ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో అధికారులతో జరిగిన ఈ సమావేశం లో తొలివిడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 హైస్కూళ్ల రూపురేఖలు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, నీళ్లు, ఫర్నిచర్, పెయింటింగ్స్, తరగతి గదులకు మరమ్మతులు, బ్లాక్‌బోర్డ్స్ ఏర్పాటు కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీటితోపాటు అదనపు తరగతి గదులనూ నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 98శాతం పాఠశాలలు అంటే 42,655 పాఠశాలల వీడియోలు, ఫొటోలు తీసిన విద్యాశాఖ దాదాపు 10.88 లక్షల ఫొటోలను అప్‌లోడ్ చేసింది. అన్ని సదుపాయాలూ కల్పించిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి ప్రజలముందు ఉంచాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారు. కొన్నిచోట్ల అన్ని తరగతులకూ ఒకే టీచర్ ఉన్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. దాంతో ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్ ఉండాలని సీఎం ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి నియామకాల కోసం క్యాలెండర్ సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.