వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజంనే భయపడ్డారు. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తాము హాజరు కావడం లేదని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా అసెంబ్లీ సమావేశాలపై జగన్ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎలాగూ తాము అసెంబ్లీకి వచ్చినా… ప్రజా సమస్యలపై తాము గళమెత్తేందుకు సిద్ధంగానే ఉన్నా… అందుకు అనుగుణంగా తమకు మైకులు ఇవ్వరంటూ ఆయన వ్యాఖ్యానించారు.
మైకులు ఇవ్వని దానికి అసెంబ్లీకి రావడమెందుకని కూడా ఆయన ప్రశ్నించారు. మీడియా సంస్థల మైకులే తమకు స్పీకర్లని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మీడియా మైకుల ముందే చంద్రబాబు సర్కారును నిలదీస్తామని కూడా జగన్ అన్నారు. మొత్తంగా కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తాము హాజరు కావడం లేదని జగన్ తేల్చి చెప్పేశారు. సోషల్ మీడియాలో కూటమి సర్కారు పెద్దలను తూలనాడుతూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెడుతున్న పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి సర్కారు… సదరు యాక్టివిస్టులపై వరుసగా కేసులు నమోదు చేయడంతో పాటుగా అరెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై సర్కారు తీరును నిరసించేందుకు జగన్ గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పనిలో పనిగా అసెంబ్లీ సమావేశాల హాజరుపై కూడా ఆయన మాట్లాడారు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాంక్ అయిన జగన్… ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదనే చెప్పాలి. ఎన్నికల తర్వాత తొలిసారిగా అసెంబ్లీ జరగగా…ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు మాత్రమే శాసనసభకు వచ్చిన జగన్ ఆ తర్వాత సభకు దూరంగా ఉంటున్నారు. జగన్ బాటలోనే ఆయన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు.
ఇదిలా ఉంటే… జగన్ కు జనం ఇచ్చిన సీట్లను ఆయనకు పదే పదే గుర్తు చేస్తున్న కూటమి సర్కారు… జగన్ పార్టీకి దక్కిన సీట్ల సంఖ్య 11 ప్రతిధ్వనించేలా…అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 11వ నెల, 11వ తేదీ నుంచి 11 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కూటమి పార్టీల నేతలు… ప్రత్యేకించి టీడీపీ నేతలు పదే పదే మీడియా ముందు ప్రస్తావిస్తూ జగన్ ను ఓ రేింజిలో ర్యాగింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ర్యాగింగ్ జగన్ కు గట్టిగానే తగిలినట్టుంది.
అందుకే సమావేశాలు మొదలుకావడానికి ముందే జగన్ పలాయనవాదాన్ని ఎంచుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ర్యాగింగ్ ను ఎలాగోలా భరించి… అసెంబ్లీకి వెళ్లినా… గతంలో వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ నేతలు వ్యవహరించిన తీరుకు ఏమాత్రం తగ్గకుండా టీడీపీ సభ్యులు జగన్ అండ్ కోను ఓ ఆటాడుకోవడం ఖాయమేనని చెప్పాలి. దీనిని కూడా అంచనా వేసిన మీదటే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
ఇక స్పీకర్ తమకు మైకు ఇవ్వరంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే… ఇటీవలే ఈ దిశగా స్పీకర్ హోదాలో ఉన్న టీడీపీ సీనియర్ మోస్ట్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్లు ఠక్కున గుర్తుకు వస్తున్నాయి. జగన్ తో పాటు వైసీపీ సభ్యులంతా అసెంబ్లీ సమావేశాలకు రావాలని తాను ఆశిస్తున్నానని అయ్యన్న ఈ మధ్యే ఓ కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా జగన్ తోపాటు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తే… వారు ప్రజా సమస్యలు లేవనెత్తడానికి వీలుగా వారికి తగినంత సమయం మేర మైకు కూడా ఇస్తానని కూడా అయన అన్నారు.
అయితే జగన్ మనస్తత్వం తెలిసిన అయ్యన్న ఆ సందర్భంగా ఓ కీలక వ్యాఖ్య చేశారు. స్పీకర్ కుర్చీలో ఉన్న తనకు నమస్కారం చేయడం జగన్ కు ఇష్టం ఉండదని, ఈ నేపథ్యంలో కేవలం తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందన్న కారణంతోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అయ్యే అవకాశాలున్నాయని అయ్యన్న అభిప్రాయపడ్డారు. అయ్యన్న మాటను నిజం చేస్తూ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని తేల్చిచెప్పేశారు.