38.2 C
Hyderabad
April 25, 2024 11: 07 AM
Slider ప్రత్యేకం

ఎనాలసిస్: ఆర్ధిక ఉద్దీపనకు నిర్మలమైన ప్యాకేజీ

#Nirmala Seetharaman

కరోనా ప్రభావంతో అస్తవ్యస్తమైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, అన్ని రంగాల ప్రజలను ఆ దిశగా కార్యోన్ముఖులు చేయడానికి కేంద్రప్రభుత్వం శంఖం పూరించింది. ప్రధాన మంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం,  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపన ప్యాకేజిలను ప్రకటించారు.

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజిలో భాగంగా తాజాగా తొమ్మిది విభాగాల కేటాయింపులను ఆమె వివరించారు. వలస కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, చిన్నకారు, సన్నకారు రైతులు, ముద్ర యోజన, హౌసింగ్, ఉద్యోగ కల్పన తదితర వాటికి  చేసిన కేటాయింపులను వివరించారు.

చిన్న పరిశ్రమలకు మూలధనపు నిధి

ప్రధానమంత్రి ప్రకటించిన 20లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా, ఈ వివరాలను వెల్లడించారు. ప్రధానమంత్రి పేర్కొన్న 4 వుత్పత్తి కారకాల లో(ఫాక్టర్స్ అఫ్ ప్రొడక్షన్ ) మూడవదైన  లిక్విడిటీ గురించిన ప్రణాళికను ప్రకటించారు.

చిన్న, మధ్య, సూక్ష్మ పరిశ్రమలకు, మైక్రోఫైనాన్స్, నాన్ బ్యాంకింగ్ రంగాలకు, విద్యుత్ డిస్కమ్ లకు, నిర్మాణరంగానికి,పన్ను చెల్లింపుదార్లకి లిక్విడిటీ పెంచే ప్రభుత్వ ప్రయత్నాల గూర్చిన ప్రకటన చేశారు. మూడు లక్షల కోట్ల రూపాయలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అదనపు సెక్యూరిటీ లేకుండా(కొల్లేటరల్ ఫ్రీ ) రుణాలు ఇస్తామని ప్రకటించారు.

ఈ రుణాలు నాలుగేళ్లలో తీర్చవచ్చు. ఈ రుణాలే కాక 20 వేల కోట్ల రూపాయలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్న చిన్న, మధ్య పరిశ్రమలకు మూలధనం (కాపిటల్ ) రూపంలో ఇస్తామని ప్రకటించారు. ఇంతేకాక  చిన్న, మధ్య తరహా లాభదాయక పరిశ్రమల విస్తరణ కోసం 50 వేల కోట్లు మూలధనంగా కేటాయించారు.

వడ్డీ రేట్లపై రాయితీ ఇస్తారా?

ఈ రుణాలు, మూలధనం వల్ల ఆయా పరిశ్రమలకు అవసరమైన ద్రవ్యం (లిక్విడిటీ ) చేకూరుతుంది. ముడి పదార్థాలకీ, కార్మికుల వేతనాలకు, పరిశ్రమల ఉత్పత్తులకు కావలసిన ఇతర ఖర్చులకూ అవసరమైన ధనం సమకూరుతుంది. కానీ ఈ రుణాలు, మూలధనం ఇవ్వటానికి తగిన మార్గదర్శకాలు ఏమిటి అన్నదే ముఖ్యాంశం.

వడ్డీ రేట్లపై కూడా ఏదైనా రాయితీ ఉంటుందా అనే విషయంలో కూడా స్పష్టత రావలసి ఉంది. ఇంతకు మునుపు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, వాటిని చెల్లించక నిరర్థక ఆస్తుల క్రింద వర్గీకరించబడిన పరిశ్రమలకు కూడా ఈ రుణాలు, మూలధనం ఇచ్చే అవకాశం ఉంటుందా, ఒకవేళ ఇస్తే ముందు తీసికొన్న రుణాలకి ఈ డబ్బు జమ కట్టుకుంటారా, లేక ఉత్పత్తి కొరకు మాత్రమే ఈ ధనం ఉపయోగించాలి అనే నియమాలు ఏమైనా ఉంటాయా అనే విషయాల్లో స్పష్టత రావలసిన అవసరం ఉంది.

