32.2 C
Hyderabad
March 28, 2024 23: 58 PM
Slider ప్రత్యేకం

ఎనాలసిస్: అంకెలతో కాదు ఆత్మతో చెప్పాలి

#Nirmala Seetaraman

ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్-19 ప్రభావం మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత దేశంపై ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ మరణాల రేటు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మార్చి 22 నుంచి విధించిన  4 లాక్ డౌన్ దశలకు యావద్దేశ ప్రజలు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం ప్రకటించిన జాగ్రత్తలు పాటించి వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకరించారు.

ఉమ్మడి లక్ష్యం కోసం బీద, మధ్యతరగతి ప్రజలు కష్టనష్టాలు భరించడం గొప్ప విషయం. కనిపించని శత్రువుతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న కరోనా యోధులకు ప్రతి భారతీయుడు నైతిక మద్దతు తెలపడం ప్రజల కు దేశంపట్ల ఉన్న అపార గౌరవాన్ని ద్విగుణీకృతం చేసింది.

భారత ప్రజలకు సహనం ఎక్కువ

ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయ పార్టీల కతీ తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సుదీర్ఘ లాక్ డౌన్ ను అనుసరిస్తున్నాయి. 130 కోట్లకు పైగా దేశవాసులు అరవై రోజుల నుంచి కోవిడ్-19 తో అలుపెరగని పోరాటం చేస్తున్న సత్యాన్ని విస్మరించడం తగదు.

ప్రజలు ఎప్పటికీ ప్రభుత్వాలకు విధేయులుగానే వ్యవహరిస్తారు. సహనం, సౌశీల్యంలో భారతీయుల స్థానం ప్రపంచదేశాలతో పోల్చుకుంటే సమున్నతంగానే ఉంటుంది. కానీ…..పాలకులే ప్రజల పట్ల ప్రదర్శించాల్సిన విశ్వసనీయత విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి తగదు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై వెల్లువెత్తిన విమర్శలు

ఈ విషయంలో ప్రధాని మోదీ కూడా మినహాయింపు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అతిపెద్ద విషాదం సంభవించిన నేపథ్యంలో సగటు మనిషి వెతలు తీర్చడంలో కేంద్రప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శలు వచ్చిపడుతున్నాయి.

సుదీర్ఘ లాక్ డవున్ కారణంగా రోజుల తరబడి  అర్ధాకలితో అలమటిస్తున్న లక్షలాది సామాన్య ప్రజల తక్షణావసరాలు సమకూర్చడానికి ఏలికలు ప్రయత్నించకపోవడం అన్యాయమని అనేక రంగాల ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా….కేంద్రం ఉదారంగా సకాలంలో విడుదల చేసిన నిధులను లక్షిత అంశాల వారీగా వినియోగించక బీజేపీ యేతరరాష్టాలు వక్రభాష్యాలు చెబుతున్నాయని బీజేపీ పెద్దలు ప్రతివిమర్శ చేస్తున్నారు.

ప్రధాని పై విమర్శలు, పొగడ్తలు

ప్రధానమంత్రి మోదీని ఆకాశానికి  ఎత్తేస్తున్నారు. ప్రపంచదేశాలలో కోవిడ్-19 వ్యాప్తిని బ్రహ్మాండంగా అరికట్టి భారతదేశం అగ్రస్థానంలో నిలిచినట్లు , అందుకు మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కారణమని వారు ప్రధానిని ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో ఒక దేశప్రధాని వ్యవహరించాల్సిన తీరునే మోదీ ఎంచుకున్నారని, ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ఆర్భాటంగా ప్రకటించిన  ఉద్దీపన కార్యక్రమాల మాటున దాగిన రహస్య ఎజెండా బట్టబయలైందని వైరిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రైవేటీకరణ సన్నాహాలు ముమ్మరం చేయడంతో బీజేపీతో  అంటకాగే పెట్టుబడిదారీ వర్గాలకు ప్రయోజనం తప్ప సాధారణ ప్రజానీకానికి ఒరిగేది ఏదీ లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అంకెల గారడీనేనా?

