28.7 C
Hyderabad
April 20, 2024 08: 33 AM
Slider ప్రత్యేకం

‘‘జగనన్న క్యాంటిన్’’ అని పేరు పెట్టుకుని అన్న క్యాంటిన్లను తెరవండి

#RRR letter

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన అన్న క్యాంటిన్లను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మూసేయించారు. మంత్రి బొత్సా సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న క్యాంటిన్లను తెరుస్తామని చెబుతున్నారు కానీ అది ఆచరణలోకి రావడం లేదు.

ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు జగన్ ఆలోచనలకు తగిన సూచన చేస్తూ ఒక లేఖ రాశారు. ‘‘జగనన్న క్యాంటిన్’’ అనే పేరుతో క్యాంటిన్లు తెరిచి పేదలకు 5 రూపాయలకే అన్నం పెడితే మీరు ‘‘దైవ దూత’’ అవుతారని రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్ కు సలహా ఇచ్చారు. ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం:

ముఖ్యమంత్రి గారూ,

‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’’ అని దాదాపు అన్ని పవిత్ర గ్రంధాలలో చెబుతుంటారు. ఆహారం అనేది పరమాత్మ స్వరూపం. అందుకే ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం అందించడం అనేది ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎంతో అవసరమైనది. ఈ లేఖ ద్వారా ఇదే విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను.

అన్నదానం అనేది అన్ని దానాల్లోకెల్లా మిన్న అనే నానుడి కూడా మనం చిన్నతనం లోనే నేర్చుకున్నాం. అన్నదానం చేయడం అనేది కేవలం దాన్ని స్వీకరించే వారికే కాకుండా ఇచ్చేవారికి కూడా సంతృప్తి కలిగిస్తుంది. అన్నదానం చేయడం ద్వారా భౌతికమైన ప్రయోజనాలే కాకుండా మానసికంగా కూడా ప్రశాంతత చేకూరుస్తుంది. మానవుల పట్ల ప్రేమ అభిమానాలను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక భావనలు పెంపొందించి మన ఆలోచనా సరళినే సక్రమ మార్గంలోకి తెస్తుంది. అన్నదానం ద్వారా మీకు మంచి పేరు రావడమే కాకుండా మీరు ‘దైవదూత’ అనేది కూడా జన బాహుళ్యంలో స్థిరపడిపోతుంది. అందుకే మీరు తక్షణమే జగనన్న క్యాంటిన్ స్కీమ్ ప్రారంభించాలని సూచిస్తున్నాను.

గతంలో ఈ స్కీమ్ ద్వారా ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించేవారు. మూడు విడతలుగా అందించే ఈ ఆహారం కేవలం రూ.15 కే పేదవారికి అందేది. ఈ స్కీమ్ లేకపోతే ఇదే మూడుపూటల ఆహారం కనీసం రూ.150 అయ్యేది. ప్రభుత్వానికి ఈ మూడు విడతల ఆహారానికి కలిపి రూ. 58 ఖర్చు అయ్యేది. దీనిద్వారా ప్రతి సారీ ఒక్కో క్యాంటిన్ లో 900 నుంచి 1200 వరకూ ఆకలి తీర్చుకునేవారు. ఇలా అన్ని క్యాంటిన్లలో కలిపితే సుమారు 2.15 లక్షల మందికి ప్రతి సారి ఆకలి తీరుతూ ఉండేది. ఈ స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించడమే కాకుండా దాతల నుంచి విరాళాలు కూడా సేకరించి మొత్తం 35 పట్టణాలలో 100 అన్నా క్యాంటిన్లు, 75 పట్టణ ప్రాంతాలలో 103 అన్న క్యాంటిన్లు, మొత్తం 73 మునిసిపాలిటీలలో 204 అన్న క్యాంటిన్లను ప్రారంభించారు.

అన్న క్యాంటిన్లకు చంద్రబాబు 200 కోట్లు ఇచ్చారు మీరు వెయ్యి కోట్లు ఇవ్వండి

దాన్ని తలదన్నే విధంగా మీరు రూ.వెయ్యి కోట్లతో జగనన్న క్యాంటిన్లను ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం 13 జిల్లాలను మూడు జోన్లుగా విభజించి 204 అన్న క్యాంటిన్లను ప్రారంభించింది. ఈ క్యాంటిన్లను నిర్వహించే అక్షయ పాత్ర వారికి ఆర్డరు క్రమంగా తగ్గిస్తూ ప్రభుత్వం పూర్తిగా వాటిని మూసివేసింది. ఒక్కో జోన్ లో అన్న క్యాంటిన్ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సుమారు రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లుగా నాకు తెలిసింది. ఈ నిధులతో ప్లేట్లు, గ్లాసులు, వాటర్ ఫిల్టర్లు లాంటివి కూడా కొనుగోలు చేశారు. అదే విధంగా ప్రభుత్వం కూడా ఒక్కో భవనానికి రూ.35 లక్షలు ఖర్చు చేసి భవనాలు నిర్మించింది. ఆ భవనాలలో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ భవనంలోకి వచ్చి ఆహారం స్వీకరించే ప్రతి వ్యక్తి వేలిముద్రలను తీసుకునేందుకు ఏర్పాట్లు ఉండేవి. వారి కనుపాపల చిత్రాలను కూడా సేకరించి నిక్షిప్తం చేశారు. ఫేస్ రికగ్నిషన్ సదుపాయం కూడా ఏర్పాటు చేసి అవకతవకలు జరగకుండా ప్రతి భవనంలో ఏర్పాటు చేశారు.

