32.7 C
Hyderabad
March 29, 2024 10: 37 AM
Slider సంపాదకీయం

గుణపాఠం నేర్చుకుంటారా? కుట్ర రాజకీయాలు చేస్తారా?

#modi

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు కల్పించాయి. దేశవ్యాప్తంగా ఒక్క సారిగా రాజకీయాల్లో కుదుపు ఏర్పడింది. కర్నాటక లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని ముందు నుంచి ఊహిస్తున్నదే. కర్నాటకలో బీజేపీకి సరైన నాయకత్వం లేకపోవడం, అధికారంలోని వారు అవినీతికి పాల్పడటం తదితర కారణాలు బీజేపీని కుంగదీశాయి.

కాంగ్రెస్ పార్టీపై ఉన్న సానుభూతి, ముఖ్యంగా సిద్దిరామయ్య పై ఉన్న క్లీన్ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. సిద్దిరామయ్య, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఇంత కాలం మోసిన డి కె శివకుమార్ లు కలిసి పని చేయడం కాంగ్రెస్ పార్టీకి మరింత లాభం చేకూర్చింది. కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ వస్తే సిద్దిరామయ్య, కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ తో కలిసి అధికారం పంచుకోవాల్సి వస్తే డి కె శివకుమార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉంటారనేది కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా జరిగిన ప్రచారం.

దానికి అనుగుణంగానే నేతలు కూడా మెలగడంతో కాంగ్రెస్ పార్టీ విజయబాటలో నడిచేందుకు వీలుకలుగుతుంది. బీజేపీ చేసిన మత రాజకీయాలను కర్నాటక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వెంటనే బీజేపీ చేసిన చర్యలు కర్నాటకలో మరీ ముఖ్యంగా బెంగళూరులో వికటించాయి. హనుమాన్ చాలీసాను రోడ్లపై చదవడాన్ని బెంగళూరు ప్రజలు చీదరించుకున్నారు.

బీజేపీ కన్నా కాంగ్రెసే బెటర్ అనే నిర్ణయానికి ఆఖరు నిమిషంలో వచ్చారు. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఒక పార్టీకి ప్రచారం చేయడం, ప్రత్యర్థి పార్టీపై కువిమర్శలు చేయడాన్ని కూడా కర్నాటక ప్రజలు హర్షించలేదు. నరేంద్రమోదీ కర్నాటకలో చేసిన రోడ్ షోలు, బహిరంగ సభలు కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. ప్రధాని పూర్తిగా కర్నాటక ఎన్నికలలో పాలుపంచుకోవడం కూడా చాలా మంది హర్షించలేదు.

కర్నాటకలో 2 శాతం ఓట్లు తమ వైపు తిప్పుకుంటే చాలు మళ్లీ అధికారంలోకి రావచ్చునని నిఘా సంస్థలు అందించిన నివేదికల మేరకు మోదీ ఇంత పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. అయితే మోదీ సమ్మోహన శక్తి అక్కడ పని చేయలేదు. పని చేయడం వల్లే బీజేపీకి ఇంతమేరకు అయినా సీట్లు వస్తున్నాయి అనే వారు కూడా ఉన్నారు. మోదీ అంత శ్రద్ధ చూపకపోతే కాంగ్రెస్ పార్టీ 150 నుంచి 170 స్థానాలు సాధించి ఉండేదని కూడా మరి కొందరు అంటున్నారు.

ఏది ఏమైనా కర్నాటకలో బీజేపీ ఓటమి బాటలో పయనించడం చాలా మందికి సంతోషం కలిగిస్తున్నది. దేశవ్యాప్తంగా విజయాలు సాధించడం వల్ల నరేంద్ర మోదీ నుంచి బీజేపీలోని చాలా మంది నాయకులలో గర్వం పెరిగిపోయింది. దానికి చెక్ పెట్టడం అవసరమనే అభిప్రాయం దేశవ్యాప్తంగా న్యూట్రల్ ఓటర్లలో కనిపిస్తున్నది. మరో ఏడాదిలో జరిగే లోక్ సభ సాధారణ ఎన్నికలలో మళ్లీ బీజేపీనే గెలవాలంటే చాలా అంశాలలో పార్టీ తన తప్పులను సరిదిద్దుకోవాలి.

కర్నాటకలో ఓటమి పాలయితేనే బీజేపీ తన తప్పులను తెలుసుకోగలుగుతుంది. అందుకే కర్నాటకలో బీజేపీ ఓటమినే మెజారిటీ దేశ ప్రజలు కోరుకున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఇంకా ప్రయత్నం చేసినా, జేడీఎస్ ను కలుపుకుని, కాంగ్రెస్ ను చీల్చి ఇతర రాజకీయాలు చేసిమరీ కర్నాటకలో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని కనుక బీజేపీ ప్రయత్నం చేస్తే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు మరింత అసహించుకుంటారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజారిటీ మాత్రమే కనుక వస్తే బీజేపీ మౌనంగా ఉండి కాంగ్రెస్ తన పని తాను చేసుకునేలా వ్యవహరిస్తే బీజేపీపై గౌరవం పెరుగుతుంది.

పులిపాక సత్యమూర్తి, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

నియంత పాలన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

Satyam NEWS

తిర్యాని మండలంలో కొనసాగుతున్న పోలీసు సేవలు

Satyam NEWS

పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS

Leave a Comment