24.7 C
Hyderabad
March 29, 2024 05: 35 AM
Slider ప్రత్యేకం

ఎన్నికల జాతరను తలపిస్తున్న రాజకీయ డ్రామాలు

#cmkcr

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన రాజకీయపార్టీలైన అధికార తెరాస, ప్రతి పక్షాలు బీజేపీ, కాంగ్రెస్ ల విన్యాసాలు ఎన్నికల జాతరను తలపిస్తున్నాయి. తెరాస పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  ఏర్పాటైన సభలో తెలంగాణ ముఖ్య మంత్రి కే.చంద్ర శేఖర్ రావు సూటిగా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.

కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని దుయ్యబట్టారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఆవశ్యకత ఉందని తన వాణిని గట్టిగా వినిపించారు. కేంద్ర స్థాయిలో బీజీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ను, మరోవైపు బీజీపీ ని సమదూరంలో ఉంచి రాజకీయ సమరం చేయడం  తెరాస ముందున్న ఏకైక లక్ష్యం అని ఆయన  అనేక  సందర్భాలలో తన వైఖరి ప్రదర్శిస్తున్నారు.

రాహుల్ రాకతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం

కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఆయన తెరాస ను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్… ఇటీవల ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాకతో కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది. వరంగల్ లో నిర్వహించిన  భారీ సభ విజయవంతం కావడం  కాంగ్రెస్ పార్టీ  శ్రేణులలో  సందడి మొదలైంది. కాంగ్రెస్ లో అనుభవజ్ఞులైన  నేతలకు కొరత లేదు. అదే ఆ పార్టీకి బలం..బలహీనత కూడా. అది కాంగ్రెస్ తనకు తానుగా పెంచి పోషించిన విష సంస్కృతి. చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఇది  కూడా ఒక ప్రధాన కారణం అని విమర్శకులు విశ్లేషిస్తారు. కోలుకోలేని దెబ్బ తగిలినా కాంగ్రెస్ తనను సమీక్షించుకుని,

సంస్కరించుకనే దిశగా అడుగులు వేయకపోవడం ఆ పార్టీ లో ఉన్న పెద్ద లోపం. ఇటువంటి దుస్థితి గమనించి పార్టీ శ్రేయస్సు కోసం ఎవరైనా మాట్లాడితే, వారి సీనియారిటీ కూడా మరచి గ్రూప్ లు కడుతున్నారని ఎదురుదాడి చేయడం కాంగ్రెస్ పార్టీ దుర్లక్షణం.

గాంధీల చేతిలో బందీగా ఉన్నత కాలం పీకే లకు కూడా కాంగ్రెస్ చేతికి అధికారం దక్కేలా చేయడం అసాధ్యం. ఈ సంగతి పసిగట్టి ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీలో చేరడానికి విముఖత చూపినట్లు అర్థం చేసుకోవాలి. అదే రకమైన దుష్ట సంప్రదాయాన్ని వదిలించు కోక పొతే  తెలంగాణ తో సహా  ఏ ఇతర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.

అమిత్ షా రాకపైనే బీజేపీ ఆశలన్నీ

ఇక బీజెపీ విషయానికి వస్టే…ఈ నెల 14 న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా  పాల్గొనబోయే సభ పై రాష్ట్ర బీజెపీ చాలా ఆశలు పెట్టుకుంది. రాహుల్ గాంధీ సభకు దీటుగా భారీ ఎత్తున సభ నిర్వహించాలని రాష్ట్రానికి చెందిన బీజెపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సభ నుంచి అమిత్ షా ఇటు తెరాస , అటు కాంగ్రెస్ పార్టీలకు గట్టిగా హెచ్చరిక చేయాలని వారు కోరుకుంటున్నారు. తెరాస, కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని  భాజపా ప్రచారం చేస్తోంది. అయితే ఈ తరహా విమర్శల్ని తిప్పి కొడుతూ తెరాస, బీజేపీ కలిసి తెలంగాణా ప్రజల్ని మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. 

ప్రధానంగా ఈ మూడు పార్టీల ఆర్భాటం చూస్తుంటే ఎన్నికల ప్రచార కోసం పోటీ పడుతున్నట్లు అనిపిస్తోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలలో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తిని లబ్దిగా మార్చుకొని అధికారం చేజిక్కించుకావాలని కాంగ్రెస్, బీజెపీ లు ఆశిస్తున్నాయి.  ప్రధాన ప్రతి పక్షాల వ్యూహాలను తలదన్ని , వరుసగా  మూడో సారి అధికార పీఠం అధిష్టించాలని

తెరాస పథకాలు రచిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం తమదేనని ఈ మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపోటములు శాసించగల ఓటరు మదిలో ఏముందో గ్రహించడం దుస్సాహసం. నేతల తల రాతలు చిటికెలో తారుమారు చేయగల సత్తా ఉన్న ఓటరు చైతన్యవంతంగా ఉన్నంత కాలం భారతదేశంలో ప్రజాస్వామ్య భావన  మరింత పరిపుష్టం అవుతూనే ఉంటుందనేది కాదనలేని సత్యం.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు

Related posts

ఒంటిమిట్ట సీతారాములోరి కల్యాణానికి కరోనా ఎఫెక్ట్

Satyam NEWS

రుణాలపై క్లారిటీ ఇవ్వనున్న అదానీ గ్రూప్

Satyam NEWS

కార్తీకమాసం కైవల్యపథం!

Sub Editor

Leave a Comment