33.4 C
Hyderabad
March 9, 2021 15: 28 PM
Slider సంపాదకీయం

జగనన్న రాజ్యంలో అయ్యో రామా…..

#JaiSreeram

‘‘సిగ్గుతో తలదించుకున్నాడు’’ అని రాసేందుకు కూడా రామతీర్ధం రాముడు అవకాశం ఇవ్వడం లేదు. పాపం ఆయనకు తల తీసేశారు. కుల రాజకీయాల కోసం మతంపై దాడులు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్న తుచ్ఛమైన రాజకీయ నాయకులను ఏమీ అనలేక సీత, లక్ష్మణస్వామి మౌనంగా తలదించుకుంటున్నారు.

ఇది ఒక్క రామతీర్ధం కధ మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్ లోని చాలా దేవాలయాలలో ఎన్నడూ లేని విధంగా దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తులు చేస్తున్నారనో, ఎలకలు తిరుగుతూ తలగడం వల్ల విగ్రహాలు పడిపోతున్నాయనో, రధాలు వాటంతట అవే కాలిపోతున్నాయనో చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పక్కదోవ పట్టిస్తున్నది.

విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని పట్టుకోవడంలో పోలీసు శాఖ తన నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు, కేవలం చంద్రబాబునాయుడు పుట్టిస్తున్న పుకార్లు మాత్రమే అని చెప్పడానికే అందరూ తొందరపడుతున్నారు తప్ప గ్రామాలలో ఏం జరుగుతున్నది?

ఏ ఏ సామాజిక వర్గాలు ఓవర్ యాక్టీవ్ గా మారిపోతున్నాయి? ఏ ఏ సామాజిక వర్గాలను అణచివేస్తున్నారు అనే సోషల్ డైనమిక్స్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొన్ని సామాజిక వర్గాలు హైపర్ యాక్టీవ్ గా మారడం, మరికొన్ని సామాజిక వర్గాలను అణచివేయడం ఆంధ్రప్రదేశ్ లో అనునిత్యం జరుగుతున్నది.

దీన్ని ప్రభుత్వంలో ఉన్న వారు పట్టించుకోకపోతే అణచివేతకు గురవుతున్న సామాజిక వర్గాలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్పినా మద్దతు పలకడానికి కొన్ని కులాలు సిద్ధంగా ఉంటాయి.

అదే నిజమని భావించి అదే తరహా పనులలో ముందుకు పోతూ ఉంటే వెనుక సామాజిక అసమానత అనే పెద్ద గొయ్యి ఏర్పడి అధికార పార్టీ అందులో కూరుకుపోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం చేస్తున్న వారికి ఈ విషయాలన్నీ తెలియనంత అమాయకులు కాదు.

వారికి ఇలా జరగడమే రాజకీయంగా మేలు చేస్తుందని బలంగా నమ్ముతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంత పాడేందుకు బిజెపి ఎటూ తోడు ఉంటున్నది. చంద్రబాబునాయుడి హయంలో 30 దేవాలయాలు ధ్వంసం చేశారు. జగన్ హయాంలో ఇంకా ఆ సంఖ్యకు చేరుకోలేదు… ఇంకా 20 దేవాలయాల్లోనే సంఘటనలు జరిగాయి అని చెప్పే సాహసానికి బిజెపి చేరుకున్నది.

అంటే ఇంకో 20 గుళ్లలో విగ్రహాలు ధ్వంసం అయిన తర్వాత అప్పుడు చంద్రబాబునాయుడి హయాంలో కూలగొట్టిన దేవాలయాల సంఖ్యను దాటిపోయిన తర్వాత గానీ బీజేపీ స్పందించదన్నమాట. హిందూ మతం ఆధారం చేసుకుని రాజకీయ పార్టీ నడిపే బిజెపీనే ఈ విధంగా వ్యాఖ్యానించిన తర్వాత రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అడ్డేముంటుంది?

