39.2 C
Hyderabad
March 28, 2024 14: 17 PM
Slider జాతీయం

జనతా గ్యారేజ్ : ఉత్తర ప్రదేశ్ లో పువ్వు గుర్తుకు రిపేరు

#yogi adityanath

ఉత్తరప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దేశ రాజకీయాలను శాసించే కీలకమైన అతి పెద్ద రాష్ట్రం కావడం చేత, ఆ రాష్ట్రం ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఇంద్రుడు, చంద్రుడు అనే పొగడ్తలు ఆకాశాన్ని అంటాయి. ఒక ఆధ్యాత్మిక పీఠాధిపతి ముఖ్యమంత్రి అయ్యారు అన్నంతగా ప్రచారం జరిగింది.

సన్యాస జీవితం గడిపే సర్వసంగ పరిత్యాగిగా రాష్ట్రాన్ని సమభావంతో పాలిస్తారని అందరూ ఆశించారు. నరేంద్రమోదీ తర్వాత దేశానికి ప్రధానమంత్రి కాగలిగిన మానసిక ప్రవృత్తి కలిగిన ‘కర్మయోగి’గానూ అయన్ను కొందరు అభివర్ణించారు. కాల ప్రయాణంలో, మెల్లగా ఆ ముసుగులన్నీ తొలిగిపోతున్నాయి. ఆయన కూడా అందరి వలె ఫక్తు రాజకీయనాయకుడని గుర్తించేవారి సంఖ్య పెరిగిపోతోంది.

ఇహాలకు, ఇగోలకు అతీతుడు కాదు ఈ యోగీంద్రుడు

ఇహాలకు, ఇగోలకు అతీతమైన వ్యక్తి కాదనే ముద్ర బలపడుతోంది. సామాజిక అసమానతలు పెరిగిపోతున్న వేళ, సమాజంలో అశాంతి, రాజకీయాల్లో అసంతృప్తి పెరగడం అతి సాధారణమైన అంశం. అది ఉత్తరప్రదేశ్ లో ఈ మధ్య మరింతగా దర్శనమవుతోంది.

ముఖ్యమంత్రి తన సామాజిక వర్గానికే అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారని, మిగిలినవారిని చిన్నచూపు చూస్తున్నారనే ప్రచారం బాగా పెరుగుతోంది. ఇటు రాష్ట్ర బిజెపి వర్గాలతోనూ – అటు కేంద్ర పార్టీ వర్గాలతోనూ యోగి ఆదిత్యనాథ్ కు విభేదాలు పెరుగుతున్నాయానే వార్తలు బాగా వినపడుతున్నాయి.

స్థానిక ఎన్నికల్లో కమలానికి వ్యతిరేకత

ముఖ్యంగా బ్రాహ్మణులు, దళితులు, బలహీన వర్గాలు ముఖ్యమంత్రి వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఇటీవల అయోధ్య, వారణాసిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బిజెపికి ఓటమి ఎదురైంది. ఒక పక్క ముఖ్యమంత్రిపై పెరుగుతున్న వ్యతిరేకత, ఇంకొక పక్క స్థానిక ఎన్నికల్లో తాజా ఓటమి, మరోపక్క త్వరలో రానున్న ఎన్నికల నేపథ్యంలో, బిజెపి అధిష్ఠానం ఉత్తరప్రదేశ్ బిజెపిని మరమ్మత్తు చేసే పనిలో పడిందని భావించాలి.

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బ్రాహ్మణుల పాత్ర చాలా బలంగా ఉంటుంది. అసలు! ఉత్తర భారతదేశంలోనే రాజకీయాల్లో బ్రాహ్మణులు కీలకభూమికను పోషిస్తారు. ఒకప్పుడు దక్షిణ భారతంలోనూ అంతే శక్తివంతంగా ఉండేవారు. ఆ నాయకుల జాబితా చాలా పెద్దది.కాలక్రమంలో, దక్షిణాదిలో ఆ సామాజిక వర్గం పాత్ర పూర్తిగా తగ్గిపోయింది.

ఎక్కడో ఎవ్వరో అక్కడక్కడ ఒక్కరిద్దరు తప్ప పెద్దగా ఎవ్వరూ లేరు. ఉత్తరభారతంలో అలా కాదు. ఇప్పటికీ వారి పాత్ర ప్రముఖంగానే ఉంది. ఈ నేపథ్యంలో, యోగి ఆదిత్య విధానాలకు విసిగిపోయిన బ్రాహ్మణులు బిజెపికి దూరమై, మళ్ళీ కాంగ్రెస్ కో,మరో ప్రత్యామ్నాయ పార్టీ వైపో వెళ్లిపోతారనే భయం బిజెపి పెద్దలకు వచ్చిందని రాజకీయ వర్గాల్లో బాగా ప్రచారమవుతోంది.

