30.7 C
Hyderabad
April 16, 2024 23: 35 PM
Slider అనంతపురం

కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నోడల్‌ అధికారిపై ఎమ్మెల్యే అనంత ఆగ్రహం

MLAAnantapuram

కోవిడ్‌ బాధితులకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు. వారికి భోజనం, నీళ్లు కూడా అందుబాటులో ఉంచకపోతే ఎలా? అని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావును ప్రశ్నించారు.

చిన్నచిన్న లోపాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా వ్యవహరించొద్దని హెచ్చరించారు. నగరంలోని కోవిడ్‌ సూపర్‌స్పెషాలిటీని సోమవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మిక తనికీ చేశారు. నేరుగా ఐసీయూ, కోవిడ్‌ వార్డుల్లోకి వెళ్లి కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కొందరు అక్కడ తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే అనంత దృష్టికి తెచ్చారు. సమయానికి భోజనం అందడం లేదని చెప్పడంతో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే ఫోన్‌ చేయగా.. స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో ఎందుకు భోజనం ఆలస్యం చేస్తున్నారని డ్యూటీలో ఉన్న వైద్యులను ఎమ్మెల్యే అడిగారు.

రెండ్రోజులుగా సమస్య వస్తోందని చెప్పడంతో తక్షణం పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో కొందరు తాగడానికి నీరు కూడా ఉండడం లేదని చెప్పడంతో కోవిడ్‌ వార్డులో మంచినీళ్లు ఎందుకు పెట్టడం లేదని డాక్టర్లను ప్రశ్నించారు.

నీటి క్యాన్లు ఉన్నాయని చెప్పడంతో అక్కడే ఉన్న క్యాన్‌ను పరిశీలించగా అది ఖాళీగా ఉండడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో 24 మంది వరకు ఉంటే ఒక క్యాన్‌ (20 లీటర్లు) ఉంచడం ఏంటని ప్రశ్నించారు. పైగా అది ఖాళీగా ఉందని, కనీసం నీళ్లు ఉన్నాయో? లేదో? అని తెలుసుకోవద్దా? అని సిబ్బందిపై మండిపడ్డారు.

తక్షణం నీటిని అందుబాటులో ఉంచాలన్నారు. ఈ క్రమంలోనే కొందరు నర్సులు తమకు గ్లౌజులు లేవని చెప్పడంతో ఎమ్మెల్యే అనంత ఆరా తీశారు. వైద్య సిబ్బందికి కనీస రక్షణ కల్పించకపోతే ఎలాగని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు, డాక్టర్‌ శివకుమార్, డాక్టర్‌ సుబ్రమణ్యంను ప్రశ్నించారు.

ఏరోజుకారోజు ఇండెంట్‌ పెట్టడం కంటే మూడు, నాలుగు రోజులకు సరిపడా ఇంటెండ్‌ పెట్టుకోవాలని సూచించారు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

తన పరిశీలనలో గుర్తించిన అంశాలపై అక్కడి నుంచే కలెక్టర్‌ గంధం చంద్రుడుతో ఎమ్మెల్యే అనంత ఫోన్‌లో మాట్లాడారు. ఆస్పత్రిలో అటు కోవిడ్‌ బాధితులకు, ఇటు వైద్య సిబ్బందికి సమస్యలున్నాయని చెప్పారు. నోడల్‌ ఆఫీసర్‌ పత్తాలేడని చెప్పడంతో కలెక్టర్‌ చంద్రుడు.. డాక్టర్‌ రమేశ్‌రెడ్డిని టెలీ కాన్ఫరెన్స్‌లోకి తీసుకున్నారు.

ఆస్పత్రిలో పరిస్థితిపై చర్చించారు. ఈ క్రమంలో తాను అప్పటి వరకు ఆస్పత్రిలోనే ఉన్నట్లు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి చెప్పడంతో ఎమ్మెల్యే అనంత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గంట నుంచి ఆస్పత్రిలోనే ఉన్నానని, నోడల్‌ ఆఫీసర్‌గా నియమించిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఎలాగుందో పర్యవేక్షించకపోతే ఎలా? అని ప్రశ్నించారు.

మధ్యాహ్నం 1 గంట దాటినా భోజనం రాకపోవడం ఏంటని అన్నారు. ఇక్కడి పరిస్థితిని తీవ్రంగా తీసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌ నియంత్రణ, బాధితులకు వైద్య సదుపాయాల విషయంలో పూర్తి అధికారం కలెక్టర్లకు అప్పగించారని, విధుల్లో నిర్లక్ష్యం చేసే వారిని ఉపేక్షించొద్దని సూచించారు.

అదేవిధంగా కోవిడ్‌ బాధితులతో పాటే వారి బంధువులు ఉండడం, వారు కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడంపై ఎమ్మెల్యే అనంత ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఐసీయూ వార్డుల్లో వెళ్లేవారికైనా పీపీఈ కిట్లు ఇవ్వకపోతే ఎలా? అని ప్రశ్నించారు.

ఇంత నిర్లక్ష్యంగా ఉంటే కేసులు పెరగమంటే పెరగవా? అని అన్నారు. అసలు కోవిడ్‌ బాధితుల వద్దకు బంధువులను ఎందుకు పంపిస్తున్నారని, వైద్య సిబ్బందే అన్నీ చూసుకుంటారన్న విషయాన్ని వారికి తెలియజేసి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనంతరం సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో కోవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ సరఫరాపై ఆరా తీసి ప్లాంట్‌ను పరిశీలించారు.

మనోధైర్యమే బలం

సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలోని కోవిడ్‌ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అనంత.. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి మనోధైర్యమే బలమని, ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం కోవిడ్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

ఎక్కడ ఏ సమస్య ఉన్నా 104కు కాల్‌ చేయాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. వ్యాక్సినేషన్‌ పట్ల అపోహలు వీడి అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు.

Related posts

నాగర్ కర్నూల్ జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్

Satyam NEWS

రభస చేసి రాజీనామా చేసిన హీరో రాజశేఖర్

Satyam NEWS

Hypertensive Medicines

Bhavani

Leave a Comment