా తెప్పించుకునే ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది. ఎం777 శతఘ్నులలో వాడే ఎక్స్ క్యాలిబర్ గుండ్లను కూడా కొనే ప్రయత్నంలో భారత్ ఉంది.

పర్వత శ్రేణుల్లో యుద్ధానికి సన్నద్ధం

జీపీఎస్ ఆధారంగా వాడే ఈ గుండ్లు పర్వత యుద్ధతంత్రంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. లడాఖ్ ప్రాంతంలో, పర్వత శ్రేణుల్లో మోహరించడానికి, సరిహద్దుల్లో చైనాను దీటుగా ఎదుర్కోడానికి భారత్ మెరుపువేగంతో సిద్ధమవుతోంది. భారతదేశం ప్రధానంగా శాంతికాముక దేశం.

చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకొని శాంతి, సామరస్యాలు స్థాపించాలనే లక్ష్యంతోనే  మన పాలకులందరూ విదేశాంగ విధానం  పాటించారు. పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం, చైనా, ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ, మన భూభాగాలను దురాక్రమించాలనే దురుద్దేశ్యంతో అనైతికంగా ప్రవర్తిస్తోంది.

ప్రధాని మోడీ శాంతిస్థాపనకు యత్నాలు

ప్రధాని నరేంద్రమోదీ శాంతి స్థాపనకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా, చైనాతో వారం వారం  చర్చలు జరిపే దిశగా అంగీకారం కుదుర్చుకున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడమే ప్రస్తుత లక్ష్యం. ఇరుదేశాలకు సంబంధించిన విదేశాంగ, రక్షణ, హోం శాఖ, సైనిక బలగాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొంటారు.

భారత్ -చైనా మధ్య ఉన్న ఈ సరిహద్దు భూవివాదం సుదీర్ఘంగా సాగుతోంది. యుద్ధాలు, చర్చలు, కవ్వింపుచర్యలు రావణాసుర కాష్టంలా సాగుతున్నాయి. వీటికి ఎప్పుడు పరిష్కారం ఉంటుందో కాలమే సమాధానం చెప్పాలి. సందర్భాన్ని బట్టి భారత్ ప్రవర్తిస్తోంది. కొంతకాలం క్రితం,  డోక్లామ్ లోనూ రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు సుదీర్ఘకాలం నడిచాయి.

ఆక్రమించుకోవడం చైనా అలవాటు

ప్రస్తుతం మళ్ళీ అటువంటి పరిస్థితులే పునరావృతమవుతాయా, 1962లాగా యుద్ధం జరుగుతుందా వేచి చూడాల్సిందే. 1962లో భారత్ తో యుద్ధం చెయ్యడమేకాక,  అక్సయ్ చిన్ ను చైనా ఆక్రమించుకుంది. 1967లో సిక్కింలోని నాథులా కనుమల దురాక్రమణకు దిగింది. ఈ పోరులో,  చైనా నష్టపోయి వీపు చూపించింది. 1987లోనూ అరుణాచలప్రదేశ్ లోని సమ్ దురాంగ్ ను ఆక్రమించుకోడానికి శతధా ప్రయత్నం చేసింది.

భారత్ తీవ్రంగా ప్రతిఘటించడంతో చైనీయులు వెనుతిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం,  అమెరికా – చైనా మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో, అమెరికా పూర్తిగా, నేడు భారత్ వైపు నిలుస్తోంది. చైనాను పోరాడే క్రమంలో భారత్ కు తమ అండదండలు సంపూర్ణంగా ఉంటాయని అమెరికా ఇప్పటికే బహిరంగంగా ప్రకటించింది.

అమెరికా అండగా నిలుస్తున్నది

ప్రస్తుత అమెరికా అండతో పాటు, భారత్ కూడా ఈ 50 ఏళ్ళల్లో రక్షణపరంగా  తన బలాన్ని బాగా పెంచుకుంది. చైనాతో పోల్చుకుంటే, పర్వతాలపై యుద్ధతంత్రంలో మన వాళ్ళకే సుదీర్ఘమైన అనుభవం ఉంది. రష్యా నుండి, అమెరికా నుండి కావాల్సిన అదనపు బలాలు భారత్ అంబులపొదిలో ఇప్పటికే చేరాయి.

టీ72 యుద్ధ ట్యాంకులు, షినూక్, అపాచీ హెలికాప్టర్లు మన దగ్గర ఉన్నాయి. గగనతల యుద్ధంలో మనదే పైచేయి అవుతుంది. చైనా దగ్గర ఎయిర్ డిఫెన్స్ బలంగా ఉంది. మనదగ్గర ఉండే సుఖోయ్ లు తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించగలవు. భారత్ తో తలపడడానికి భౌగోళికంగా చైనాకు కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి.

మనదేశ సరిహద్దు మంచుతో నిండిన ప్రాంతం. ఇలా విశ్లేషించుకుంటే, భారత్ కు ఎన్నో అనుకూలమైన అంశాలు,  బలాలు ఉన్నాయి. అదే సమయంలో,  శత్రుదేశాన్ని తక్కువ అంచనా వెయ్యకూడదు. చైనా ఆర్ధికంగా, వ్యూహాత్మకంగా చాలా బలమైన దేశం. నిజంగా యుద్ధం వస్తే, ఇద్దరికీ మంచిది కాదు.

సహకారచర్చలు, సంప్రదింపుల ద్వారా యుద్ధ వాతావరణాన్ని పోగొట్టి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించి, శాంతిని నెలకొల్పడమే శ్రేయస్కరం, వివేకం. ఇరుదేశాల పాలకులు సామరస్య వైఖరితోనే ముందుకెళ్తారని ఆశిద్దాం.

-మాశర్మ సీనియర్ జర్నలిస్టు

Related posts

మార్పులు, చేర్పులకు 1820 దరఖాస్తులు

Bhavani

సామాన్యుల నడ్డి విరిస్తున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS

విజయనగరం జిల్లా ఎస్పీతో కమ్యూనికేషన్ రీజనల్ ఎస్పీ భేటీ

Satyam NEWS

Leave a Comment