22.6 C
Hyderabad
August 13, 2020 17: 02 PM
Slider ప్రత్యేకం

Analysis: జీతం కోసం కాదు జీవితం కోసం చదువు

#NewEducationPolicy

విద్యా వ్యవస్థలో కొత్త విధానాలు వచ్చేశాయి. చదువుల్లో ఎన్నో మార్పులు రావాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. సమగ్రంగా విద్యా విధానంలో  సంస్కరణలు  జరగాలని పెద్దలు దశాబ్దాలుగా సూచిస్తున్నారు. నూతన విద్యా విధానం-2020ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇది స్వాగతించవలసిన మంచి పరిణామం. మనో వికాసానికి -ఉపాధికి-జాతి ప్రగతికి తోడ్పడని  విద్య నిరర్ధకం. చాలా ఏళ్ళ నుండి విద్య పాత చింతకాయ పచ్చడి జాడీల్లోనే ఉండి పోయింది. చాలా తక్కువ కోర్సులకే డిమాండ్ ఉండి, ఎన్నో సబ్జక్ట్స్ నిరర్ధకంగా మారిపోయాయి. డిమాండ్-సప్లై సూత్రం నేటి వరకూ అమలవ్వలేదు.

సర్టిఫికెట్స్ తప్ప జ్ఞానం అంతంత మాత్రమే

పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి కూడా చిన్న చిన్న ఉద్యోగాలకే, చాలీ చాలని జీతాలకే పరిమితమైపోయే పరిస్థితులు కోట్లాదిమందికి వచ్చాయి. అటు వృత్తి నైపుణ్యం లేదు. ఇటు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. కేవలం సర్టిఫికెట్స్ తప్ప జ్ఞానం అంతంత మాత్రమే. ఆ సర్టిఫికెట్ కూడా అన్ని ఉద్యోగాలకు పనికి రాదు.

చదివిన విద్యకు -చేసే ఉద్యోగానికి-ఎంచుకునే రంగానికి ఏమాత్రం సంబంధం లేకుండానే విద్యా వ్యవస్థ వేళ్లూనుకుంది. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థను మార్చుకుంటూ సాగలేదు. ఎక్కువ మంది చిరుద్యోగులుగా,నిరుద్యోగులుగా మిగిలిపోయారు.

దేశ అవసరాలకు  ఈ చదువులు పెద్దగా ఉపయోగ పడలేదు. వ్యక్తిగతంగా, చదువుకున్న విద్యార్థికి ఉపయోగపడలేదు. విద్యా విధానం రెంటికి చెడ్డ రేవడి చందంగా మారింది. ప్రధానంగా నిపుణుల కొరత చాలా ఎక్కువగా  ఉంది. పరిశోధన చాలా పేదగా ఉంది. కొన్ని కోర్సులు మాత్రమే ఉపయోగ పడ్డాయి.

దేశాన్ని దెబ్బ కొట్టిన బ్రెయిన్ డ్రెయిన్

కొంతమంది మాత్రమే ప్రయోజకులయ్యారు. కొందరు బ్రెయిన్ డ్రయిన్ పేరుతో విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. భారతదేశంలో ప్రతిభకు  ఢోకా లేదు. మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. వ్యవస్థీకృతమైన విధానాలలో ఉన్న లోపాల వల్ల, మనం చైనా, మరికొన్ని దేశాలను ను దాటి ముందుకు వెళ్లలేక పోయాము.

విద్యా విధానం సక్రమంగా, ఫలవంతంగా ఉండి ఉంటే, ఎన్నో దేశాలను  ఎప్పుడో అధిగమించి వుండే వాళ్ళం. ఈ ఆధునిక విద్యా విధానం రాక ముందు, మనం జ్ఞాన స్వరూపులం. భారతదేశం జ్ఞానభూమి. అపారమైన జ్ఞానానికి నెలవైన వేదభూమి. లార్డ్ మెకాలే మొదలు, ఎందరో పాశ్చాత్యులు మన మూలాలనే దెబ్బతీశారు.

