30.3 C
Hyderabad
April 16, 2021 12: 37 PM
Slider ప్రపంచం

Analysis: ఇండియా -పాకిస్తాన్ భాయీ భాయి

#IndoPakBoarder

భారతదేశం – పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపన దిశగా అడుగులు పడడం శుభ సూచకం. రెండు దేశాల సరిహద్దుల్లో వివాదాలకు చరమగీతం పాడాలని ఇద్దరూ అనుకోవడం కీలకమైన పరిణామం. ఇరు దేశాల ఉన్నతాధికారులు ఇటీవలే సమావేశమై చర్చలు జరిపారు.

భారత్ – పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగి కూడా చాలా కాలమైంది. మళ్ళీ ఇన్నాళ్లకు జరిగాయి.రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ అఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజిఎంఓలు) మొన్న బుధవారం నాడు హాట్ లైన్ లో చర్చించుకున్నారు. నియంత్రణ రేఖల వెంబడి కాల్పులు విరమించాలని రెండు దేశాలు 2003లో ఒప్పందానికి వచ్చాయి.

కానీ అవి ఆచరణకు నోచుకోలేదు. హింసాత్మాక సంఘటనలే చోటుచేసుకున్నాయి. ఒప్పందాలను పాకిస్తాన్ అనేకసార్లు  ఉల్లంఘించి,సరిహద్దుల్లో భయానక వాతావరణాన్ని సృష్టించింది. 2016లో ఉరి సెక్టార్ పై ఉగ్రవాదుల దాడి మొదలైన దరిమిలా, ఉల్లంఘనల పర్వం కొనసాగుతూనే ఉంది.

గడచిన మూడేళ్లలో పాకిస్తాన్ 10,752సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఈ మధ్యనే లోక్ సభలో కేంద్రం ప్రకటించడం గమనార్హం. పాక్ సైన్యం కాల్పుల దుశ్చర్య వల్ల భారతదేశం 70మంది భద్రతా సిబ్బందిని, మరో 70మంది సామాన్య పౌరులను కోల్పోయింది.ఆ అగ్ని అలా రగులుతూనే ఉంది.

వివాదాలకు ఆజ్యం పోసిన చైనా

స్వయంగా భారత్ పై పాకిస్తాన్ కు ఉన్న శతృభావనకు చైనా ఆజ్యం పోసింది. అన్ని రకాల అండదండలు అందిస్తానని హామీ ఇచ్చింది. చైనా ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహం, దుష్ప్రభావంతో భారత్ పై పాకిస్తాన్ మరింత రెచ్చిపోయింది. భారత్ సరిహద్దు దేశాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకొని, భారత్ పై ఉక్కుపాదం మోపాలని చైనా పన్నిన కుట్రలో పాకిస్తాన్ కూడా భాగస్వామ్యంగా నిలిచింది.

కశ్మిర్, లడాఖ్ ప్రాంతాల్లో చైనా, పాకిస్తాన్ కు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని దక్కించుకోడానికి ఆ రెండు దేశాలు ఏకమై భారత్ పై కక్షను పెంచుకున్నాయి. భారత్ సరిహద్దుల్లో రెండు దేశాలు విలయాన్ని సృష్టించాయి. భారతదేశంపై యుద్ధాన్ని ప్రకటించాలని చూశాయి. తాజాగా,ఎందుకో? వరుసగా రెండు దేశాలు భారత్ తో స్నేహపూర్వక వాతావరణాన్ని కాంక్షిస్తున్నాయి.

అందులో భాగంగా, చైనా ముందడుగు వేసింది. లడాఖ్ సరిహద్దుల్లో సైనిక బలగాలు, బలాల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టింది. ఇది మొదలైన కొద్ది సమయంలోనే పాకిస్తాన్ కూడా సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఆసక్తి కనపరచింది. రెండు దేశాల మధ్య ఎన్నో ఏళ్ళుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించాలని భారత్ తో పాకిస్తాన్ చర్చలకు శ్రీకారం చుట్టింది.

ఇరు దేశాలలోనూ అనూహ్య మార్పు

ఇది రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న అనూహ్య పరిణామంగానే అందరూ భావిస్తున్నారు. ఈ పరిణామాల వెనక ఏదైనా బలమైన వ్యూహం దాగిఉందా? అన్నది భావికాలంలో తేలిపోతుంది. అటు చైనాతోనూ,ఇటు పాకిస్తాన్ తోనూ మనకు యుద్ధాలు జరిగాయి.

బలగాలను ఉపసంహరించుకున్నట్లు నటించి, చైనా మనపై దొంగదెబ్బ తీసింది. అదే 1962యుద్ధం. దీని వల్ల మనం చాలా నష్టపోయాం. ఆ తర్వాత 1965,67 మొదలు 2020,21లో కూడా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. మనం గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం వల్ల, కొంత రాటుతేలగలిగాం.పాకిస్తాన్ తో 1947,65,71 మొదలు 1999లో కార్గిల్ వరకూ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.

