36.2 C
Hyderabad
April 23, 2024 20: 52 PM
Slider సంపాదకీయం

భారత సామ్రాజ్యమా ఊపిరి పీల్చుకో బైడెన్ మనవాడే

#Jo Biden

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేసేందుకు అక్కడి పౌరులు ఎంత కన్ఫ్యూజన్ కు గురయ్యరో తెలియదు కానీ ట్రంప్ గెలవాలని కోరుకోవాలో జో బైడెన్ గెలవాలని కోరుకోవాలో తెలియక మనం అంతకన్నా ఎక్కువ తికమకకు గురయ్యాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే హక్కు మనకు లేకపోయినా మనం కూడా అక్కడి పౌరుల కన్నా ఎక్కువగా ఆలోచించాం.

ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తే మనకు ప్రయోజనం అనేది ఒక్కటే మన ఆలోచన. మనకు ఉపయోగపడటమే కాకుండా ఇద్దరిలో ఎవరు ఎక్కువగా చైనా, పాకిస్తాన్ లను వ్యతిరేకిస్తారు అనేది కూడా మనకు వచ్చిన ఆలోచన. ఈ రెండు అంశాలలో ట్రంప్ ను, బైడెన్ ను అంచనా వేయడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం వల్లే మనం తికమకపడ్డాం.

కరోనా ఎఫెక్టుతో ఓట్ల లెక్కింపు ఆలశ్యం

మనం కన్ఫ్యూజన్ లో ఉండగానే జో బైడెన్  అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైయ్యారు. కరోనా నేపథ్యంలో సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపుపై సహజంగానే ఓర్పు చాలా తక్కువగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ చికాకు పడ్డారు. ట్రంప్ చీకాకు చూసిన తర్వాత ఆయన ఓడిపోతున్నాడని దాదాపుగా అందరూ ఒక అంచనాకు వచ్చేశారు.

డోనాల్డ్ ట్రంప్ కు మన ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి మద్దతు ఇచ్చారు…. ఇచ్చినట్లు కనిపించారు. మన కన్ఫ్యూజన్ కు ఇది కూడా కారణం. ప్రధాని మోడీ మద్దతు తనకు ఉందని తెలిసినా కూడా అమెరికాలోని శ్వేతజాతీయుల ఓట్ల కోసం చైనా, పాకిస్తాన్, ఇండియాలు చెత్త దేశాలు అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వీసా కోటాపై మాటలు మార్చడం ట్రంప్ చేసినంతగా వేరెవరూ చేయలేదు. భారత్ కు ట్రంప్ నష్టం చేస్తున్నా కూడా ఆయన చైనా, పాకిస్తాన్ లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే మనకు ఆనందం కలిగింది. మరి జో బైడెన్ కూడా ఇలాగే చేస్తారా చేయరా అనేది మాత్రమే మన అనుమానం.

ముందే కూసిన రాహుల్ కోయిల

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు ప్రకటన రాగానే  ముందుగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన వ్యక్త  కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ కన్నా ముందే రాహుల్ గాంధీ శుభాకాంక్షలు చెప్పడం చాలా మంది గమనించారు.

అంటే మోడీ మద్దతు పలికిన వ్యక్తి ఓడిపోయినందున రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారో ఏమో మనకు తెలియదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి మొదలైన నాటి నుంచే మన దేశంలోని మేధావులు రెండు వర్గాలుగా మారిపోయి భిన్నవాదనలు వినిపించారు.

ఎన్నికల హడావుడి మనకు ఎలా ఉన్నా రెండో సారి ఎన్నిక కాలేకపోయిన ట్రంప్ మాత్రం ఎన్నికలు జరిగిన తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆయన ఓటమిని అంగీకరించకుండా న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నారు.

అమెరికన్ సుప్రీంకోర్టు ఈ కేసులను స్వీకరిస్తుందో లేదో ఇప్పుడే తెలియదు కానీ ట్రంప్ మాత్రం కోర్టులను ఆశ్రయించేందుకు నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ పై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన ట్రంప్ చివరకు కరోనా వ్యాధిగ్రస్తుడయ్యారు. కరోనా నుంచి ఆయన కోలుకున్నా కరోనా కారణంగా అధ్యక్ష పదవిని కాపాడుకోలేకపోయారు.

