28.7 C
Hyderabad
April 20, 2024 09: 36 AM
Slider జాతీయం

గెలిచిన దీదీని ఓడించేందుకు మోదీ ఆట

#MamataBenarjee

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఆట ముగిసింది కానీ, రాజకీయ రణక్షేత్రం రగులుతూనే వుంది. ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత ఎంత గందరగోళం జరిగిందో, ఇప్పుడూ అదే జరుగుతోంది. అల్లర్లు ఇప్పుడప్పుడే ఆగకపోగా, ఇంకా పెరిగేట్లు ఉన్నాయి.

రాష్ట్రంలో నేడు కనిపిస్తున్న దృశ్యాలు వాటికి అద్దంపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మంత్రులు, నేతలను సీబీఐ అరెస్టు చేసింది. దీనితో ఆగ్రహోదగ్రురాలైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబిఐ కార్యాలయంలో హల్ చల్ చేశారు. తృణమూల్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.”ఈ పరిణామాలపై పర్యవసానాలు తెలుసుకదా? ” అంటూ గవర్నర్ ధన్ ఖడ్ ముఖ్యమంత్రిని హెచ్చరించారు.

అదను దొరికినప్పుడల్లా ప్రతాపం చూపుతున్న మోదీ

మమతను గవర్నర్ హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. అదను దొరికినప్పుడల్లా హెచ్చరిస్తూనే వున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన అల్లర్లలో కొందరు మరణించారు. ఈ విషయంలోనూ గవర్నర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బిజెపి అగ్రనేతలు రాష్ట్రాన్ని సందర్శించి మమతపై విమర్శలు గుప్పించారు.

ఎన్నికల సమయంలో జరిగిన కాల్పుల సందర్భంగా కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై బిజెపి తృణమూల్ ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. అన్ని అల్లర్లకు, మరణాలకు మీరే కారణం అంటూ రెండు పక్షాల వారు ఒకరిపై మరొకరు ఆరోపించుకున్నారు. ఈ దూషణలు, ఆరోపణల పర్వం పూర్తికాక ముందే ‘నారదా స్కామ్ వివాదం ‘ మళ్ళీ తెరపైకి వచ్చింది. తెరపైకి రావడమే కాక, తృణమూల్ ముఖ్యనేతల అరెస్టు దాకా వెళ్ళింది.

అరెస్టుల పర్వం ఆగేది కాదు

ఈ అరెస్టుల పర్వం వీరితో ఆగేట్టు లేదు. తృణమూల్ లోని మిగిలిన ముఖ్య నేతలు కూడా అరెస్టులతో పాటు కేంద్ర ఏజెన్సీల నుంచి పలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

ఏదో విధంగా పశ్చిమ బెంగాల్ లో అల్లర్లు, అలజడులు, గందరగోళాలు సృష్టించి, రాజ్యంగ సంక్షోభం వచ్చిందని  చూపించి, రాష్ట్రపతి పాలన పెట్టే దిశగా దిల్లీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని మమతా బెనర్జీ ఎన్నోరోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నారు.

తాజాగా గవర్నర్ చేసిన హెచ్చరికలు ఈ అనుమానాన్ని మరోసారి బలపరుస్తున్నాయని తృణమూల్ శ్రేణులు మండిపడుతున్నారు. మమతా బెనర్జీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని పది రోజులు కాకముందే,సీబీఐ అరెస్టుల పర్వమేంటని దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి.

పాత స్టింగ్ తో కొత్త మలుపులు

ఇప్పుడు అరెస్టులకు కారణమైన ‘నారదా స్కామ్ ‘ ఇప్పటిది కాదు. ఏడేళ్ల నాటిది.2014లో నారదా న్యూస్ పోర్టల్ ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఒక డమ్మీ కంపెనీకి ప్రయోజనాలు చేకూర్చడం కోసం,తృణమూల్  నేతలకు లంచం ఎరవేసింది. లంచం తీసుకుంటూ వారందరూ కెమెరాకు చిక్కారు.

వారందరూ మంత్రులు, పార్టీలో కీలక నేతలు. వారితో పాటు ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు. ఫిర్షద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, మదన్ మిత్రా, సోవెన్ ఛటర్జీ మొదలైనవారు తృణమూల్ నేతలు. ఐపీఎస్ అధికారి పేరు ఎస్ ఎం హెచ్ మీర్జా.2016లో అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా ఈ వార్తలు ప్రసారమయ్యాయి.

