31.7 C
Hyderabad
April 24, 2024 23: 17 PM
Slider ప్రపంచం

Analysis: మోడీ పర్యటనతో బంధం మరింత పటిష్టం

#narendramodi

ఒకప్పటి అఖండ భారతంలో భాగమైన బంగదేశాన్ని భారత ప్రధాని సందర్శించారు. బంగ్లాదేశ్ స్వర్ణోత్సవాలు, ‘బంగబంధు’ షేక్ ముజిబుర్ రహమాన్ శతజయంతి వేడుకల్లో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించారు. దివంగత నేత ‘బంగబంధు’ ముజిబుర్ రహ్మాన్ కు భారత ప్రభుత్వం ప్రకటించిన “గాంధీ శాంతి” పురస్కారాన్ని బహుకరించారు. ఆయన కుమార్తెలు బంగ్లా ప్రధాని షేక్ హసీనా, ఆమె సోదరి రెహానాకు ఆ పురస్కారాన్ని అందజేసి, అభినందనలు తెలిపారు.  

ఈ సందర్భంగా, బంగ్లాదేశ్ విమోచనా పోరాటంలో తన పాత్రను, జైలుకు వెళ్లిన ఉదంతాన్ని నరేంద్రమోదీ గుర్తు చేసుకున్నారు. ఇందిరాగాంధీ పాత్రను కూడా ప్రశంసించారు. రెండు దేశాల అధినేతల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

పటిష్టమైన సంబంధాలతో….

రెండు దేశాల మధ్య బంధాలు మరింత గట్టి పడటానికి ఇటువంటి చర్యలు దోహదపడతాయి.పక్క పక్క దేశాల మధ్య  బంధాలు ఎంత గట్టిగా ఉంటే అంత మంచిదని,సరిహద్దు దేశాల స్నేహ సంబంధాలకు హద్దులే ఉండకూడదని రాజనీతి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు పాలకులకు గుర్తు చేస్తూనే వున్నారు.

విదేశాంగ విధానంలో ఒక్కొక్క పాలకుడు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నారు. ఇండియా – బంగ్లాదేశ్ మధ్య గతంలో కొన్ని విభేదాలు చెలరేగినా, ప్రస్తుత ప్రధాని హసీనా సమయంలో సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ – భారత్ మధ్య వాతావరణం కొంత చల్లబడుతోంది. చైనాతోనూ సరిహద్దు ఘర్షణలు  తగ్గుముఖం పట్టాయి.నేపాల్ మళ్ళీ స్నేహ హస్తాన్ని చాటుతోంది.

కరోనా తర్వాత ఇదే మొదటి పర్యటన

ఇది ఇలా ఉండగా, పశ్చిమ బెంగాల్, అసోంలో ఎన్నికల ఆట ఆరంభమైంది. ఆ రెండు రాష్ట్రాలలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని, మరీ ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలని బిజెపి చాలా ఆశగా చూస్తోంది. ఈ సందర్భంలో బంగ్లాదేశ్ పర్యటన ఆసక్తిగా మారింది. ఈ రెండు రాష్ట్రాలు ప్రధాని కదలికలను చాలా సునిశితంగా  పరిశీలిస్తున్నాయి.

ఆ దేశంలో నరేంద్రమోదీ చేసే వ్యాఖ్యలు, వేసే అడుగులను బట్టి ప్రతి వ్యాఖ్యలు చేయడానికి, ప్రతి చర్యలు చేపట్టడానికి ఈ రెండు రాష్ట్రాల ప్రతిపక్షాలు కాచుకొని కూచున్నాయి.  ప్రపంచంలోకి కరోనా అడుగుపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.

ప్రస్తుతం కోవిడ్ మళ్ళీ విజృంభిస్తున్నా, బంగ్లాదేశ్ ఆహ్వానానికి ప్రాముఖ్యత నివ్వడం గమనార్హం.బంగ్లాదేశ్ – భారత్ అధినేతల కలయికను మన సరిహద్దు దేశాలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి.పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి చెంది స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డానికి భారతదేశం ఎంతో కృషి చేసింది, ఎన్నో త్యాగాలను చేసింది. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ గా పిలుచుకునే ఆ ప్రాంతం భాషా ప్రయుక్త దేశంగా ఏర్పడింది.

చారిత్రకంగా అది బెంగాల్ భాషా ప్రాంతం.  అక్కడి అధికార భాష బెంగాలీ. భాషతో పాటు మత ప్రాతిపదిక మీద ఈ దేశం రూపొందుకుంది. అనేక కష్టాలు, ఒడిదుడుకులను అధిగమించి, ప్రస్తుతం ప్రగతి వైపు పరుగులెత్తుతోంది.  ప్రధాని మోదీ ప్రయాణం అట్టహసంగా సాగినా,ఇస్లామిక్ గ్రూపుల నుంచి నిరసనలు హోరెత్తడం, కాల్పుల్లో కొందరు మరణించడం ఒక అపశృతి.బంగ్లాదేశ్ గా స్వాతంత్ర్యం పొందాలని 1971లో తూర్పు పాకిస్తాన్ లో  పెద్ద పోరాటం జరిగింది.

