28.7 C
Hyderabad
April 20, 2024 10: 36 AM
Slider ప్రత్యేకం

Analysis: రష్యా తొలి వ్యాక్సిన్

#CoronaVaccine

కరోనా వైరస్ కల్పించిన చీకట్లో తొలిపొద్దు పొడిచింది. ప్రపంచ దేశాలన్నింటి కంటే ముందుగా రష్యా కరోనా వైరస్ పై తొలి వ్యాక్సిన్ ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ముందుగా శుభం పలుకుదాం. రష్యా అధినేత పుతిన్ కు అభినందనలు అందిద్దాం. ఈ వ్యాక్సిన్ నిర్మాణంలో భాగస్వామ్యులైన వారందరికీ జేజేలు పలుకుదాం.

కోవిడ్ యుద్ధంలో ఇది తొలి ఆయుధం. ఈ టీకా ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి, వైరస్ నియంత్రణలోకి వస్తే, అంతకంటే మంచి పరిణామం  ఏముంటుంది. తొలి టీకా రష్యా అధినేత పుతిన్  కుమార్తెకు వేసినట్లుగా చెబుతున్నారు. అందరి కంటే ముందుగా మేమే వ్యాక్సిన్ ను అందిస్తామని రష్యా మొదటి నుండీ చెబుతోంది. అన్నట్టుగానే ప్రకటించేసింది.

ఉత్తేజం నింపిన రష్యా వ్యాక్సిన్ వార్త

కరోనా వ్యాక్సిన్ ను తయారుచేసి, నమోదు చేసుకున్న తొలి దేశంగా రష్యా నిలిచింది. మొట్టమొదటగా, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు ఈ టీకా ఇవ్వనున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ టీకాను తీసుకున్న  తన  కుమార్తెకు  ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు) రాలేదు. ఉష్ణోగ్రతల్లో సమతుల్యత, నియంత్రణ వచ్చింది.

ఆమె శరీరంలో యాంటీ బాడీలు సమృద్ధిగా తయారయ్యాయి. ఆరోగ్యం బాగుంది. అని, రష్యా అధినేత తెలిపినట్లుగా సమాచారం. ఈ వార్త, ప్రపంచ మానవాళిలో ఒక్కసారిగా కొత్త ఉత్తేజం నింపింది. పెద్ద రిలీఫ్ ను  ఇచ్చింది. ఈ వ్యాక్సిన్  ఇచ్చే ఫలితాలు సమగ్రంగా, సంపూర్ణంగా కాలంలోనే తెలుస్తాయి.

హడావుడి గా విడుదల చేశారా?

ఇంత తక్కువ కాలంలో, చాలా తక్కువ మందిపై ప్రయోగాలు చేసి, విడుదల చేసిన ఈ వ్యాక్సిన్ పై, కొందరు నిపుణులకు పలు అనుమానాలు ఉన్నాయి. మూడవ దశ ప్రయోగం సంపూర్ణం కాకుండానే వ్యాక్సిన్ ను హడావిడిగా విడుదల చేశారనే వార్తలు కూడా వస్తున్నాయి.

సహజంగా,  ఒకసారి టీకా వేసుకుంటే, జీవితాంతం మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వ్యాధిని సంపూర్ణంగా ఆ టీకా నియంత్రణ చేస్తుందనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. వ్యాక్సిన్ల చరిత్ర గమనిస్తే, ఒక టీకా తయారు కావడానికి సంవత్సరాలకొద్దీ సమయం పడుతుందనీ , కేవలం ఒక్కసారిగానే కాక, పలు పర్యాయాల్లో టీకా అభివృద్ధి జరుగుతుందని, మంచి ఫలితాలను  ఇవ్వడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.

ఆక్సఫర్డ్ టీకా కూడా తర్వరలోనే

ఈ కరోనా వ్యాక్సిన్ విషయం దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. సంవత్సరాలు కాకుండా, కొన్ని నెలల సమయంలోనే తొలి టీకా అందుబాటులోకి వచ్చింది. మరికొన్ని టీకాలు మరి కొద్ది నెలల్లో అందుబాటులోకి రావడానికి సిద్దపడుతున్నాయనే వార్తలు వింటున్నాం.

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఈ  ఆగస్టు 15 కల్లా అందుబాటులోకి వస్తుందనే వార్తలు  ఇటీవల పెద్దఎత్తున వచ్చాయి. ఆక్సఫర్డ్ టీకా కూడా త్వరలోనే రానుందనే వార్తలు వింటున్నాం. ఈ విషయంలో ఆగష్టు 15 వ తేదీ నాడు,  దేశ ప్రధాని నరేంద్రమోదీ ఏదైనా ప్రకటన చేస్తారా, అని కోట్లాదిమంది భారతీయులు ఎదురు చూస్తున్నారు.