దేవాలయాలపై దాడులు జరిగినంత మాత్రాన హిందూ ధర్మానికి ఏమౌతుంది? ఏమీ కాదు. హిందూ మతం ఎంతో గొప్పది… ఎంతో సహనం వహించే మతం అది. ఎవరి ఖర్మాన వారు పోతారు… ఇలాంటి చప్పిడి వేదాతం చెప్పే పలాయనవాదులు తమ ఆలోచన మార్చుకోకపోతే విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ఇవన్నీ చెబితే వినేవాడు ఎవడూ లేడని తెలుసు

చంద్రబాబునాయుడు రామతీర్ధం వెళ్లడానికి ముందే వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి అక్కడకు వెళ్లడం, విజయసాయిరెడ్డి అక్కడ నుంచి వెళ్లే వరకూ చంద్రబాబును కట్టడి చేయడం అధికార దర్పానికి అద్దంపడుతుంది. ఇవన్నీ చెబితే వినేవాడు ఎవడూ లేడని తెలుసు. అయినా చెప్పాలి తప్పదు.

రామతీర్ధం సంఘటన జరిగిన తర్వాత దేవస్థానం చైర్మన్ ను ప్రభుత్వం పదవి నుంచి తీసేసింది. దేవస్థానం చైర్మన్ లకు శాంతి భద్రతలు కాపాడే అధికారం ఉంటుందా? దేవస్థానం చైర్మన్ లకు విశేష అధికారాలు ఉంటాయా? దేవస్థానం చైర్మన్ తెలుగుదేశం వాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసేసినా బిజెపి మాట్లాడదు.

ఈ ప్రశ్నలు ఏమీ అడగదు. ఇదే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది. బిజెపి యువజన విభాగంలో ఉన్న వ్యక్తి రాత్రికి రాత్రి పార్టీ ఆదేశాలను ఖాతరు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి ఒక పెద్ద ట్రస్టుకు చైర్ పర్సన్ అయిపోయిన సంఘటన కూడా చూశాం.

ఇలా చేసిన ఆమెపై అప్పటి బిజెపి నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ లేఖ కూడా రాశారు. అయితే ఎవరూ ఏమీ చెప్పలేదు… ఎవరూ ఏమీ చేయలేదు…. ఇప్పటికే జరిగిన ఇలాంటి సంఘటనలపై హిందూ సంస్థల్లో కూడా ఇప్పుడు అంతర్మధనం మొదలైంది.

బిజెపి నాయకుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి కచ్చితంగా పోరాటం చేస్తే రాజకీయంగా లబ్ది చేకూరే సంఘటనలు జరుగుతున్నా ఆ పార్టీ కుల రాజకీయాలు చేసుకుంటూ కూర్చున్నది. అంతర్వేది రధం కాల్చివేస్తే దానిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు సీబీఐ విచారణ జరిపేలా చర్యలు తీసుకున్నారా? ఇలాంటి విషయాలపై మేం విచారణ జరపలేం అని సీబీఐ చెబితే దాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు పట్టించుకున్నారా? ఇది ఒక్క ఉదాహరణే. ఇలాంటివి ఎన్నో…..

మత రాజకీయాలు వద్దు. అవి సమాజాన్ని విడదీస్తాయి… ఎంచక్కా కుల రాజకీయాలు చేసుకుందాం. దానివల్ల అన్ని పార్టీలకూ రాజకీయంగా లాభం కలుగుతుంది….. సారీ శ్రీరామ్.

Related posts

నీట్, ఐఐటీ-జేఈఈ 2021 గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

Satyam NEWS

గ్రీన్ ల్యాండ్ ఉన్నత పాఠశాలలో కరోనా వైరస్ పై అవగాహన

Satyam NEWS

కరోనా ఎలర్ట్: ఇంటి నుండి బయటికి ఎవ్వరూ రాకండి

Satyam NEWS

Leave a Comment