అటు సంప్రదాయ జ్ఞానం లేదు. ఇటు కావాల్సినంత  అత్యాధునికత లేదు.  ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు కేంద్ర ప్రభుత్వం కదిలి వచ్చి, కొత్త విద్యా విధానం తీసుకువచ్చింది. ఇందులో ఎక్కువ శాతం బాగున్నాయి. కొన్ని ఆచరణకు దూరంగా ఉన్నాయి. మరికొన్ని సమగ్రతకు దగ్గరగా లేవు.

కేంద్ర రాష్ట్రాల సమన్వయం ముఖ్యం

ప్రతి సంవత్సరం విద్యా విధానంపై పునః సమీక్షలు చేసుకుంటూ ముందుకు సాగాలి. బోధనలో  ఎడ్యుకేషనల్ సైకాలజీని మరువ రాదు. న్యూరోలాజికల్, బయోలాజికల్ అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. నూతన విద్యా విధానంపై ఇంకా అధ్యయనా లు జరగాల్సిన అవసరం ఉంది.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా ముఖ్యం. ఫెడరల్ వ్యవస్థలో విద్యా రంగం ఉమ్మడి లిస్ట్ (కాన్ కరంట్) లో ఉంది. సబ్జక్ట్స్ తో పాటు బోధనా భాష కూడా ముఖ్యమైంది. ఇది కేవలం భాషాపరమైన అంశం కాదు. విద్యార్థి మానసిక స్థాయి, గ్రహణశక్తికి కూడా సంబంధించిన విషయం.

జాతీయ విద్యా విధానమంతా ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. ఆరోగ్య, న్యాయ విద్యలను ఎందుకు ప్రత్యేకంగా ఉంచారో స్పష్టత రావాలి. విద్యార్థి దశలో బాల్యం చాలా కీలకమైంది. ముఖ్యంగా 10-11ఏళ్ళ వయస్సు వరకు మాత్రమే   మెదడూ ఎదుగుతూ ఉంటుంది. తర్వాత ఎదుగుదల పెద్దగా ఉండదు.

మాతృభాషే ముద్దు

కాబట్టి, మనం ఇచ్చే ఆహారం, కల్పించే వాతావరణం, బోధనా విధానాలు చాలా చాలా కీలకమైనవి. వివిధ వయస్సుల్లో,  మెదడు ఎదుగుదలకు తగ్గట్టుగా చదువులు ఉండాలి. ఐదవ తరగతి వరకూ, అంటే 10ఏళ్ళ వయస్సు వరకూ మాతృభాషలో లేదా స్థానిక భాషలో  బోధన  ఉండడమే  సరియైన పద్ధతి.

 గ్రహణ శక్తి ఈ  భాషలకే ఉంటుంది. అంతర్జాతీయ,జాతీయ భాషలను ఒక సబ్జెక్టుగా ఉంచితే సరిపోతుంది. అంతర్జాతీయంగా ఉపయోగపడే ఇంగ్లిష్ విద్యా బోధన  10-11ఏళ్ళ వయస్సు నుండి ప్రవేశపెట్టవచ్చు. ఉన్నత విద్యలోకి చేరేంత వరకూ తప్పనిసరిగా మాతృభాష ఒక సబ్జెక్టుగా ఉండాలి.

ఆటలు వినోదం కూడా చదువులో భాగమే

భాషా సంస్కృతులపై విద్యార్థికి తప్పకుండా అభిమానం, ప్రేమతో కూడిన అవగాహన కల్పించాలి. విద్యార్థి సంస్కృతిని సొంతం చేసుకోవాలి. సబ్జక్ట్స్ తో పాటు కళలు, యోగా, ఆటలు, వినోదాలు  కూడా చాలా అవసరం. వీటిని కూడా ఇప్పుడు చేర్చారు. ఇది  అభినందనీయం.

వృత్తి విద్యను కూడా జోడించి, బోధన సాగించాలనేది కూడా మంచి ఆలోచన. ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క విద్యా విధానం పాటించడం ఆహ్వానించ దగ్గ పరిణామం కాదు. విద్యా విధానంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు బడ్జెట్ కేటాయింపులు కూడా ఉంటాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. హక్కులు-అవసరాలు-ఆచరణ- సంస్కృతి-సంప్రదాయం -సామాజిక స్వరూపం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొనే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉండాలి. చదివిన చదువు విద్యార్థికి, కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడాలి.

