ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో వ్యంగ్యంగా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘మన్ను కూడా కదలదు’ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూడా. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తెలివితక్కువ పని అని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నిపుణుల కమిటీని నియమించారు కదా అని కేసీఆర్ ను ఒక విలేకరి ప్రశ్నించగా ‘మన్ను కూడా కదలదు’ ఇలాంటివి చాలా చూశాం అంటూ ఆయన తూలనాడారు. అయితే ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈ అంశంపై స్పష్టంగా ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. విలీనంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యతో పట్టుదల, కసి మరింత పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ ఆర్టీసీ ఆస్పత్రిలో కేశినేని నాని ఎంపీ నిధులతో నిర్మించిన వసతి భవనాన్ని పేర్నినాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.