న్యాయస్థానాల సూచనలతో 2017ఏప్రిల్ లో సీబీఐ వీరిపై కేసులు నమోదు చేసింది. వీరితో పాటు మరో 13మందిపైనా సీబిఐ కేసు పెట్టింది. నేడు,ఈ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చారు. సోమవారం నాడు ఇద్దరు మంత్రులు ఫిర్షాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అరెస్టు చేసింది.

ఉద్రిక్తతలకు దారితీసిన అరెస్టులు

వీరితో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన విధానం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, తనను కూడా అరెస్టు చేయండంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయం దగ్గర చాలా సేపు బైఠాయించారు.

తృణమూల్ నేతలు, మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కోల్ కతా లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తన అనుమతి లేకుండా మంత్రులను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పశ్చిమ బెంగాల్ స్పీకర్ అభ్యంతరాన్ని లేవనెత్తారు.

గవర్నర్ అనుమతితో ఈ అరెస్టులు జరగడం కూడా నేడు చర్చనీయాంశమైంది. మంత్రులపై విచారణకు గవర్నర్ ఆదేశించవచ్చంటూ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ ఉత్తర్వులు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నెల 7వ తేదీనాడు గవర్నర్ జగదీప్ ధన్ కడ్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

వన్ వే అరెస్టులు

లంచం తీసుకుంటూ దొరికిపోయినవారిపై కేసులు పెట్టడం,అరెస్టు చేయడంపై ఎవరూ అభ్యంతరం పెట్టరు. కాకపోతే,ఇదే కేసులో నిందితులుగా ఉన్న సువేందు అధికారి, ముకుల్ రాయ్ ని కూడా ఎందుకు అరెస్టు చేయలేదంటూ తృణమూల్ నేతలు వాదిస్తున్నారు. వీరిద్దరూ ఇటీవలే బిజెపిలో చేరి ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

సువేందు అధికారి బిజెపి తరపున పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, నందిగ్రామ్ లో మమతా బెనర్జీపై గెలిచిన వ్యక్తి కావడం గమనార్హం. మమతా బెనర్జీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వ్యక్తిగతంగా ఆమెపై అవినీతి ముద్రలేక పోయినా, తృణమూల్ నేతలపై ఆరోపణలు గట్టిగానే వున్నాయి.

నారదా న్యూస్ పోర్టల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ప్రబుద్ధులను ఎవ్వరూ సమ్మతించరు, మద్దతు పలుకరు. స్కామ్ లో నిందితులుగా ఉన్న అందరికీ ఒకే న్యాయం అమలుకాకపోవడంపైనే అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బిజెపి నేతలకు ఒక న్యాయం తృణమూల్ నేతలకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. నారదా స్కామ్ లో నిజానిజాలు న్యాయస్థానాల్లోనే తేలుతాయి. అవి తేలేసరికి ఏళ్లూపూళ్లూ పట్టవచ్చు. అది వేరే విషయం. స్పీకర్ అనుమతి లేకుండా, గవర్నర్ అనుమతితో రాష్ట్ర మంత్రులపై చర్యలు తీసుకోవచ్చా, అనే అంశాన్ని న్యాయమూర్తులే తేల్చాలి.

రావణ కాష్టంలా బెంగాల్ రాజకీయ దంగల్

పశ్చిమ బెంగాల్ లో అవినీతి, అక్రమాలు, అల్లర్లు ఎలా ఉన్నా, ప్రస్తుత పరిణామాలు బిజెపి – తృణమూల్ మధ్య మొదలైన మరో రాజకీయ యుద్ధంగానే పరిశీలకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో,ఈ యుద్ధం రాష్ట్రపతి పాలన దాకా వెళ్లినా ఆశ్చర్య పడనవసరంలేదు. మమతా బెనర్జీ నరేంద్రమోదీ మధ్య సాగుతున్న ఈ పోరు ఎటు తీసుకెళ్తుందో వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి తేలిపోతుంది.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

రోడ్డు ప్రమాదంలో సాక్షి రిపోర్టర్ మృతి

Satyam NEWS

మతి భ్రమించి మాట్లాడుతున్న రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

పేదింట్లో కల్యాణలక్ష్మి కాంతులు తెలంగాణ ప్రత్యేకం

Satyam NEWS

Leave a Comment