35.2 C
Hyderabad
April 24, 2024 11: 52 AM
Slider అనంతపురం

శరవేగంగా అనంతపురం అభివృద్ధి

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో అనంతపురం నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. బళ్లారి బైపాస్‌ నుంచి పంగల్‌ రోడ్డు వరకు జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు వంకర టింకరగా ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారని, వాళ్ల ఆలోచనలే వంకర టింకరగా ఉన్నాయని అన్నారు. బుధవారం ఉదయం నగరంలోని 10వ డివిజన్‌లో కార్పొరేటర్‌ లక్ష్మిదేవితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు వివరిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ అనంతపురం నియోజకవర్గంలో మూడున్నరేళ్లుగా సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు ఇతర ఏ నియోజకవర్గంలో జరగని విధంగా చేపట్టామన్నారు.

టీడీపీ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు కాలక్షేపం మాత్రమే చేశారని, ఐదేళ్లూ మాటలకే పరిమతం అయ్యారని విమర్శించారు. డ్రెయినేజీలు, కాలువల నిర్మాణం గురించి పట్టించుకోలేదని, మురికివాడలను పూర్తిగా విస్మరించారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాకే పనులు ముమ్మరం చేసినట్లు తెలిపారు. రూ.90 కోట్లతో తడకలేరు నుంచి గుత్తి రోడ్డులోని కనకదాస విగ్రహం వరకు రోడ్డు విస్తరణ పూర్తి చేశామన్నారు. తాను ఎంపీగా, ప్రస్తుత అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మునిసిపల్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలో ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్‌ మార్గ్‌ పనులు ప్రారంభిస్తే.. ఐదేళ్ల టీడీపీ హయాంలో కేవలం ‘ఎన్టీఆర్‌ మార్గ్‌’ పని పేరు మాత్రమే పెట్టుకున్నారని అన్నారు. పైగా రోడ్డు పనులు జరగకుండా మట్టిదిబ్బలు వేసిన చరిత్ర అప్పటి పాలకులదని విమర్శించారు. ప్రస్తుతం అనంతపురం నగరంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. కమలానగర్, రామచంద్రనగర్, 1, 2, 3వ రోడ్లు, ఆర్టీఓ ఆఫీస్‌ రోడ్డు, ఇంజనీరింగ్‌ కళాశాల రోడ్డు, హౌసింగ్‌ బోర్డు కాలనీ రోడ్లను తాము అధికారంలోకి వచ్చాకే వేశామని చెప్పారు.

బళ్లారి బైపాస్‌ నుంచి పంగల్‌ రోడ్డు వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు జరుగుతుంటే సాకులు పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు అధికారంలో ఉండగా చేయలేకపోయారని, తాము చేస్తుంటే అసూయతో వంకర టింకర అంటూ వక్రభాష్యాలు చెబుతున్నారన్నారు. కేవలం వాళ్ల ఆలోచనలు మాత్రమే వంకర టింకరగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అందరూ ఐకమత్యంగా ఉండి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని హితవు పలికారు.

సత్యం న్యూస్.అనంతపురం

Related posts

త్రిశంకు స్వర్గంలో శ్రీకాకుళం జిల్లా కే.జీ.బీ.వీ అధ్యాపకులు

Satyam NEWS

బడ్జెట్ డిమాండ్: బీసీల సంక్షేమానికి 7 వేల కోట్లు కావాలి

Satyam NEWS

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రాజీనామా చేసి వెళ్లిపోవాలి

Satyam NEWS

Leave a Comment