గంటన్నర పాటు ప్రధానితో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించారు. ప్రధానితో ముఖ్యమంత్రి వైయస్ భేటీకి సంబంధించిన ముఖ్యాంశాలు:
1) వైయస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ఆహ్వానం– అక్టోబరు 15న నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న వైయస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభానికి హాజరు కావాల్సిందిగా ప్రధానిని కోరారు. పథకం ప్రారంభం రోజునే రాష్ట్రంలో కౌలు రైతులతో సహా మొత్తం 53 లక్షల మందికి లబ్ధి.
2) అదనపు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం విజ్ఞప్తి– కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.61,071.51 కోట్ల రూపాయలు అవసరమవుతాయని గత ప్రభుత్వం ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్లో పేర్కొంది. ఈ ఏడాది (2019–20)లో మా ప్రభుత్వం సమర్పించిన పూర్తి స్థాయి బడ్జెట్లో ఇదే విషయాన్ని చెప్పాం. కానీ ఇప్పటి వరకూ కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,739 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం వివిధ పనులు, బిల్లులకు సంబంధించి రూ.50 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టింది. సకాలంలో నిధులు విడుదల చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వీటికి అదనంగా మరో రూ.40 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
3) రెవెన్యూ లోటు – 2014–15లో రాష్ట్రాన్ని విభజించిన సమయంలో రెవిన్యూ లోటు రూ.22,948.76 కోట్లుగా కాగ్ అంచనా వేసింది. కానీ ఇప్పటి వరకూ రూ.3,979.50 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. ఇంకా రూ.18,969.26 కోట్లు రావాల్సి ఉంది. రెవెన్యూ లోటు కింద ఇవ్వాల్సిన రూ.18,969.26 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం.
4) పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాలు ఆమోదించాలి– పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలి. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులు రూ.5,103 కోట్లను ప్రాజెక్టుకోసం ఖర్చు చేసింది ఆ నిధులను తక్షణమే రీయింబర్స్ చేయాల్సి ఉంది. ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి మరో రూ.16 వేల కోట్లు విడుదల చేయాలని కోరుతున్నాం. ప్రాజెక్టు కోసం ఇంకా భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మొత్తం రూ. 55,548 కోట్లు ఆమోదించాలని కోరుతున్నాం. ఇందులో భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకే దాదాపు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుంది.
5) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి– వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని బుందేల్‌ఖండ్, కలహండి తరహాలో ప్రకటించారు. జిల్లాలు, వాటి ఖర్చు ప్రాతిపదికన ఈ ప్యాకేజీని రూపొందించారు. ఆ మేరకు యూపీలోని బుందేల్‌ఖండ్, కలహండిలో తలసరి రూ.4 వేలు కేటాయించారు. ఏపీలో మాత్రం ఆ మొత్తం కేవలం రూ.400 మాత్రమే. అందుకనే ఈ ప్యాకేజీ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడ్డ జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున ఈ 6 ఏళ్లలో రూ.2100 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ రూ.1050 కోట్లు మాత్రమే వచ్చాయి.
6) కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం- కృష్ణా డెల్టా తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. కృష్ణా జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లో సాగు నీటిని స్థిరీకరించాల్సి ఉంది. రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా సాగు, తాగు నీటి వనరైన శ్రీశైలం రిజర్వాయర్ కు నీటి సరఫరా గత 52 ఏళ్లుగా చూస్తే 1230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయింది. మరోవైపు గత 30 ఏళ్లుగా ఏటా సగటున ధవళేశ్వరం వద్ద 2780 టీఎంసీల గోదావరి వరద జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. గోదావరి నీటిని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించడం ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించడంతోపాటు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు సాగు నీరు సమృద్ధిగా లభించి, ఆర్థికంగా ఆ ప్రాంతం పురోగమించడానికి దోహదపడుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేలుమలుపు తిప్పే గొప్ప ప్రాజెక్టు. ఈ దిశగా సంబంధిత మంత్రులకు తగిన ఆదేశాలు జారీ చేయాలి.
7) రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులకు ఆర్థిక సాయం– ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్, రామాయపట్నం పోర్టులను కేంద్రం నిర్మించాల్సి ఉంది. విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియ్ కారిడార్, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌కూ తగిన రీతిలో నిధులు కావాలి.
8) నవరత్నాలుకు చేయూతనివ్వండి– రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాలు (పథకాలు) రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. జాతీయస్థాయిలో అమలు చేయదగ్గవి కాబట్టి, రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించాలని కోరుతున్నాం.
9) ప్రత్యేక హోదా ఇవ్వాలి– ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి