30.7 C
Hyderabad
April 19, 2024 07: 50 AM
Slider సంపాదకీయం

ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తున్న నిమ్మగడ్డ

#TNSeshan

ప్రశాంత వాతావరణం ఎన్నికలు నిర్వహించడమే కాకుండా అశేషంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం ప్రజాస్వామ్య విజయం. ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఇందుకు అభినందించక తప్పదు.

కేవలం డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒకే ఒక్క వ్యక్తి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ప్రజాస్వామ్యం బతికింది. ఇదేదో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పొగిడేందుకు చెప్పేది కాదు. ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని మంకుపట్టు పట్టి కూర్చున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన యంత్రాంగాన్ని ఎన్నికలు నిర్వహించేలా చేయడం అంటే అది భగీరథ యత్నమే.

అత్యంత నీచమైన పదజాలంతో ఆరోపణలు

వ్యక్తిగతంగా అత్యంత నీచమైన పదజాలంతో అనునిత్యం దూషిస్తున్న పాలకులను ఎదుర్కొంటూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం మామూలు విషయం కాదు. ఇప్పటికి రెండు దశల పంచాయితీ ఎన్నికలను పూర్తిచేసి, సుమారుగా 83 శాతం మేరకు ఓటింగ్ తీసుకురావడం, అదీ కూడా ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా…. అంటే అసాధారణమే.

అందుకే ప్రజా స్వామ్య వాదులు పదే పదే డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరును గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది. 90వ దశకంలో భారత 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పని చేసిన టి ఎన్ శేషన్ ఆనాటి పాలకుల నుంచి ఎదుర్కొన్న ప్రతిఘటనతో పోలిస్తే డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎదుర్కొన్న ప్రతిఘటన వంద రెట్లు పెద్దది.

కులం పేరుతో మూకుమ్మడి దాడి

టిఎన్ శేషన్ తీసుకున్న నిర్ణయాలు జీర్ణించుకోలేని ఆనాటి పాలకులు ఎదురుతిరిగినా, అడ్డంకులు సృష్టించినా ఆయన ముందుకు వెళ్లారు. దేశానికి ‘నిజమైన ఎన్నికలు’ అంటే ఏమిటో రుచి చూపించారు. ఈ ప్రక్రియలో ‘‘టి ఎన్ శేషన్ ఫలానా కులం వాడు కాబట్టి ఇలా చేస్తున్నాడు’’ అని ఏ గాడిదా అనలేదు.

కులం అనేది మన ప్రమేయం లేకుండా వచ్చేది. మనం మార్చుకోవాలన్నా మార్చుకోలేనిది. అలాంటి అంశాన్ని పట్టుకుని వేరే వారితో జత చేసి న్యూనత పరచడం అంటే అది అత్యంత నీచమైన అంశం. అలాంటి అస్త్రాన్ని ఆంధ్రప్రదేశ్ పాలకులు నిమ్మగడ్డపై ప్రయోగించారు.

కమ్మ కులంపై ఉన్న ద్వేషమే రాజకీయ ఇంధనం

కమ్మ కులంపై విద్వేషం ఉన్న చాలా మంది అది నిజమని నమ్మారు. డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదే పదే చెబుతున్నా… ఐఏఎస్ అధికారిగా కానీ, ఆయన విద్యార్ధి దశ నుంచి ఆయన అనుసరిస్తున్న వైఖరిని గమనించకుండా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

నిమ్మగడ్డ అనే ఇంటి పేరును కూడా అత్యంత నీచంగా వాడారు. డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నియమించిన వ్యక్తి అనేది ప్రధాన ఆరోపణ. వాస్తవానికి నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా నియమించేందుకు చంద్రబాబునాయుడు ఏ సమయంలోనూ మొగ్గు చూపలేదు.

ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ పట్టుబట్టి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్ భవన్ లో అందించిన పక్షపాత రహిత సేవలను గమనించిన వ్యక్తిగా గట్టిగా సిఫార్సు చేసి నియమించేలా చేశారు.

నిజాలు తెలిసినా మభ్యపెట్టి……

పాలనాయంత్రంగంలో లేని మనకే ఈ విషయం తెలిసి ఉంటే మరి పాలన చేసేవారికి ఈ విషయం తెలియదా? తెలుసు. కానీ రాజకీయ అవసరాల కోసం కులాన్ని వాడుకోవడంలో నిమగ్నమైన వారు అత్యంత నీచమైన ఆరోపణలు చేశారు. టి ఎన్ శేషన్ ను పలుచన చేసేందుకు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను తీసుకువచ్చి పక్కన పెట్టారు.

డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అను అయితే ఏకంగా రాత్రికి రాత్రి తీసేశారు. అయితే ఆయన మళ్లీ పదవిలోకి వచ్చిన నాటి నుంచి చేసిన ఒక్కో న్యాయ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. రాజ్యాంగ వ్యవస్థల్ని నీచంగా చూసే పాలకులు ఎప్పుడు తలెత్తినా వారి స్థానాన్ని గుర్తు చేసేందుకు ‘‘నిమ్మగడ్డ వర్సెస్ స్టేట్ ’’ కేసుల్లో సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులు రిఫరల్ కేసులుగా నిలిచిపోతాయి.

అధికార యంత్రాంగాన్ని ఎదురు తిరిగేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కృతకృత్యమైంది. ఉన్నత స్థానాలలోని ఐఏఎస్ అధికారులు తాము చేయాల్సిన పనులను కూడా మర్చిపోయి పాలకులు ఎలా చెబితే అలా చేశారు. ఇద్దరు ఐఏఎస్ అధికారుల సర్వీసు రిజిస్టర్ లో మచ్చ వచ్చేలా చేసుకున్నారు.

సగం మంది అధికారులకు వాస్తవం తెలిసింది

ఆ నాటి నుంచి సగం మంది అధికారులకు అర్ధం అయింది. ఎన్నికల కమిషనర్ కు ఉన్న శక్తి ఏమిటో. ఆ తర్వాతి కాలంలో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల్లో పర్యటించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్ పి స్థాయి అధికారులకు ఎన్నికల సమయంలో ఎలా ప్రవర్తించాలో బోధపడేలా చేశారు.

దాంతో పాలనాయంత్రాంగం అంతా కొంత మేరకు సెట్ అయింది. పోలీసు వ్యవస్థ పూర్తిగా అదుపులోకి రాకపోయినా చాలా వరకూ అధికారులు పక్షపాత రహితంగానే వ్యవహరించారు. అందుకే ఎన్నికలు స్థూలంగా చూస్తే ప్రశాంత వాతావరణంలో జరిగాయి.

కరోనా ఎక్కడికి పోయిందో…

కరోనా కాలంలో ఓటర్లు రారు అంటూ పాలకుల మోచేతి నీళ్లు తాగే ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. అయినా ఓటర్లు వచ్చారు. ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ కపట కబుర్లు చెప్పారు. ఎవరికి ఏం కాలేదు. పైగా కరోనా కారణం చెప్పి సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన వారికి శృంగభంగం కలిగే విధంగా కరోనా కూడా అదుపులోనే ఉంది.

‘‘ప్రజలు, ఉద్యోగులు చచ్చిపోతే నిమ్మగడ్డ బాధ్యత వహిస్తాడా?’’ అంటూ ఏకవచనంతో సంబోధించిన ఉద్యోగ సంఘం నాయకుడు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో అర్ధం కావడం లేదు. మంత్రులు కూడా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వ్యక్తిగతంగా తిట్టారు. అనరాని మాటలు అన్నారు…. అంటూనే ఉన్నారు.

ఏకగ్రీవాలపై రభస రభస

బ్యాలెట్ పేపర్ లో నోటా ప్రయోగం మొదలు పెట్టిన ఈ కాలంలో ఏకగ్రీవాలు ఎలా జరుగుతాయి? నోటా ఉన్న సమయంలో ఏకగ్రీవాలు చేయడమే చట్ట విరుద్ధం అనుకుంటే బలవంతపు ఏకగ్రీవాలు మరింత తప్పు కదా? ఈ మాటలు చెప్పినందుకు ఒక మంత్రి డాక్టర్ నిమ్మగడ్డను కులం పేరుతో దూషించాడు.

ఇంత క్లిష్ట సమయంలో కూడా నిమ్మగడ్డ మాట తూలలేదు. అధికార పార్టీ ఆడిన కుట్రపూరిత కుల గేమ్ లో ఆయన పాత్ర కాలేదు. తాను చెప్పదలచుకున్నది న్యాయస్థానాలకు చెప్పారు. తాను ఇవ్వాల్సిన ఆదేశాలను ఎన్నికల యంత్రాంగానికి ఇచ్చారు.

ఎవరి పరువు పోయింది…..?

నిమ్మగడ్డకు ఎవరూ సహకరించవద్దు అంటూ మంత్రి చెప్పిన మాటలను అధికారులు పట్టించుకోలేదు. ఎన్నికల కమిషనర్ కు సంపూర్తిగా సహకరిస్తున్నారు. ఎవరి పరువు పోయినట్లు? పాలకులు ఎన్ని కుట్రలు పన్నినా న్యాయ స్థానాలు సంపూర్తిగా ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ పరమైన విధులను సమర్థించాయి.

న్యాయ స్థానాల సాయంతో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవంతంగా సగం ఎన్నికలు పూర్తి చేశారు. మిగిలిన పంచాయితీ ఎన్నికలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి చేయగలిగితే అంతకన్నా కావాల్సిందేమీ లేదు. న్యాయస్థానాలతో బాటు 83 శాతం ఓటర్లు డాక్టర్ నిమ్మగడ్డకు బాసటగా నిలిచారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తయ్యే వరకూ ఎన్నికలు నిర్వహించే అవకాశమే లేదు అని చెప్పిన పాలకులు ఓడిపోయారు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, www.satyamnews.net

Related posts

426 పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

Murali Krishna

వనపర్తిలో పేదల పెన్నిధి  మెగా రెడ్డి

Satyam NEWS

ప్రజల కోసం పరితపించే నాయకుడు కేటీఆర్

Satyam NEWS

1 comment

POLISHETTI BAALAKRISHNA February 15, 2021 at 1:20 PM

Sir
నిమ్మగడ్డ వార్త బాగుంది. ఈ వార్త పెద్ద పత్రికలలో, పెద్ద టీవీల్లో వస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి వార్తలు రావు.Thank you

Reply

Leave a Comment