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రధాని స్థాయి వ్యక్తి సాధారణ ప్రజల కష్టనష్టాల తక్షణ నివారణకు తరుణోపాయం చెప్తారని ఆశిస్తే…. ఆర్ధిక మంత్రి నోట అర్ధంకాని అంకెల గారడీని ప్రదర్శించడం ప్రస్తుత పరిస్థితుల్లో సహేతుకంగా లేదని ఆర్థికరంగనిపుణుల విశ్లేషణ. ఇదిలా  ఉండగా…..కోవిడ్ వైరస్ వ్యాప్తి క్రమంగా సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తోంది.. పలు గణాంకాలు కూడా ఈ వాస్తవానికి ఊతం ఇస్తున్నాయి…

ఈ మొత్తం నేపథ్యంలో ఒక కొత్త వాదం ఇప్పుడిప్పుడే మాధ్యమాల చర్చలలో చోటుచేసుకుంటోంది. సూక్ష్మదృష్టితో… ఎటువంటి వివక్షకు తావు లేకుండా పరికిస్తే ప్రధాని మోదీ విజయం సాధించినట్లా? లేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు విఫలమైనట్లా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.

ఎందుకంటే….కోవిడ్-19 ప్రవేశానికి ముందు  ఎన్డీఏ ప్రభుత్వం అనేక వివాదాలతో విమర్శలు ఎదుర్కొంటోంది. జాతీయ పౌరసత్వ చట్ట సవరణ, రాఫెల్ ఒప్పందం, ఉమ్మడి సివిల్ కోడ్, దేశవ్యాప్త జనగణన, జర్నలిజం …ఇతర కీలక రంగాలలోకి విదేశీ పెట్టుబడులు,ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేయడం వంటి అనేక అంశాలపై దేశ ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. అంశాలవారీ ప్రజా ఉద్యమాలు చోటుచేసుకున్నాయి.

పతనం అవుతున్న వృద్ధి రేటు

కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు ఉత్పన్నమయ్యాయి. వృద్ధిరేటు ఘోరంగా పతనమవుతున్నట్లు ఐ ఎం ఎఫ్ గడచిన ఫిబ్రవరిలో ప్రకటించింది. ఆశించిన రెండంకెల వృద్ధిరేటు సుదూర స్వప్నంగా పరిణమించింది. 1)పెద్దనోట్ల ఆకస్మిక రద్దు, 2) హఠాత్తుగా విధించిన సుదీర్ఘ లాక్ డవున్ ఈ రెండూ భారతీయులను అమితంగా బాధించిన చేదు అనుభవాలు.

కరోనా తో సహజీవనం తప్పదని అంతర్జాతీయ వైద్య,ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ నియంత్రణ చర్యలు తీసుకుంటూనే దాన్ని సమూలంగా నాశనం చేయగల వాక్సిన్ తయారీకి సిద్ధం కావాలని డబ్ల్యూ హెచ్ ఓ సూచించింది. ఈ నేపథ్యంలో….ఈ ఏడాది నుంచి దేశంలో జరుగనున్న శాసనసభ ఎన్నికలలో బీజేపీ గెలుపోటములను కరోనా చుట్టూ పరిభ్రమించిన రాజకీయ విన్యాసాలు నిర్ణయించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి కరోనా వార్తలకే ప్రాధాన్యతనిస్తున్న  దేశీయ, అంతర్జాతీయ మాధ్యమాలు అతి త్వరలోనే భారతదేశ రాజకీయాలవైపు దృష్టి సారించక  తప్పదు.

కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

చంద్రబాబుకు జరిగిన అవమానానికి టీడీపీ కార్యకర్తల నిరసన

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన హీరో నాగ శౌర్య

Satyam NEWS

తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment