32.2 C
Hyderabad
April 20, 2024 19: 02 PM
Slider సంపాదకీయం

కన్నా లక్ష్మీనారాయణకు మళ్లీ మహర్దశ?

#Kanna Laxminarayana

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా పని చేసిన కన్నా లక్ష్మీనారాయణకు మళ్లీ మహర్దశ పట్టబోతున్నది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి ఏ మాత్రం పట్టులేకపోయినా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ సమర్ధంగా పని చేశారని పేరు ఉన్నది.

అయితే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో కేంద్ర కమిటీ ఇచ్చిన నిధులను ఆయన దుర్వినియోగపరిచారని వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ బిజెపిలో సమర్ధుడైన నాయకుడుగా ఎదగడం ఇష్టంలేని కొందరు బిజెపి ‘‘పాత’’ నేతలు ఆయనపై కక్షగట్టారు.

విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలను తమ ఆరోపణలుగా చేసుకుని లక్ష్మీనారాయణ ప్రతిష్ట పూర్తిగా దిగజారేలా వ్యవహరించారు. విజయసాయి రెడ్డి రాజకీయ కారణాలతో ఆరోపణలు చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోయి తమకు అనుకూలంగా మలచుకుని కన్నా ను పార్టీ పదవి నుంచి అవమానకరంగా తొలగించేలా ప్రవర్తించారు.

వైసీపీపై ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్న కన్నాపై అసూయతో బిజెపి నేతలే చేసిన కుట్రతో ఆయన వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత సోము వీర్రాజును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా బిజెపి అధిష్టానం నియమించింది.

సోము వీర్రాజు నేతృత్వంలో బిజెపి కనీస పోటీని కూడా ఇవ్వలేని హీన స్థితికి దిగజారిపోయింది. జనసేన లాంటి జనాకర్షణ ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా ఎక్కడా ప్రభావం చూపని స్థితికి బిజెపి పడిపోయింది. ఈ కారణంగా జనసేన పార్టీలో కూడా బిజెపితో పొత్తు పట్ల లుకలుకలు బయటపడ్డాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా బిజెపి పూర్తిగా తేలిపోయింది. నామమాత్రపు ఓట్లతో జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్నది.

పటిష్టమైన నాయకుడు ఉన్న కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో తప్ప మరెక్కడా బిజెపి స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ మాత్రం ప్రభావం చూపలేదు సరికదా డిపాజిట్లు కూడా కోల్పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీకి లభించిన ప్రాతినిధ్యంలో కనీసం సగం కూడా బిజెపి దక్కించుకోలేకపోయింది.

కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కాలంలో గ్రామ కమిటీలు కూడా నియమించుకునేంత బలం పుంజుకున్న బిజెపి ఇప్పుడు మళ్లీ వార్డు సభ్యులను కూడా గెలిపించుకోలేదని దారుణ స్థితికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో తాము తీసుకున్న తప్పు నిర్ణయాన్ని సరిదిద్దుకోవడానికి బిజెపి అధిష్టాన వర్గం యోచిస్తున్నది.

బిజెపి అధిష్టానం ఇటీవల ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ నుంచి పార్టీ పరిస్థితిపై రహస్య నివేదిక తెప్పించుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోకి తీసుకువచ్చిన నేతలే ఆయనకు ఎలా వెన్నుపోటు పొడిచారనే విషయం కూడా అధిష్టానానికి ఆలశ్యంగా తెలిసింది.

దానికితోడు పార్టీ అధిష్టానానికి నిజాలు చెప్పాల్సిన ఇన్ చార్జి కూడా తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగానే అధిష్టానానికి రహస్య నివేదిక చేరింది. దాంతో పై నుంచి ప్రక్షాళన చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి పరువు దక్కదనే విషయం అర్ధం అయింది.

వైసీపీ తో అంటకాగుతూ, పార్టీనే కుళ్లబొడుస్తున్న నాయకులను కూడా పార్టీ అధిష్టానం గుర్తించింది. ఇప్పటికే అలాంటి ముగ్గురు నాయకులను పిలిచి అధిష్టానవర్గం హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పటికే ‘‘ఆ ముగ్గురు’’ తమ పంథాను మార్చుకుని వైసిపిని విమర్శించడం మొదలు పెట్టారు.

వైసీపీ చేస్తున్న అరాచకాలపై ప్రెస్ మీట్ పెట్టాల్సిందిగా కన్నా లక్ష్మీనారాయణకు కేంద్ర కమిటీ నుంచి ఆదేశాలు రావడంతో ఆయన రెండు మూడు అంశాలపై నేరుగా స్పందించారు. ఈ నేపథ్యంలో మళ్లీ కన్నా లక్ష్మీనారాయణకు మహర్దశ పట్టబోతున్నట్లు తెలిసింది.

Related posts

చైనా బుద్ధి వంకర: ఎంతకీ మారని నైజం

Satyam NEWS

షాపుల ఎదుటే వంట వార్పు చేసి నమాజు తో నిరసన వ్యక్తం చేసిన ముస్లింలు

Satyam NEWS

నిద్ర పోతున్న జగన్ రెడ్డిని మేల్కొల్పుదాం రండి

Satyam NEWS

Leave a Comment