24.7 C
Hyderabad
October 26, 2021 04: 33 AM
Slider ప్రత్యేకం

22 ఏళ్లయినా `కార్గిల్’ గుణపాఠం గ్రహించలేక పోతున్నామా?

#kargil war

సరిగ్గా  22 ఏళ్ళ క్రితం, జులై 26న 1999లో కార్గిల్ వద్ద పాకిస్థాన్ సైనికులు ఆక్రమించిన  భూభాగాన్ని భారతీయ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకోవడం పూర్తయింది. ఆ రోజు స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టం. అందుకనే అప్పటి నుండి ప్రతి సంవత్సరం జులై 26ని ఆ యుద్ధంలో మన సైనికులు ప్రదర్శించిన అసామాన్యమైన పరాక్రమాలకు, త్యాగాలకు గుర్తుగా ` కార్గిల్ విజయ్ దివస్’ గా జరుపుకొంటున్నాము.

పాకిస్తాన్ సేనలు తీవ్రవాద ముసుగులో రహస్యంగా నియంత్రణరేఖను దాటుకొంటూ చొరబడి, వ్యూహాత్మకంగా కీలకమైన ఎత్తైన ప్రదేశాలను ఆక్రమించుకోగా, భారత సైనికులు నియంత్రణ రేఖ లోపలనే పోరాటం జరుపవలసి వచ్చించి.

పాకిస్తాన్ దుష్ట ప్రయత్నాలను దెబ్బతీసిన భారత సైనికుల సాహసం

ఒక వంక నైసర్గిక, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మరోవంక మన సైనికులు, ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం; మన సైనికుల వద్ద శీతలమైన పర్వత ప్రాంతాలలో పోరాటానికి అవసరమైన ఆయుధ సామాగ్రి తగినంతగా లేకపోవడంతో అత్యంత దుర్భరమైన పరిష్టితులను ఎదురుకోవలసి వచ్చింది.

అయితే, దారుణమైన ప్రతికూల పరిష్టితులలో దొంగచాటుగా దెబ్బతీసే ప్రయత్నం చేసిన పాకిస్థాన్ సేనల దుష్ట ఎత్తుగడలను మన సేనలు అనూహ్యమైన ధైర్య, సాహసాలు ప్రదర్శించి తిప్పి కొట్టి, ఘన విజయం సాధించారు. ఇదొక్క అద్భుతవమైన విజయం. కేవలం యుద్ధ భూమిలోనే కాకుండా దౌత్యపరంగా కూడా అసాధారణ విజయం సాధించిన సందర్భం.

పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు లొంగిపోకుండా, మన సైనికులు, రక్షణ నిపుణులు పాకిస్థాన్ భూభాగంలో ప్రతిదాడులు జరపాలని ఎంతగా వత్తిడి తెచ్చినా దేశ సరిహద్దులు దాటి యుద్ధం చేయకుండా నాటి ప్రధాని వాజపేయి ప్రదర్శించిన అసాధారణ వ్యూహం అంతర్జాతీయంగా పాకిస్థాన్ ను మొదటిసారిగా ఏకాకి చేయడానికి దోహదపడింది. పాకిస్థాన్ ను ఒక దురాక్రమ దేశంగా, ఉగ్రవాద దేశంగా ప్రపంచం ముందుంచడంలో విజయం సాధించాము.

మన సైనికుల పరిస్థితి ఏమిటి?

అప్పట్లో పాకిస్థాన్ కు మిత్రదేశమైన అమెరికా సహితం “ముందు కార్గిల్ పర్వతాల నుండి నీ సేనలను వెనుకకు రప్పించు, మాట్లాడదాము” అంటూ హెచ్చరిక చేసింది. తాను ఒక పక్క యుద్ధం చేస్తుంటే, మరోపక్క చైనా యద్దానికి కాలుదువ్వి భారత్ ను ఇరకారంలో పెడుతోందని పెట్టుకున్న ఆశలు కూడా గల్లంతయ్యాయి. కార్గిల్ పర్వతాల నుండి దిగిపోవలసిందే అని స్పష్టం చేసింది.

దేశ రక్షణ పట్ల దశాబ్దాలుగా మనం ప్రదర్శిస్తున్న నేరమయ నిర్లక్ష్యాన్ని సహితం ఈ యుద్ధం వెల్లడి చేసింది. సేనలకు అవసరమైన సాధారణ ఆయుధ పరికరాలు సహితం అందుబాటులో లేవు. ప్రభుత్వంలో, వివిధ సైనిక విభాగాల మధ్య తగు సమనవ్యం కూడా లేవు. దానితో యుద్ధంలో విజయంతో సంతృప్తి పడకుండా, శాశ్వత ప్రాతిపదికన ఒక జాతీయ భద్రతా వ్యూహం రూపొందించేందుకు వాజపేయి చొరవ తీసుకున్నారు.