కార్మికులకు ఉపకరించే ప్యాకేజీ

ఉత్పత్తి కి అయ్యే ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువగా ఉండటం వల్లో, ఉత్పత్తులకు తగిన గిరాకీ (డిమాండ్ ) లేకపోవటంవల్లో నష్టాల పాలవుతున్న పరిశ్రమలకు ఈ ధనసహాయం వల్ల తగిన ప్రయోజనం ఉండదు. పైగా రుణాలు ఇచ్చిన బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్.పి ఎల ) ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న నిరర్థక ఆస్తుల మార్గదర్శకాలలో కొంతకాలం కోసమైనా రిజర్వుబ్యాంకు మార్పులు చేస్తే తప్ప, బ్యాంకులు రుణాలు ఇవ్వటానికి, ఇచ్చిన రుణాలు విడుదల చేయటానికి వెనుకంజ వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చిన్న, సూక్ష్మ, మధ్య తరహా నిర్వచనంలో చేసిన మార్పుల వల్ల ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు ఈ పరిధిలోకి వస్తాయి. తద్వారా ప్రకటించిన రుణాలు, మూలధనం పొందే అవకాశం కలిగించారు. ఎక్కువ ధనం పరిశ్రమలకీ, ముడి పదార్థాల తయారీదార్లకీ, తద్వారా కార్మికులకీ అందుబాటులోకి రావడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక కార్యకలాపాలు మెరుగు అవుతాయి.

దేశీయ కంపెనీలే ఇక భారం మోయాలి

ప్రభుత్వ కొనుగోళ్లలో రెండు వందల కోట్ల వరకు గ్లోబల్ టెండర్ పద్ధతి రద్దు వల్ల స్వదేశీ ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వాటి ఉత్పత్తులను సరఫరా చేసే అవకాశం కలిగిస్తున్నారు. ఈ. పీ. ఎఫ్. చెల్లింపులలో మరి కొంతకాలం వెసులుబాటు, కంట్రిబ్యూషన్ 12శాతం నుంచి 10 శతం తగ్గింపు వల్ల  వేతనదారుల నగదు పరిస్థితి కొంత మెరుగవుతుంది.

మైక్రోఫైనాన్స్, నాన్ బ్యాంకింగ్ రంగానికి ప్రకటించిన పధకాల వల్ల ఆయా రంగాల్లోని కంపెనీలకు రుణ సౌకర్యం పెరిగి వారి లిక్విడిటీ పెరుగుతుంది. కానీ, అటువంటి కంపెనీలు ఇచ్చిన కొన్ని వసూలు కాని కొన్ని రుణాల వల్ల, ఆ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా వర్గీకరించిన సందర్భాలలో, బ్యాంకులు ఆ కంపెనీలకు రుణాలు ఇచ్చే సాహసం చేస్తాయా అనేది ప్రశ్నార్థకం.

కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీల డెట్ పేపర్స్ కి పూర్తిగా హామీ ఇచ్చినా, వయబిలిటీ లేని కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇచ్చే అవకాశం తక్కువ. మైక్రోఫైనాన్స్, నాన్ బ్యాంకులు కంపెనీలకు తగిన నిధులు సమకూర్చడం వల్ల వారు ఇచ్చే రుణాల ద్వారా మరిన్ని చిన్న, సూక్ష్మ తరహా కంపెనీల, నిర్మాణ రంగం కంపెనీల ఆర్ధిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం వుంటుంది.

విద్యుత్ రంగానికి కూడా వెసులుబాటు

విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు (డిస్కమ్స్) 90 వేల కోట్ల రూపాయల రుణాలు మంజూరు ద్వారా వాటి లిక్విడిటీ పెరిగి, విద్యుత్ జనరేషన్ కంపెనీలకు డిస్కంలు  చెల్లించవలసిన బకాయిలు చెల్లించే అవకాశం కలుగుతుంది. విద్యుత్ డిస్కంలు రుణాలు పొందటానికి రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వాలన్నదే ఇందులో మెలిక.

రోడ్ల, రైల్వే కాంట్రాక్టర్లకు ఇచ్చిన ఆరు నెలల అదనపు సమయం, వారికి విడుదల చేసే బ్యాంకు గ్యారంటీల వల్ల ఆయా నిర్మాణాలు ఆగకుండా నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి కొనసాగుతుంది. ఇదే విధంగా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కలిగించిన అదనపు సమయం వలన కార్మికులకు, కూలీలకు ఉపాధి కొనసాగుతుంది.

పెరిగిన నిర్మాణ సమయం వల్ల పెరిగే అదనపు వ్యయం  కొనుగోలుదారులే భరించాల్సి వుంటుంది. ఉదాహరణకు ఒక ఫ్లాట్ నిర్మాణంలో జరిగే ఆలస్యం వలన పెరిగిన ఫ్లాట్ ధరను కొనుగోలుదారుడు భరించాలి. ఇంతే కాక ఈ అదనపు సమయంలో కొనుగోలుదారుడు తీసుకున్న రుణం మీద వడ్డీ కూడా కొనుగోలుదారుడే చెల్లించాలి.

ఈ అదనపు ఖర్చు కి అతనికి రాయితీ ఎవరిస్తారు? టీ.డీ.ఎస్.లో 25 శాతం తగ్గించటం వలన పన్ను చెల్లంపుదారులకు సమయంలో మాత్రమే కొంత వెసులుబాటు కలుగుతుంది. అడ్వాన్స్ టాక్స్ చెల్లింపులలో గానీ, కట్టవలసిన నన్ను గానీ ఏ మార్పూ ఉండదు.