అది భారత్ – పాకిస్తాన్ యుద్ధంగా మారింది. భారత్ చేతిలో పాక్ ఓడిపోయింది. ఈ ఓటమి బంగ్లాదేశ్ ఏర్పాటుకు పునాదిగా నిలిచింది. తూర్పు పాకిస్తాన్ మొత్తం బెంగాలీల ప్రాంతం. వారి పోరాటం విజయవంతమై, ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడడానికి మన భూమిక చాలా కీలకమైంది.

బంగ్లాదేశ్ ఏర్పాటులో ఇందిర పాత్ర మరువలేము

అందులో ప్రధాన పాత్ర అప్పటి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీదేనని చరిత్ర విదితం. నేటి ప్రధాని నరేంద్రమోదీ పర్యటన వలన రెండు దేశాల్లో తలదాచుకుంటున్న శరణార్థులకు నైతిక మద్దతు లభించినట్లే భావించాలి. పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం  ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, బిజెపికి కొంత అనుకూలంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్ లోని ఒరాకండిలో ఉన్న మథువా దేవాలయన్ని ప్రధాని మోదీ సందర్శించారు.ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న ఎన్నికల్లో 35 నియోజక వర్గాల్లో మథువాలా ప్రభావం బలంగా ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్ ను పదే పదే గుర్తు రెచ్చగొడుతున్నారు.

దానికి  గండి గొట్టడానికి నరేంద్రమోదీ పర్యటన బిజెపికి కొంత ఉపయోగ పడుతుంది.  బహుళ పాక్షిక సిద్ధాంతం, ప్రాంతీయ రక్షణ, తీవ్రవాదం అణచివేత,సహకారం, పెట్టుబడులు, వ్యాపార విస్తరణల ప్రోత్సాహం మొదలైనవి బంగ్లాదేశ్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంలో ముఖ్యమైనవి.భారతదేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు బాగానే కొనసాగుతున్నాయి.

తీస్తా నదీజాలల వివాదం….

రెండు దేశాల మధ్య నదీ జలాల పంపకాల్లో కొన్ని వివాదాలు ఉన్నాయి. అందులో తీస్తా నదీ జలాల అంశం ప్రధానమైంది. అప్పుడప్పుడు సరిహద్దుల్లో సమస్యలు వస్తున్నాయి. కొందరు ఆ దేశవాసులు భారత్ లో ప్రవేశిస్తున్నారు. 2015లో భూమి సరిహద్దులపై రెండు దేశాలు ఒక అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నాయి. దీన్ని మంచి పరిణామంగా భావించాలి.

గతంలో భారత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేసిన కాల్పులు రెండు దేశాల మధ్య విభేదాలు సృష్టించాయి.2001 నుంచి 2011 మధ్య కాలంలో  సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వందలమంది మరణించారు. ప్రస్తుతం ఈ వాతావరణం కొంత సద్దుమణిగింది. సరిహద్దుల్లో శాంతి ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. సార్క్, కామన్ వెల్త్ మొదలైన వాటిల్లో  రెండూ సభ్య దేశాలుగా ఉన్నాయి. మనతో పోల్చుకుంటే, ఆ దేశానికి చైనాతో వాణిజ్య సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి.

 బంగ్లాదేశ్ సైనిక దళానికి ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. ఆ దేశాన్ని చైనా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. ఈ అంశంలో భారత్ చాలా అప్రమత్తంగా ఉండాలి. పౌరసత్వ సవరణ బిల్లు విషయంలోనూ బంగ్లాదేశ్ కు మనపై కొన్ని అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయి. వీటిని నివృత్తి చేసుకోవాలి. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల ప్రగతికి ఊతంగా నిలుస్తుందని ఆశిద్దాం. 

ఐకమత్యమే మహాబలంగా భావించి ఇరుదేశాలు బంధుత్వాన్ని మరింత పెంచుకుంటాయని ఆకాంక్షిద్దాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

జర్నలిస్టుకు అన్ని వేళలా అండగా ఉంటా: ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

పవన్ కళ్యాణ్ ప్రమాదకరమైన విభజన శక్తి

Satyam NEWS

మోడీ ఆన్ ఫైర్: 12 రోజుల్లో పాకిస్తాన్ ను ఓడిస్తాం

Satyam NEWS

Leave a Comment