30.3 C
Hyderabad
April 16, 2021 12: 28 PM
Slider ప్రపంచం

ప్రజాస్వామ్య పరిరక్షణకు పిట్టల్లా రాలుతున్న జనం

#mayanmar

మయన్మార్ లో సైనికుల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. అడుగడుగునా రక్తపాతం రాజ్యమేలుతోంది.సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాపోరాటం నిరాఘాటంగా సాగుతూనే వుంది. ఈ పోరులో శనివారం ఒక్కరోజు జరిగిన కాల్పుల్లోనే 114మంది సాధారణ పౌరులు నెలకొరిగారు.

అందులో పాలుకారే పసిపాపలు ఉన్నారు,అడుగుతీసి అడుగు వేయలేని వృద్ధులు,ఎంతో భవిష్యత్తు వున్న భావిపౌరులు ఉన్నారు. ప్రజలను సైనికులు యదేచ్ఛగా పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపుతున్న ఈ తీరు చూసి ప్రపంచ దేశాలు చలించిపోతున్నాయి.

అరాచకం సృష్టిస్తున్న సైన్యం

ఫిబ్రవరి 1వ తేదీ నాడు సైన్యం ఆ దేశాన్ని  చేతుల్లోకి తీసుకొని, అధికారం వెలగబేడుతోంది. అధికారమంటే? పరిపాలన కాదు, అరాచకం సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ సైన్యం చేతిలో 400మంది ప్రజలు మరణించారని చెబుతున్నారు. కానీ, ఈ అంకెలు అవాస్తవం, ఇంకా ఎక్కువగానే ఉంటాయని అందరూ భావిస్తున్నారు.

మరణిస్తున్నవారిలో సైనికుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, హితులు కూడా ఉంటున్నారు.ఈ దుశ్చర్యలకు పాలుపడటానికి కొందరు సైనికులకు చేతులు రావడం లేదు. వారు, ఆ ఘోరకలిలో భాగస్వామ్యులు కాలేక,ఆ దేశాన్ని వదిలి పక్క దేశాలకు పారిపోయి వస్తున్నారు. కొందరు ప్రజలు కూడా అదే బాట పడుతున్నారు.

వారిలో కొందరు మన దేశం వైపూ చూస్తున్నారు. ఒక పక్క సైనికుల కాల్పులు జరుగుతుండగా, మరో పక్క, సూకీ నుంచి అధికారాన్ని వశపరుచుకున్న స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ చైర్మన్,  సీనియర్ జనరల్ మింగ్ అంగ్ లయాంగ్… త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని తాజాగా వెల్లడించారు.

ఎన్నికల ఊసే లేకుండా పోయింది……

ప్రజలను కాపాడుతామని, ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని చెబుతున్నారు.సైన్యం హెచ్చరికలను పెడచెవిన పెడుతూ పెద్ద సంఖ్యలో ఆందోళనలు నిర్వహిస్తున్నారని, అటువంటివి తగని చర్యలని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. జాతి జనులతో సాగి శాంతిని పునరుద్ధరిస్తామని లయాంగ్ అంటున్నారు.

కానీ,ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఆయన స్పష్టంగా చెప్పలేదు.ఎన్నికల ద్వారా ఎంపికైన సూకీ ప్రభుత్వాన్ని రద్దు చేసి,  సైన్యం అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు సైనిక ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలు అంటోంది.ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికల ద్వారా ఎంపికైన వ్యవస్థ ఒక ఒంక – సైనిక వ్యవస్థ మరొక ఒంకగా సాగుతున్న మయన్మార్ లో శాంతి స్థాపన ప్రశ్నార్ధకంగానే ఉంది.

దేశంపై తమ పెత్తనమే సాగాలానే దృక్పథంతో ఉన్న సైనిక దళం మధ్య ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమా? అనిపిస్తోంది. సైనిక దమనకాండలో గాయాలతో రోదిస్తున్నవారితో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అరెస్టులు, మరణాలను లక్ష్య పెట్టకుండానే  ప్రజలు పోరాటం సాగిస్తున్నారు. సైనిక పాలన ముగిసి, ప్రజా పాలన వచ్చే వరకూ యుద్ధపర్వం ముగిసేట్టు లేదు.