జనవరి 20న బాధ్యతల స్వీకరణ

కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తారు. 78 ఏళ్ల వయసులో జోబైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న మొదటి వ్యక్తి. పోలింగ్ జరిగిన తర్వాత నుంచి గెలుపు ఓటములు ఈ ఇద్దరి మధ్య దోబూచులాడాయి.

నాలుగు రోజుల పాటు సాగిన ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో రెండో రోజుకే జో బైడెన్ గెలిచేందుకు సూచనలు కనిపించినా ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. ట్రంప్ శిబిరంలో కూడా ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపించినా ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించలేదు.

జోకర్ గా మిగిలిపోయిన అగ్రరాజ్య అధినేత

తానే గెలుస్తున్నానని ట్రంప్ చెబుతూ వచ్చారు. ఒక దశలో తనను తానే విజేతగా ప్రకటించుకుని ఇప్పుడు జోకర్ గా మిగిలిపోయారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత ఎక్కువ ఉత్కంఠ కలిగించిన ఎన్నిక. 1860లో పౌరయుద్ధం జరిగిన సందర్భంగా జరిగిన ఎన్నికలతో, దేశం దుర్భర పరిస్థితిలో ఉన్నప్పుడు 1930లో జరిగిన ఎన్నికల తర్వాత ఈ సారి జరిగిన ఎన్నికలనే కీలక ఎన్నికలుగా అమెరికా తో బాటు ప్రపంచం మొత్తం భావించింది.

బైడెన్ కు మహిళలు ఎక్కువగా ఓటు వేసినట్లు అంచనాలు వెలువడ్డాయి. ఆఫ్రికన్ అమెరికన్ల ఓట్లు జో బైడెన్ కే పడ్డాయి. శ్వేతజాతీయులు దాదాపుగా అందరూ బైడెన్ వైపు తిరిగిపోయారు. విద్యార్ధులు, నగరాలలోని విద్యావంతులు కూడా జో బైడెన్ వైపు తిరిగిపోయారు.

భారతీయ అమెరికన్ల మద్దతు బైడెన్ కే

బైడెన్ విజయం సాధించడంలో భారతీయ అమెరికన్లు కూడా కీలక పాత్ర పోషించారు. అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకముందు నుంచి బైడెన్‌ అమెరికా-ఇండియన్‌లపై ప్రత్యేక దృష్టిసారించారు. ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో కలిపి ప్రచారం చేయడం కూడా ఆయనకు కలిసొచ్చింది.

నిధుల సేకరణలో కూడా భారతీయ అమెరికన్లు బైడెన్‌కు అండగా నిలిచి పెద్ద మొత్తంలో విరాళాలను అందజేశారు. 800 మంది ప్రధాన దాతల జాబితాలో డజన్ల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. ఇప్పుడు మనం ఇంతగా కన్ఫ్యూజ్ అయిన విషయానికి వస్తే భారత్ కు ట్రంప్ బెటరా? బైడెన్ బెటరా? అనే సందేహం ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నది.

భారత్ అనుకూల వాదనలు చేసే బైడెన్

చైనా పాకిస్తాన్ లను ట్రంప్ వ్యతిరేకించినంతగా బైడెన్ వ్యతిరేకిస్తారా లేదా అనేది సందేహమే అయినా బైడెన్ కు భారత్ తో మంచి సంబంధాలు ఉండాలనే కోరిక అపారంగానే ఉంది. భారత్ తో అణు ఒప్పందానికి మార్గం సుగమం చేసిన సెనేటర్ గా బైడెన్ కు పేరు ఉంది.

అమెరికా ఉపాధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే భారత్ ను సందర్శించడమే కాకుండా భారత్ అమెరికా మధ్య భారీ రక్షణ ఒప్పందాలు కుదిరేలా ఆయన ప్రయత్నం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది కూడా బైడెనే.

అమెరికా అంటే ప్రేమ ఉన్న వారు మళ్లీ అమెరికాను కాపాడుకున్నారు అంటూ నినాదాలు మిన్నంటిని ఈ సమయంలో గెలిచిన వాడు భారత్ కు కూడా సన్నిహితుడే కావడం మనకు సంతోషం కలిగించే అంశం.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

ఉషస్సుల ఉగాది

Satyam NEWS

ఎన్నికల విధులలో పొరపాట్లు జరగవద్దు

Satyam NEWS

అమ్మకానికి అమరావతి: వచ్చే నెలలోనే వేలం, ఎకరానికి ఎంతంటే?

Satyam NEWS

Leave a Comment