ఈ నిధులన్నీ ఎలా సమకూరుస్తారో?

సంవత్సరాంతంలో మొత్తం పన్ను ఒక్కసారిగా కట్టే సమయంలో అది భారంగా అనిపిస్తుంది. పెండింగ్ టాక్స్ రి ఫండ్స్ వెంటనే ప్రజలకు చెల్లించడం ద్వారా వారి లిక్విడిటీ పెరుగుతుంది. ఈ పధకాలన్నిటికీ ప్రభుత్వం ఏ విధంగా నిధులు సమకూర్చుకుంటుందో అనే విషయంలో ఆర్థిక మంత్రి వివరణ ఇవ్వలేదు.

రాబోయే కొద్ది రోజులలో పూర్తి స్థాయి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే సమయంలో నిధుల సమీకరణ వివరాలు కూడా ప్రకటించే అవకాశం వుంది. పరిశ్రమల ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచి, ప్రజలలో కొనుగోలు శక్తి పెంచటం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగేలా చేయటమే ఈ ప్యాకేజీ లక్ష్యంగా అనిపిస్తున్నది.

వలస కూలీల ఆకలితీర్చడం కోసం…

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర నిధులు, టూరిజం, హెల్త్ కేర్ మొదలగువాటిని గురించిన ప్రభుత్వ నిర్ణయాలను ఇంకా ప్రకటించవలసి ఉంది. ఇక రెండవ రోజు ప్రకటించిన ఉద్దీపనలు విశ్లేషించుకుందాం. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు వలన దేశంలో ఏ ప్రాంతంలో రేషన్ షాపు ద్వారా అయినా రేషను పొందే అవకాశం వలస కూలీలకు లభిస్తుంది.

రెండు నెలల పాటు వలస కూలీల ఆహార అవసరాలు తీర్చేందుకు ఏర్పాటు హర్షణీయం. రేషన్ కార్డు లేని వారికి కూడా 10 కిలోల బియ్యం లేదా గోధుమలు ఒక కిలో శనగలు ఇవ్వటం వలన కోట్ల మంది ఆకలి తీరుతుంది. 86,600 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలతో అన్నదాతల  వ్యవసాయ వ్యయాన్ని ఎంతో సహాయపడుతుంది.

కానీ ఈ రుణాలు వ్యవవసాయదారునికి ఎప్పుడు అందుతాయన్నదే ముఖ్యం. పంటల సీజన్ దాటాక ఎప్పుడో రుణాలు ఇస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం రాష్ట్రాలకు ఇస్తామన్న 6,700 కోట్లు చాలా తక్కువ. నిజం చెప్పాలంటే, ఇది ఒక రాష్ట్రానికే ఎంతవరకు సరిపోతుందో చెప్పలేం.

మోదీ ప్యాకేజీకి ఐక్య రాజ్య సమితి కితాబు

ఇప్పటికే ప్రధానమంత్రి దృష్టికి అన్ని రాష్ట్రాలు తమ గోడు అనేకసార్లు వినిపించాయి. ముందు ముందు ప్రకటిస్తారేమో వేచి చూద్దాం. వీధి వ్యాపారులకు 10 వేల చొప్పున రుణాల పధకం వారికి వ్యాపార ఉపాధి హామీ ఇస్తుంది. ఏ పధకాలయినా సకాలంలో అందితేనే ఆ ఫలితాలు దక్కుతాయి.

ఇది ఇలా ఉండగా, ఐక్య రాజ్య సమితి  మోదీ ప్యాకేజికి గొప్ప కితాబు ఇచ్చింది. అమెరికా, జపాన్ తర్వాత భారత్ దే భారీ ఉద్దీపనా పథకమని ప్రశంసల వర్షం కురిపించింది. కరోనా వైరస్, లాక్ డౌన్ ల వల్ల వృద్ధిరేటు మందగించినప్పటికీ ప్రపంచంలో చైనా, భారత్ మాత్రమే సానుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వెల్లడించిన  ఆర్ధిక నివేదికలు చెబుతున్నాయి.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి భారత్ జి.డి.పి 1.2 శాతం మాత్రమే ఉండటానికి అవకాశం ఉందని ఐ.రా. స అంచనా వేసింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో 5.5 శాతం జి.డి.పి  అందుకోగలదనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఆచరణశీలత, సమిష్టి కృషితో భారతదేశం త్వరలో అగ్రరాజ్యంగా  ఆవిష్కారం అవ్వాలని ఆకాంక్షిద్దాం.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

క్లారిటీ: బీరం కు ఓటుతో బుద్ధి చెప్పే రోజు వచ్చేసింది

Satyam NEWS

అఖండ భారతావనిలోనే తొలిసారిగా లక్ష చండీ మహాయజ్ఞం

Satyam NEWS

గృహలక్ష్మి పథకం గడువు ఆగస్ట్‌ 31 వరకు పొడిగించాలి

Bhavani

Leave a Comment