పాకిస్తాన్ కంటే మనది అనేక రెట్లు బలమైన దేశం కాబట్టి, ఆ దేశాన్ని మట్టి కరిపించగలిగాం. ఇటీవల చైనాతో మనకు వరుసగా ఘర్షణలు జరిగాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ తో కూడా జరిగాయి. ఇప్పుడు రెండు దేశాలు భారత్ తో శాంతిస్థాపనకు సిద్ధమవుతున్నాయి.

సరిహద్దు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం సర్వదా క్షేమకరం. ఇది నూటికి నూరు శాతం ఆహ్వానించదగ్గ పరిణామం. భారత్ -పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపన జరగాలంటే చాలా అంశాలపై చర్చలు జరగాలి. వాటిపై ఒక అంగీకారానికి రావాలి. వాటిల్లో ప్రధానమైంది కశ్మిర్ అంశం.

చర్చల ద్వారా శాంతి సాధ్యమేనా?

దాని చుట్టూనే ఉగ్రవాదం వేళ్లూనుకుంది. భారతదేశానికి సంబంధించిన కశ్మిర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. పాక్ ఆక్రమిత కశ్మిర్ ను వెనక్కి తెస్తామని మన దేశాధినేతలు ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు. నేటి ప్రధాని నరేంద్రమోదీ కూడా అదే చెబుతున్నారు.

ప్రశాంత వాతావరణంలో, శాంతి చర్చల ద్వారా దీన్ని సాధించడం సాధ్యమేనా? అన్నది ప్రధానమైన ప్రశ్న. కశ్మిర్ మొత్తం భూభాగంపై పాకిస్తాన్ కు ఎప్పటి నుంచో కన్నుంది.ఇన్నేళ్ల నుంచి, ఏదో విధంగా కశ్మిర్ భూభాగాన్ని చాలా వరకూ కాపాడుకున్నాం.

రాజా కరణ్ సింగ్ తండ్రి రాజా హరిసింగ్ కాలం నుంచి కశ్మిర్ భూభాగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఐనప్పటికీ, ఇంకా కొంత భాగం పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది. ఈ సున్నితమైన సమస్యను రెండు దేశాలు ఎట్లా పరిష్కరించుకుంటాయి? అన్నది కీలకం.

ఈ అంశానికి పరిష్కారం లభించకపోతే, రెండు దేశాల మధ్య శాంతి స్థాపన సాధ్యమా అన్నది ప్రశ్న. ఉగ్రవాదం అంతమవ్వాలని అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. అదే సమయంలో, ఎవరిస్వార్థం వారికి ఉంది. ప్రస్తుతం చైనా పూర్తిగా పాకిస్తాన్ వైపే ఉంది.

రెండు పడవలపైన అమెరికా కాళ్లు

భారత్ -పాకిస్తాన్ రెండు దేశాలతోనూ అమెరికా స్నేహాన్ని కొనసాగిస్తోంది. అది అమెరికాకు రెండు దేశాలతో ఉన్న అవసరం. వాణిజ్య,ఆర్ధిక ప్రయోజనాల దృష్ట్యా చైనాకు  భారతదేశంతో ఎంతో అవసరం ఉంది. లోపల శత్రుత్వం ఉన్నప్పటికీ, అవసరాలను దృష్టిలో పెట్టుకొని, మనతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని చైనా చూస్తోంది.

చైనా ఎటు వెళితే, పాకిస్తాన్ అటు వెళ్తుంది.అందులో భాగమే తాజా పరిణామం.భారత్ సహజంగానే శాంతి కాముక దేశం. బంధాలు ఏ విధంగా మెరుగుపడతాయి,అన్నది రెండు దేశాల విధానాలపైనే ఆధారపడి ఉంటాయి.

కశ్మిర్ అంశంలో స్టేటస్ కో పాటించే అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది జరుగుతుందా అనేది అనుమానమే. ఇరు దేశాల సామాన్య ప్రజల మధ్య ఎటువంటి శత్రుత్వాలు లేవు. విభేదాలు రెండు దేశాల ప్రభుత్వాల మధ్యనే ఉన్నాయి.

వాటి పరిష్కారమే కీలకం. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన జరగాలని, స్నేహపూర్వక వాతావరణం ఏర్పడాలని కోరుకుందాం

– మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

కొల్లాపూర్ దళిత కాలనీ అభివృద్ధి కోసం అడుగులు

Satyam NEWS

కావలి సువర్ణమ్మ కు ఘనంగా నివాళులు అర్పిద్దాం

Satyam NEWS

వై ఎస్ జగన్ అనర్హత పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!