బెంగాల్ తరహా రాజకీయం…..?

అందులో భాగంగా, పశ్చిమ బెంగాల్ లో చేసినట్లుగా, ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్యనేతలను బిజెపి వైపు మళ్ళించే వ్యూహాత్మక చర్యలు యూపిలోనూ ఆరంభమైనాయని వినికిడి.ఈ క్రమంలో, కాంగ్రెస్ కు చెందిన బ్రాహ్మణ నేత జితిన్ ప్రసాదను బిజెపి లోకి లాగారు.

దీనికి జాతీయ స్థాయిలో పెద్ద ప్రచారాన్ని కల్పించారు. జితిన్ ప్రసాద్ చేరిక వల్ల కాంగ్రెస్ కు ఎంతో నష్టం జరుగుతుందని, బిజెపికి అంతే లాభం జరుగుతుందంటూ కథనాలు ఒడ్డించి వారుస్తున్నారు. నిజానికి క్షేత్రస్థాయిలో జితిన్ ప్రసాద్ కు అంత దృశ్యం (సీన్ ) లేదని రాజకీయ పండితులు అంటున్నారు.

రాహుల్ గాంధీ ‘కోర్ టీమ్’ లో పనిచేసి ఉండవచ్చు, తండ్రి, తాతల నుంచి కాంగ్రెస్ తో రక్తసంబంధం కలిగి ఉండవచ్చు, బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఎంతోకొంత పరపతి ఉండవచ్చు గాక, రాష్ట్ర రాజకీయాలను, బ్రాహ్మణ సామాజిక వర్గం మొత్తాన్ని ప్రభావితం చేసేంత శక్తి జితిన్ ప్రసాదకు లేదనే వినపడుతోంది.

కాంగ్రెస్ పార్టీ బాగా బతికున్న రోజుల్లో, వీరి కుటుంబం కొంత చక్రం తిప్పి ఉండవచ్చు. గత కొన్నేళ్లుగా, కాంగ్రెస్ పార్టీ వలె ఆయన సాధించిన విజయాలు ఏమీ లేవు.2014,2019 లోక్ సభ ఎన్నికల్లోనూ,2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన వైఫల్యమే చెందారు.

జితిన్ వల్ల ఒరిగేదీ లేదూ తరిగేదీ లేదు

ఇప్పుడు ఈయన కాంగ్రెస్ వీడడం వల్ల ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని, బిజెపికి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదనే క్షేత్రస్థాయి వాస్తవాలు చెబుతున్నాయి. అధికారికంగా అధ్యక్ష స్థానంలో లేకపోయినా, ఆ పార్టీని నడిపిస్తున్నది రాహుల్ -సోనియా ద్వయం అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఉత్తరప్రదేశ్ రాజకీయాల బాధ్యతలను ప్రియాంక చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, వీరి కుటుంబానికి విశ్వాసపాత్రులు, యువతరం/నేటితరం నేత రాహుల్ కు అత్యంత ఆత్మీయులుగా ముద్రపడిన నేతలను అక్కడి నుంచి తప్పించి, తమ పార్టీలోకి లాక్కోవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ మధ్య జ్యోతిరాదిత్య సింధియా బిజెపిలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు జితిన్ ప్రసాద వెళ్లారు. సచిన్ పైలెట్ కూడా రేపోమాపో అన్నట్లుగా ఉన్నారు.

వీళ్ళను ఆపే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టానం చేసింది. కానీ,అవకాశవాద రాజకీయాల నేపథ్యంలో ఎవరు ఆగుతారు? ఎవరి స్వార్థం వారిది.జితిన్ కూడా అంతే. ఆయనేమీ కాలాతీత, మానవాతీత వ్యక్తి ఏమీ కాదు. మామూలు రాజకీయ నాయకుడు. ఒకవేళ, రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వస్తే, మళ్ళీ వీళ్ళందరూ వెనక్కు వస్తారు.

బెంగాల్ లో మళ్లీ రివర్స్ ట్రెండ్

ఇప్పుడు, పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న తిరుగుటపా తంతు చూస్తూనే వున్నాం కదా!ఒకప్పటి తృణమూల్ నేత, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ మళ్ళీ సొంతగూడు తృణమూల్ కు వచ్చేశాడు.యూపీలో కూడా అంతే జరుగుతుంది.బిజెపి మళ్ళీ గెలిస్తే, గెలిచినా సంతృప్తికరంగా ఉంటే?  వలసవెళ్లిన నేతలు అక్కడ ఉంటారు.