జ్ఞానం తక్కువ, సర్టిఫికెట్లు ఎక్కువ

6వ తరగతి నుండే వృత్తి విద్యను ప్రవేశపెట్టడంపై  మిశ్రమమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వయస్సువారికి  ఈ విధానాన్ని రూపకల్పన చెయ్యడం  ఎంతవరకూ సబబు, అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎం.ఫిల్ ఎత్తివేయడం మంచి ఆలోచన. అదే సమయంలో పి హెచ్ డి ల్లో కూడా ఎక్కువ భాగం నాణ్యతా లోపం ఉంది. మిగిలిన తరగతుల్లాగా, జ్ఞానం తక్కువ, సర్టిఫికెట్ ప్రధానంగా ఇప్పటి వరకూ నడిచాయి.

పరిశోధనల్లో ప్రతిభ, ప్రావీణ్యతలు ముఖ్యం. అది ఏ సబ్జెక్టు అయినప్పటికీ, కఠినమైన పర్యవేక్షణ ఉండాలి. విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు బాగా ఉండాలి. ఉపాధ్యాయుల శిక్షణ, నియామకాల్లో   కఠినమైన, నిష్పక్షపాతమైన, సమగ్రమైన వైఖరి అవలంబించాలి. ప్రతి సబ్జెక్టుకూ ప్రాముఖ్యత ఉండాలి.

ఇకనైనా ప్రతిభకు పెద్దపీట వేస్తారా?

ప్రతి చదువూ ఉపయుక్తంగా ఉండాలి. ప్రతిభకు పెద్ద పీట వెయ్యాలి. సోమరిపోతుల చీటీ చించెయ్యాలి. ఐ.ఏ.ఎస్, ఐ.ఆర్.ఎస్ లాగానే ఐ.ఇ.ఎస్ (ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్) ఏర్పరచాలి. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, పరిపాలనా కార్యాలయాలతో విద్యార్థులను అనుసంధానం చెయ్యాలి.

ఆయా సంస్థల పెద్దలు లేదా నిపుణులతో  విద్యార్థులకు మెళుకువలు, ఆచరణ, అమలులో ఉండే కష్ట సుఖాలపై క్రాష్ కోర్సుల తరహాలో పాఠాలు చెప్పించాలి.ఆ సంస్థల్లో ప్రాజెక్టు వర్క్స్ చేయించాలి. జాతీయ విద్యా స్టాండింగ్ కమిటీ ఏర్పాటుచేసి, అందులో వివిధ రంగాల నిపుణులను సభ్యులుగా వెయ్యాలి.

విద్య-ఉపాధి-ప్రగతి కలిసి సాగాలి

ఈ నియామకంలో పారదర్శకత ముఖ్యం. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ విద్యా విధానం మొత్తంమీద బాగానే ఉంది. విద్య, జ్ఞాన సముపార్జనలు నిరంతర స్రవంతులు. అద్భుతమైన ప్రాచీన విద్యా విధానం-అత్యాధునిక వ్యవస్థల సంగమంగా నూతన విద్యా వ్యవస్థ ఉండాలి.

మూడు దశాబ్దాల వరకూ విద్యా విధానంలో సంస్కరణలు, మార్పులు చెయ్యకుండా ఉండడం మన ప్రభుత్వాల డొల్లతనానికి, బాధ్యతా రాహిత్యానికి అద్దం పడతాయి. ఇకనుంచైనా, ఎప్పటికప్పుడు సమీక్షలు, సంస్కరణలు, ఆచరణలతో భారతీయ విద్యావిధానాన్ని ప్రపంచంలోనే తలమానికంగా నిలబెట్టాలి. విద్య-ఉపాధి-ప్రగతి కలిసి సాగాలి.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

ప్రజలకు సమస్యలు తెచ్చే ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS

చేయి తాకితే కూలీ పోతున్న డబుల్ బెడ్ రూమ్ గోడలు

Satyam NEWS

సూర్యాపేటకు వెళ్లే దారుల మూసివేత

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!