వ్యా క్సిన్ తయారీ ప్రక్రియలో అనేక దశలున్నాయి. ప్రభుత్వాలు, సంబంధిత శాఖల అనుమతుల ప్రక్రియ మాత్రం వేగంగా పూర్తి చెయ్యవచ్చు. రవాణా,ప్యాకింగ్ కూడా ముఖ్యమైన సమస్య. దీన్ని కూడా కొంత అధిగమించవచ్చు. వివిధ దశల్లో సాగే ప్రయోగాలు, అవి ఇచ్చే ఫలితాలే కీలకం. వేల మంది మీద ప్రయోగాలు చెయ్యాలి.

రూపు మార్చుకునే వైరస్ తో ఇబ్బందే

అవి సత్ఫలితాలు ఇవ్వాలి. దీనికి ఒక నియమిత కాలవ్యవధి కూడా ఉంటుంది. కరోనా వైరస్ చకచకా తన రూపు రేఖలు మార్చుకుంటోంది. ఒక్కొక్క దేశం లో, ఒక్కొక్క చోట,  ఒక్కొక్క రూపంలో ఉంటోంది. తయారుచేసే వ్యాక్సిన్లు ఆ మార్పులకు అనుగుణంగా రూపొందించాలి. ఇది అసలైన సవాల్.

తయారీ మొదలు పెట్టేటప్పుడు ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్  రూపొందిస్తూ ఉంటారు. వైరస్ మార్పుకు అనుగుణంగా మళ్ళీ మార్చుకోవాలి. ఇది పెద్ద పద్ధతి (ప్రాసెస్). ఇప్పుడు రూపొందుతున్న వ్యాక్సిన్ల జీవితకాలం ఎంత అన్నది,  పెద్ద ప్రశ్న.

ఒక్క ఏడాదికే అది పరిమితమైనా ఆశ్చర్యపడక్కర్లేదు. గతంలో, ఇన్ ఫ్లూయెంజా  వైరస్ విషయంలో అభిప్రాయాలు మారిపోయాయి. వైరస్ అతివేగంగా మార్పులకు గురికావడమే దీనికి ప్రధాన కారణం. ఈ వ్యాక్సిన్ అన్ని దేశాల్లోకి అందుబాటులోకి రావడానికి దశాబ్దాల సమయం  పట్టింది.

అయినప్పటికీ ఇది శాశ్వత పరిష్కారంగా మిగల్లేదు. ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ ను మార్పులు చేస్తూ అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే,అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) కూడా ప్రకటించింది. కరోనా వైరస్ విషయంలో కూడా అవే  పరిస్థితులు రావచ్చని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది రేస్ కాదు మానవాళి మనగడ ప్రశ్న

ఫ్లూ వైరస్ కంటే ఇంకా ఎంతో వేగంగా కరోనా వైరస్ మారుతోంది. ఈ మార్పులకు తగ్గట్టుగా వ్యాక్సిన్ లో  మార్పులు అవసరమవుతాయి. వాటికి అనుగుణంగా వ్యాక్సిన్లు తయారు చేస్తేనే నిజమైన ప్రయోజనం ఉంటుంది. రేసులో మేమే ముందు ఉన్నాం, అని చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు.

ప్రజలను మభ్యపెడితే, మానవాళి ముందు  రేపు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఏది ఏమైనా, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మనుషులను భయ భ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి  ఒక వ్యాక్సిన్  అందుబాటులోకి వచ్చింది.

ఇది ఎంతో ఆనందించదగ్గ, స్వాగతించవలసిన పరిణామం. వీటన్నింటినీ గమనిస్తున్న  మిగిలిన టీకా రూపశిల్పులు సమర్ధవంతమైన వ్యాక్సిన్లు మానవాళికి అందిస్తారని విశ్వసిద్దాం. మనిషికి – వైరస్ కు జరుగుతున్న ఈ యుద్ధంలో చివరికి మనిషే గెలుస్తాడు.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

కరోనా వైరస్ సోకగానే చనిపోతారనేది కరెక్టు కాదు

Satyam NEWS

మీకు తెలియకుండానే అరెస్టు జరిగిందా?

Bhavani

పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నఅమ్మ ఫౌండేషన్

Satyam NEWS

Leave a Comment