ప్రజాస్వామ్యాన్ని పొట్టన పెట్టుకుంటున్న సైన్యం

ఎన్నికలు జరిగినా, ఆ ప్రభుత్వం ఎంతకాలం నిలుస్తుందన్నది అనుమానమే.దేశాధ్యక్ష స్థానం నుంచి ఆంగ్ సాన్ సూకీని దించేసిన సైన్యం ఆమెను తన నిర్బంధంలోనే ఉంచుకుంది. ఐక్య రాజ్య సమితితో పాటు అనేక దేశాలు సైన్యం చేస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ఈ భయానక చర్యలకు ముగింపు పలకాలని పలు దేశాలు ఐక్య రాజ్య సమితిపై ఒత్తిడి తెస్తున్నాయి.  తాజాగా, అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోని బ్లింకెన్ సైన్యం సృష్టిస్తున్న రక్తపాతాన్ని భయానక చర్యగా ట్విట్టర్ వేదికగా అభివర్ణించారు. భద్రతామండలిపై బ్రిటన్ ఒత్తిడి తెస్తోంది.

చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య కూడా సూచిస్తోంది.ప్రజా భద్రతా చట్టం ఉల్లంఘన కింద కేసులు పెట్టి, మీడియాను సైతం  అణచివేయడానికి సైన్యం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ, మీడియా సైనికులు మయన్మార్ సైన్య దురాగతాలను లోకానికి చాటుతూనే ఉన్నారు.

అంతర్గత కుమ్ములాటలకు నిలయం ఇది

బహుజాతుల సమాహరంగా ఉండే ఈ దేశంలో ఎప్పుడూ అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉంటాయి.ఇప్పటికీ దేశంలో అంతర్గత స్వాతంత్య్రం లేదు. ఎప్పుడూ  సైన్యానిదే పెత్తనం. ఇప్పుడు కూడా మళ్ళీ సైన్యమే  దేశాన్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకుంది. మయన్మార్ ప్రజల పట్ల సభ్య సమాజాలకు సానుభూతి ఉన్నప్పటికీ, ఎవరూ ఏమి చేయలేని దుస్థితి.

సానుభూతి తప్ప సాయం చేయలేని స్థితి….

చాలా దేశాలు నైతికంగా మద్దతును ప్రకటిస్తున్నప్పటికీ,మయన్మార్ దేశ అంతర్గత వ్యవహారాల్లో, విధానపరమైన అంశాల్లో తలదూర్చే హక్కులు ఏ దేశానికీ లేవు. అనేక ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల ఫలంగా 2011 నుంచి ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది.

ఆంగ్ సాన్ సూకీ అధ్యక్షురాలుగా అధికారాన్ని చేపట్టారు.నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధినేతగా ప్రజాస్వామ్య స్థాపనకు ఆమె  కృషి సాగుతూనే వుంది. గతంలో 15 సంవత్సరాలకు పైగా ఆమె రాజకీయ ఖైదీగా నిర్భంధంలోనే ఉన్నారు.ఇప్పుడు మళ్ళీ సైన్యం నిర్బంధంలోకి వెళ్ళిపోయారు.

ఆమె తండ్రి ఆంగ్ సాన్  పోరాట యోధుడు. ‘బర్మా దేశపిత’గా ఆయనకు ఎంతో విఖ్యాతి వుంది. ఆ దేశ స్వేచ్ఛ కోసం పోరాడి ప్రాణాలు కూడా కోల్పోయారు. గత ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని, అంగ్ సాన్ సూకీ ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగిందని,అందుకే  జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సైన్యం చెబుతోంది.

సైన్యం చెప్పే మాటల్లో ఎంత నిజం వుందో దాని అధిపతులకే తెలియాలి. మయన్మార్ లో మారణకాండ త్వరగా ఆగాలి, శాంతి విలసిల్లాలని ప్రజాప్రపంచం కోరుకుంటోంది.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

ఈతకు వెళ్లి బాలుడు మృతి

Satyam NEWS

ట్రాప్ రేప్: యువతిఫై 6 గురు మైనర్ ల అకృత్యం

Satyam NEWS

అర్చకుల సంఘీభావ సభ సుదర్శన పుస్తక ఆవిష్కరణ

Sub Editor

Leave a Comment

error: Content is protected !!