ఈ సందర్భంగా వాజపేయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్గిల్ సమీక్ష కమిటీ అత్యవసరంగా దేశ రక్షణ వ్యవస్థను పటిష్ట పరచడం కోసం, సైన్యాన్ని ఆధునీకరించడం కోసం ఎన్నో వివిలువైన సిఫార్సులు చేసింది. వాటిని అమలు పరచే దిశగా వాజపేయి ప్రభుత్వం ఎన్నో కీలకమైన చర్యలు చేపట్టింది. అయితే ఆ తర్వాత ఆయా సిఫార్సులకు తిలోదకాలు ఇచ్చిన్నట్లు భావించ వలసి వస్తున్నది.

యుద్ధ సంసిద్ధతలో వెనకబడి ఉన్నాం

22 ఏళ్ళ తర్వాత కూడా నేడు యుద్ద సంసిద్ధతలో, సైనిక ఆధునికతలో మనం ఇంకా వెనుకబడిఉన్నాం. కార్గిల్ సందర్భంగా మన ఆయుధ సంపత్తి ఎంత దారుణంగా ఉందో కార్గిల్ సమీక్ష కమిటీ, తదుపరి మంత్రుల బృందం నివేదికలలో బహిర్గతం అయింది.

మన సేనలకు ఆధునిక ఆయుధ సంపత్తి కలిగించడం కోసం గత రెండు దశాబ్దాలుగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నా దేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్ళను దృష్టిలో ఉంచుకొంటే ఆ మేరకు జరగడం లేదని చెప్పాలి. పదేళ్ల యుపిఎ పాలనలో ఒక విధంగా విధానపరమైన అనిశ్చితి కొనసాగి సాధారణ ఆయుధ సామగ్రి కూడా సమకూర్చుకోలేని దుస్థితిలోకి నెట్టివేయబడ్డాము.

ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంవత్సరాలలో ఈ దిశగా కొన్ని విశేషమైన ప్రయత్నాలు జరిపినా అవసరమైన నిధుల కేటాయింపు జరగడం లేదు. గతంలో చెల్లించవలసిన బకాయిలు సహితం పూర్తిగా చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ముఖ్యంగా మన యుద్ధ విమానాలు చాలావరకు కాలం చెల్లినవి, యుద్ధభూమిలో తీవ్రమైన ఒత్తిడికి తట్టుకోలేని విధంగా ఉన్నాయి. అంతరిక్ష సాంకేతికతలో విశేషమైన ప్రగతి సాధిస్తున్నా అటువంటి ప్రగతి వైమానిక, నావికాదళాలలో కనబడటం లేదు.

చైనా, పాకిస్థాన్ సవాళ్లను ఎదుర్కొవాలి

చైనా, పాకిస్థాన్ ల వైమానిక సామర్ధ్యం పెరుగుతూ ఉండడంతో ఎదురవుతున్న సవాళ్ళకు దీటుగా మన సామర్ధ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. భారత రక్షణ వ్యవస్థను ఆధునీకరించడం చిట్టచివరకు సమర్ధవంతమైన ఆయుధాల కొనుగోలు, స్వదేశీ ఉత్పత్తి సామర్ధ్యం పెంచడం పైన ఆధారపడి ఉంటుంది.

ఈ మధ్య కాలంలో భారత్ రక్షణకు బడ్జెట్ కేటాయింపులు జీడీపీలో 1.5 శాతానికి తగ్గుముఖం పట్టాయి. ప్రపంచంలో రక్షణ కోసం అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న దేశాలలో ఐదవ స్థానంలో ఉన్న భారత్, ఆ నిధులలో అధిక శాతాన్ని జీతభత్యాలు, ఇతర నిర్వహణ, పరిపాలనపరమైన అంశాలకే ఖర్చు చేస్తున్నది.

ఫలితంగా త్రివిధ దళాల ఆధునీకరణకు అందుబాటులోకి వస్తున్న నిధులు తగ్గుముఖం పడుతున్నాయి. దానితో లక్ష్యాలకు చేరువలోకి రాలేక పోతున్నాము. 

చైనా సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్న సమయంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్  గత ఫిబ్రవరి లో ప్రవేశ పెట్టిన 2021-22 సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో రక్షణ రంగం అవసరాల గురించి ప్రస్తావించక పోవడం ఈ సందర్భంగా గమనార్హం.

ఆయుధ సంపత్తికి నిధులు పెంచుకోవాల్సిందే

జీడీపీలో రక్షణ రంగపు కేటాయింపులు 2016-17లో 2.9 శాతం ఉండగా, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 2.15 శాతంకు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ లో 13.73 శాతం నిధులను ఆర్ధిక మంత్రి కేటాయించారు. 2016-17లో కేటాయించిన నిధులు 17.80 శాతం కావడం గమనార్హం.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014లో ఆయుధాల కొనుగోలు ప్రక్రియను క్రమబద్ధం చేసి, స్వదేశీ రక్షణ పరికరాల అభివృద్ధి కోసం రక్షణ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. “భారత్ లో తయారీ” కార్యక్రమంలో భాగంగా మన ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.

రక్షణ పరికరాల సేకరణ విధానం క్రింద సైన్యానికి కీలక ఆయుధ తయారీ వేదికల నిర్మాణానికి “వ్యూహాత్మక భాగస్వాముల”ను సమకూర్చుకోవడం ఈ విధానాలలో ప్రధాన భాగం. అయితే అందుకు ప్రైవేట్ రంగం నుండి ఆశించిన స్పందన లభించడం లేదు.

రఫెల్ విమానాలపై కూడా అస్పష్టతే….

ఈ సందర్భంగా విధానపరమైన అస్పష్టత ఒకటి వేధిస్తున్నది. ఒక ప్రైవేట్ కంపెనీని వ్యూహాత్మక భాగస్వామిగా స్వీకరించిన తర్వాత పోటీ తత్వాన్ని ఏ విధంగా కలిగించాలనే ప్రశ్న తలెత్తుతుంది. కొత్తగా ఏర్పడిన ఒక భారతీయ ప్రైవేట్ కంపెనీని ఈ మధ్య రఫెల్ విమానాల తయారీలో భాగస్వామిగా రఫెల్ కంపెనీ ఎంచుకోవడంపై  చెలరేగిన వివాదం తెలిసిందే.

ప్రారంభ దశలో ఉత్పత్తి లేదా సాంకేతికతలో ఎక్కువ భాగస్వామ్యం కల్పించడం కోసం ఎంపిక చేసిన ప్రైవేట్ భారత కంపెనీ సామర్ధ్యం `భారత్ లో తయారీ’ ఉద్దేశాలకు తప్పనిసరిగా ప్రతికూలంగా మారే అవకాశాలు ఉంటాయి. విదేశీ ఉత్పత్తిదారులపై ఆధారపడటం కొనసాగుతూ ఉండటం వల్ల స్వదేశీ రక్షణ రంగ అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నది.

డి ఆర్ డి ఓ, హెచ్ ఎఎల్  వంటి ప్రభుత్వ రంగ సంస్థలు గత 50 ఏళ్లుగా రక్షణ ఉత్పత్తులలో ఏకఛత్రిపథ్యం వహిస్తున్నాయి. ప్రైవేట్ రంగం ప్రవేశిస్తే తమ అసమర్ధత, అవినీతి, నైపుణ్యాలేమి బైటపడుతుందనే భయంతో ప్రధాని ఎంతగా ప్రయత్నం చేస్తున్నా ప్రైవేట్ పెట్టుబడులకు వీరి నుండే ఎక్కువ అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

సంవత్సరానికి ఎనిమిది చొప్పున విమానాలను సరఫరా చేయాలనే లక్ష్యం చేరుకోవడానికి ప్రభుత్వ రంగంలో ఉన్న హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తరచూ అభివృద్ధి, నాణ్యత సంబంధమైన అడ్డంకులు ఎదుర్కొంటూనే ఉంది. కొనుగోలు ప్రక్రియ స్పష్టంగా, వివాదాస్పదం కాకుండా ఉండేవిధంగా చేయడానికి స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను రక్షణ మంత్రిత్వ శాఖ రూపొందించలేక పోతున్నది. 

నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగంలో చేపట్టిన అత్యంత ఘనమైన వ్యవస్థాగత సంస్కరణ చీఫ్ అఫ్ డెఫన్స్ స్టాఫ్ (సిడిఎఫ్)ను నియమించడం. వాజపేయి హయం నుండి ప్రయత్నాలు జరుగుతున్నా చివరకు 2020 జనవరి నుండి జనరల్ బిపిన్ రావత్ మొదటగా ఈ పదవి చేపట్టారు.

అయితే ఇప్పటివరకు అధికార పరిధులు స్పష్టం చేయలేదు. రక్షణ మంత్రిత్వ శాఖలో విధాన నిర్ణయాలలో ఇంకా ఐఏఎస్ అధికారులే పెత్తనం చేస్తున్నారు. సైనికాధికారులు తగు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దేశ రక్షణ, జాతీయ భద్రత విషయంలో కార్గిల్ గుణపాఠం గ్రహించడంలో `రాజకీయ సంసిద్ధత’ లోపిస్తున్నదని చెప్పక తప్పదు.

చలసాని నరేంద్ర, సీనియర్ జర్నలిస్టు

Related posts

కరోనా హెల్ప్: బియ్యం పంపిణీ చేసిన ప్రవాసాంధ్రులు

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులూ మనుషులే.. అంటూ కరోనా సమయంలో సాయం…!

Satyam NEWS

దయగల మానవుడి హృదయమే దేవుడి నిలయం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!