తిరుమలలో అనంత పద్మనాభ వ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా భాద్రపద శుక్ల చతుర్దశినాడు తిరుమలలో అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహించడం టీటీడీ ఆనవాయితీగా పాటిస్తోంది. ఉదయం ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువెళ్లి వరాహస్వామి ఆలయం చెంత వున్న స్వామి పుష్కరిణి ఒడ్డున పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం జరిపారు. అనంతరం చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీవారి పాదాల చెంత ఉంచిన వ్రతానికి సంబంధించిన ఎరుపు పట్టుదారాలను టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ధరించారు. ఈసందర్భంగా ఈఓ మాట్లాడుతూ మహావిష్ణువే అనంత కోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయనమూర్తిగా అనంత పద్మనాభ స్వామికి అంతే వైశిష్ట్యం ఉందన్నారు. ప్రతిఏటా 108 శ్రీవైష్ణవ దివ్య క్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తిరుమల ఈ దివ్య క్షేత్రాల్లో ప్రథమమైనదని, ఈ కారణంగానే తిరుమల ఆలయంలో అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహించామన్నారు. సర్వసాధారణంగా చక్రస్నాన మహా ఘట్టాన్ని తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి పర్వదినాల్లో నిర్వహిస్తారని, అలాగే అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా ఈ చక్రస్నానం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, వీజీఓ మనోహర్, పేష్కార్ లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
previous post
next post