18 C
Hyderabad
November 27, 2020 22: 22 PM
Slider సంపాదకీయం

Analysis: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తలవంపులు

#HighCourtofAP

తన స్వతంత్రతను పరిరక్షించుకోవడానికి న్యాయవ్యవస్థ నడుంకట్టినట్లుగా కనిపిస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగం అచేతనంగా ఉండిపోతే వేరే వ్యవస్థలు పని చేయడం కష్టం అని ఇంత కాలం అందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే కార్యనిర్వాహక వ్యవస్థ పని చేయనిపక్షంలో ఏం చేయాలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దిశానిర్దేశం చేసేందుకు సమాయత్తం అయినట్లుగా కనిపిస్తున్నది.

జడ్జీలను దూషించిన కేసును సీబీఐకి అప్పగించడం ఇందుకు తొలి మెట్టుగా భావించవచ్చు. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు నేడు సంచలన ఆదేశాలిచ్చింది. 8 వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది.

సామాజిక మాధ్యమాలలో ఇటీవల జడ్జీలను దూషించిన వారిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఎంత పెద్ద వారైనా న్యాయమూర్తులను విమర్శిస్తే కేసులు నమోదు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

ముఖ్యమంత్రి లేఖపై విస్తృత చర్చ

తీర్పులు వ్యతిరేకంగా వస్తున్న నేపథ్యంలో న్యాయమూర్తుల వివేచనను ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన క్రమంలో ఏపి హైకోర్టు ఏ విధంగా పని చేస్తుందని ఎంతో మంది ఆసక్తి కనబరిచారు.

న్యాయవ్యవస్థ పై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి యుద్ధం ప్రకటించడం తో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో అనే పై చర్చ జరుగుతున్న సమయంలో ఏపి హైకోర్టు ఇచ్చే ఆదేశాలను కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

క్విడ్ ప్రో కో కేసులు రోజూ వారీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థతో నేరుగా తలపడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి నేరుగా న్యాయ వ్యవస్థతో తలపడేందుకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి న్యాయ స్థానాలపై నేరుగా విమర్శలు చేశారు.

న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్న పెద్దలు

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేరుగా రాజ్యసభలోనే ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేశారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ న్యాయవ్యవస్థ పని తీరును మీడియా సమావేశంలో ప్రశ్నించారు. అంతకు ముందు సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా విశేషంగా ప్రచారం జరిగింది.

ఎవరు చేశారో కనిపెట్టాల్సిన సీబి సిఐడి ఆ పని చేయలేకపోయినట్లు నేడు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో స్పష్టం అవుతున్నది. న్యాయ వ్యవస్థపై నా, న్యాయమూర్తుల పైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన 94 మందిలో సగం మందిని కూడా పోలీసులు అరెస్టు చేయలేకపోయారు.

వారిపై కేసులు పెట్టేలేకపోయారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునర్ నియామకం సందర్భంగా వ్యాఖ్యలు చేసిన వారిపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు అయి వారిపై కనీస చర్యలు ప్రారంభం అయి ఉన్నట్లయితే ఇప్పుడు హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చి ఉండేది కాదేమో.

అయితే సీఐడి పోలీసులు ఆ విధంగా చేయలేదు. దీనికి కారణాలు ఏవైనా హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేవిగానే ఉన్నాయి. తాము అంగీకరించడం వల్లే హైకోర్టు వారు కేసును సీబీఐ కి అప్పగించామని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు కొందరు చెబుతున్నారు.

విశాఖపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐకి అప్పగించినప్పుడు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దారుణమైన విమర్శలు చేశారు. ఒకదాని తర్వాత మరొకటిగా జరుగుతున్న చర్యలు ప్రతి చర్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అంతిమంగా న్యాయవ్యవస్థ పవిత్రత నిలబడితే చాలు అని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు.   

Related posts

సగం తిక్క దిగిన రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

నో లా అండ్ ఆర్డర్: రాజంపేటలో బడుగులపై దౌర్జన్య కాండ

Satyam NEWS

సర్వీస్: విద్యార్ధులలో సేవాభావాన్ని పెంపొందించాలి

Satyam NEWS

Leave a Comment