లేకపోతే, జంప్ అవుతారు. అంతకు మించిన ఆదర్శాలను నేటి భారతంలో ఆశించడం అమాయకత్వమే అవుతుంది.ఈ వెళ్లిపోతున్న నేతల పట్ల రాహుల్ గాంధీ ప్రభృతులు  కాళ్ళావేళ్ళా పడడం లేదు.ఆపడానికి ప్రయత్నం చేసినా, ఆగని నేపథ్యంలో పెద్దగా విచారాన్నీ వ్యక్తం చెయ్యడంలేదు. కొత్త నేతల కోసం అన్వేషిస్తున్నారు.

1989వరకూ ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణులు ఎక్కువశాతం కాంగ్రెస్ వైపే ఉన్నారు.తర్వాత తర్వాత బిజెపి వైపుకు మళ్లారు. 12 శాతంకు పైగా ఓటుబ్యాంక్ ఉన్న ఆ సామాజిక వర్గం అందరికీ అవసరమే. ఆ వర్గాన్ని తిరిగి తెచ్చుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. పోగొట్టుకోకుండా కాపాడుకోవాలని బిజెపి చూస్తోంది.

విభేదాలు ముదిరితే… యోగికి టాటా…

ఈ వివాదాలు, విభేదాలు ముదిరితే, ఫలితాల తర్వాత ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ను బిజెపి అధిష్టానం మార్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. అక్కడ బిజెపి – కాంగ్రెస్ కు తోడు మిగిలిన పార్టీలు కూడా ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా రెండవ స్థానంలో (49 సీట్లు) ఉంది.బహుజన సమాజ్ పార్టీ మూడో స్థానం(18సీట్లు), అప్నాదళ్ నాలుగో స్థానంలో (9 సీట్లు) ఉన్నాయి.

కాంగ్రెస్ కేవలం 7 సీట్లతో ఐదవ స్థానానికి చతికిలబడి వుంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు కలిగివున్న ఆ రాష్ట్రంలో 306 స్థానాల బలంతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో బిజెపి ఉంది.ఆ రాష్ట్రంలో సమస్యలు ఏ స్థాయిలో ఉన్నా, ప్రస్తుత ముఖ్యమంత్రిపై ఎన్ని విమర్శలు వస్తున్నా, బిజెపి ప్రస్తుతానికి చాలా బలంగా ఉంది. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా, బిజెపిని ఓడించడం అంత తేలిక కాదు.

కాంగ్రెస్ ప్రయాణం… అంత ఈజీ కాదు..

కాంగ్రెస్ తన స్థాయిని పెంచుకోవడం అంత ఆషామాషీ కాదు. కరోనా కల్పిత కష్టాలు,వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత, వివిధ సామాజిక వర్గాల్లోని అసంతృప్తి, రాష్ట్రం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, ఉపాధిలేమి వంటి అనేక ప్రతిబంధకాలు అధికార బిజెపిని తప్పకుండా చుట్టుముడుతాయి.

బిజెపి ఆధిక్యం అట్లుంచగా,కాంగ్రెస్ పార్టీ కంటే,సమాజ్ వాదీ పార్టీకి, ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వైపు ప్రజలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అధికారంలోకి వచ్చేంతగా ప్రతిపక్ష పార్టీలు ఏవీ అంత ఆకర్షణలో లేవు. బిజెపిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరిగి, ప్రతిపక్ష పార్టీల వైపు పెద్దగాలి మళ్ళితే తప్ప, ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ బిజెపియే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అదే సమయంలో సామాజిక సమన్యాయం, సమతుల్యత పాటించకపోతే,ఆశించిన అభివృద్ధి జరుగకపోతే, అసంతృప్తి పెరిగితే ఎంతపెద్ద పార్టీనైనా ప్రజలు గద్దె దింపుతారు. అధికారంలో ఉన్న పార్టీ పట్ల, నేతల పట్ల అధికంగా విసుగుచెందినా ఓటర్లు ప్రతిపక్షాలకు పట్టం కడుతారు.

దీనికి, నేటి కాంగ్రెస్, బిజెపిలే ప్రత్యక్ష ఉదాహరణలు.ఆంధ్రప్రదేశ్ లో మొన్న తెలుగుదేశంపార్టీని ఘోరంగా దింపి, వైసిపీని అందలం ఎక్కించారు.నిన్న తమిళనాడులో, పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకె పార్టీకి స్వస్తి పలికి, డిఎంకె పార్టీని పీఠంపై ఎక్కించారు.ప్రజలకు నచ్చకపోతే, రేపు యూపీలో కూడా అదే జరుగుతుంది. ఆన్నీ అశాశ్వతం అన్నది రాజకీయాల్లోనూ శాశ్వతం అని గ్రహించాల్సిందే.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

ఫ్లై హై: వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు

Satyam NEWS

సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం

Bhavani

కొబ్బరి బోర్డు చైర్మన్‌ దృష్టికి శ్రీకాకుళం జిల్లా రైతుల సమస్యలు

Satyam NEWS

Leave a Comment