32.7 C
Hyderabad
March 29, 2024 12: 23 PM
Slider సంపాదకీయం

కేసీఆర్ మర్చిపోయిన చిన్న లాజిక్ ఇది

#CMKCR

భారతీయ జనతా పార్టీ కి ప్రత్యామ్నాయం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా వాదించారు. ఒక సారి కాదు రెండు, మూడు సార్లు ఇలా చెప్పారు. ఆ పనిని తానే చేస్తానని కూడా అందరికి అర్ధం కావడం కోసం తెలుగుతో బాటు ఇంగ్లీషు, హిందీ భాషల్లో చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన ఆ మాటలను చాలా మంది నమ్మారు. కేసీఆర్ జాతీయ స్థాయి ఎజెండాను కూడా ప్రకటించడంతో ఇక బిజెపికి ఆల్టర్నేటీవ్ టీఆర్ఎస్ పార్టీనే అనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు కూడా పూర్తయ్యాయి.

ఎవరూ అడగలేదు… చెప్పింది ఆయనే

కానీ బిజెపి ప్రత్యామ్నాయం ఏర్పాటు దిశగా కేసీఆర్ చేసిందేమీ లేదు. మళ్లీ మొన్నటికి మొన్న జీహెచ్ఎంసి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయనే స్వయంగా బిజెపి ప్రత్యామ్నాయం విషయాన్ని ప్రస్తావించారు. ముందుగా ఈ విషయంలో ఆయనను నమ్మిన వారిలో సగం మంది కూడా ఈ సారి కేసీఆర్ ప్రకటనను నమ్మలేదు.

జీహెచ్ఎంసిలో నాలుగు సీట్ల నుంచి బిజెపిని 49కి చేర్చారు. ప్రజల అనుమానమే కరెక్టు అనే విధంగా ఇప్పుడు కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం ఏమిటి? బిజెపి కీలక నాయకులను కలవడం ఏమిటి? కలిస్తే కలిశారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో అధికారంలో ఉన్నవారితో కలిస్తే తప్పేంటి అని కేసీఆర్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ప్రశ్నించవచ్చు.

ఏకాంత చర్చలతోనే ఊహాగానాలు

తప్పు లేదు. గంటల తరబడి ఏకాంతంగా చర్చలు జరపడం దగ్గరే చిక్కు అంతా వస్తున్నది. బిజెపి ప్రత్యామ్నాయ సిండికేట్ ను ఏర్పాటు చేస్తానని చెప్పిన వ్యక్తి అమిత్ షాతో గంట సేపు ఏకాంతంగా, అమిత్ షా కార్యాలయ సిబ్బందిని కూడా బయటకు పంపి ఏకాంతంలో ఏం మాట్లాడారు?

అధికారిక విషయాలు అయితే ఇరు పెద్దల కార్యదర్శులు, కార్యాలయ అధికారులు ఉండాలి కదా? ఇలా జరగలేదు కాబట్టే బిజెపి దగ్గర కేసీఆర్ మోకరిల్లారు అనే వాదన బలంగా వినిపిస్తున్నది. వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా దారుణమైన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ పనితీరును ప్రశంసించడం ఏమిటి?

ఈ ప్రశ్నకు కేసీఆర్ ను అమితంగా అభిమానించే వారు కూడా సమాధానం చెప్పలేరు. జీహెచ్ఎంసి ఎన్నికలలో చావుతప్పి కన్ను లొట్టబోయిన టీఆర్ఎస్ పార్టీ అధినేత అంతలోనే హస్తిన యాత్రకు వెళ్లడం, అక్కడ వంగి వంగి దణ్ణాలు పెట్టడం ఏం సంకేతాలు ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జీహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి జాతీయ స్థాయి నాయకులు వచ్చి ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే ప్రాణాలకు తెగించి మరీ పార్టీని విజయపథంలో నడిచారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన వ్యూహంతో ఇతర పార్టీలకు చెందిన వారిని విజయవంతంగా పార్టీలోకి తీసుకువచ్చారు.

ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ప్రచారంలో విసిరిన చెణుకులు ఓట్లను రాల్చాయి. ఇదే ఒరవడి కొనసాగిస్తే బిజెపి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అయి కూర్చుంటుందనడంలో సందేహం లేదు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ను భూస్థాపితం చేసిన కేసీఆర్ పరోక్షంగా బిజెపి ఎదుగుదలకు సహకరించారు. ఇప్పుడు అదే బీజేపీ తనను సవాల్ చేసే స్థాయికి రావడంతో ఎటూ పాలుపోని స్థితికి చేరారని చెప్పక తప్పదు. అందుకే ఢిల్లీ యాత్ర. ఢిల్లీ యాత్రలో అమిత్ షాను కలిసిన తీరు, ప్రధాని మోడీకి వంగి వంగి నమస్కారం పెడుతున్న తీరు చూసిన వారికి కేసీఆర్ బిజెపికి లొంగిపోయారు అనే భావన కలిగించకమానదు.

రాజకీయాలలో బలహీనుడే కాంప్రమైజ్ అవుతాడు. బలవంతుడు బలహీనుడిని తొక్కి పారేస్తాడు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని చేసింది అదే. కాంగ్రెస్ కొంచెం బలహీనం కాగానే కేసీఆర్ తెలంగాణలో దాన్ని తొక్కేశారు. బిజెపి తెలంగాణ రాష్ట్రంలో బలహీనంగా ఉన్నప్పటి కత వేరు.

చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా……….?

ఇప్పటి కత వేరు. తెలంగాణలో బిజెపి బలహీనంగా ఉన్నప్పుడు బిజెపి నాయకులు కేసీఆర్ కు సహకరించి ఉండవచ్చు. ఇప్పుడు బిజెపి బలం పుంజుకున్నది. ఇప్పుడు కూడా బిజెపి గతంలో లాగానే వ్యవహరిస్తుందని అనుకోవడం కేసీఆర్ చేస్తున్న మొదటి తప్పు.

ఒంటిచేత్తో తెలంగాణ సాధించిన ఘనుడు, దిగువకు పారే కృష్ణా నదిని ఎగువకు ఎత్తిపోసిన భగీరధుడు, శతవసంతాల కాంగ్రెస్ ను చిటికెన వేలితో చిదిమేసిన రాజకీయ దురంధరుడు ఈ చిన్న లాజిక్ మర్చిపోవడం ఆశ్చర్యంగా ఉంది. రాజకీయాలలో బలవంతుడు బలహీనుడిని క్షమించేసిన దాఖలాలు లేవు. అంత విశాల హృదయం ఎవరికీ ఉండదు. దణ్ణం పెట్టినా…. కాళ్లకు మొక్కినా….

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్.నెట్

Related posts

2020కి ప్లాస్టిక్ ర‌హిత న‌గ‌రంగా విజ‌య‌వాడ‌

Satyam NEWS

గవర్నర్ ను కలిసిన వైవీయూ వీసీ ఆచార్య మునగాల

Satyam NEWS

న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది

Satyam NEWS

Leave a Comment