కరోనా విజృంభించిన వేళ ప్రభుత్వం నిత్యావసర వస్తువులను సరఫరా చేసింది. అదే విధంగా నెలవారీ ఆర్ధిక సహాయం కూడా అందించింది. అయితే ఈ చర్యలు ఏవీ కూడా నిరాశ్రయులను ఆదుకోలేకపోయాయి. తమిళనాడులో అమ్మ క్యాంటిన్లు, కర్నాటకలో ఇందిరా క్యాంటిన్లు, తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటిన్లు ఇలాంటి వారికి గుణాత్మకమైన సేవలు అందిస్తుండగా మీ పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నిరాశ్రయులను గాలికి వదిలేశారు. లాక్ డౌన్ సమయంలో ఇల్లు కూడా లేని కడు నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దుర్భర పేదరికంలో ఉన్నవారిని కరోనా లాక్ డౌన్ సమయంలోనే కాకుండా అన్ని వేళలా కాపాడాల్సిన అవసరం ఉంది.

చెబుతున్నారు కానీ క్యాంటిన్లను తెరవడం లేదు

మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మునిసిపల్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక మాట చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం కాంట్రాక్టర్లు మార్చేందుకు తాత్కాలికంగా అన్న క్యాంటిన్లను మూసివేస్తున్నామని, తర్వాత వాటిని పునరుద్ధరిస్తామని సెలవిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకూ వాటిని పునరుద్ధరించలేదు. ఇదే విషయాన్ని మన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రజావ్యవహారాల సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. త్వరలో క్యాంటిన్లను తెరుస్తామని ఆయన చెప్పిన మాటలు కూడా ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఈ క్యాంటిన్ల ‘రంగు’ ‘పేరు’ మార్చి ఎప్పుడు తెరుస్తారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విరాళాలు సేకరించే అవకాశం ఉంది. ఎంతో మంది తమ సంతోషం కోసం చేసుకునే వ్యక్తిగత ఆడంబరాలు, కార్యక్రమాలకు వెచ్చించే సొమ్మును ఈ పవిత్ర కార్యానికి విరాళాలు ఇవ్వాలని కోరవచ్చు కూడా. దీని వల్ల ఆడంబరం గా పుట్టిన రోజులు, పెళ్లి రోజులు జరుపుకునే వారు ఆ సొమ్మును విరాళంగా ఇచ్చి ఈ పథకాన్ని కొనసాగించేందుకు తమ వంతు సాయం అందించేందుకు అవకాశం ఉంది. వారి వారి పుట్టిన రోజులు, పెళ్లి రోజులకు గుర్తుగా విరాళాలు కూడా అందించేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉంటారు. మూడు జోన్లు లేదా జిల్లాలు, మండలాల వారీగా ఇలా సేకరించిన విరాళాలు ఈ పధకం కోసం ఖర్చు చేయవచ్చు. సాటి మనిషి ఆకలి తీర్చడం కన్నా పరమాత్ముడి సేవ ఇంకేముంటుంది?

అక్షయ పాత్ర సంస్థ నిజంగా అక్షయ పాత్రే

ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన అక్షయ పాత్ర సంస్థ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రభుత్వం తరపున అందచేస్తూ ఉన్నది. విశాఖపట్నం, కాకినాడ, మంగళగిరి, నెల్లూరు లో అక్షయ పాత్ర వంటశాలలు కూడా ఏర్పాటు చేసింది. మొత్తం 370 స్కూళ్లలో 74409 మంది విద్యార్ధులకు 2008 నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తున్నది.

మిలియన్ మీల్స్ పథకం కింద వారు అత్యాధునిక సాంకేతికతతో ఈ పని సమర్ధంగా నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సును ఉపయోగించి నిర్వహణా సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచుకుని సరైన సమయంలో సరైన ఆహారాన్ని చిత్తశుద్ధితో పరిశుభ్రంగా అందించేందుకు అక్షయ పాత్ర పెట్టింది పేరు. ఈ పథకానికి వారి సేవలు వినియోగించుకుంటే,  వారిని భాగస్వామిగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

అత్యంత కష్టమైన పనులే చేస్తున్నారు ఇది చేయలేరా….?

అనాథలను, అభాగ్యులను, అంగవికలురను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ఎలా భావిస్తారో అలానే నిరుపేదల ఆకలి తీర్చడం కూడా ప్రధానమైన అంశంగా మీరు గుర్తించాలని కోరుతున్నాను. పేదవారి ఆకలి తీర్చడం ద్వారా మానవత్వం ప్రదర్శించేందుకు ఇది వేదిక అవుతుంది కూడా. మీ సమర్ధ నాయకత్వం, మీరు అత్యంత కష్టమైన, దాదాపు అసాధ్యమైన విషయాలను కూడా ఒక ఛాలెంజ్ గా స్వీకరించే మనస్తత్వం అర్ధం చేసుకున్నవాడిగా నేను ఈ స్కీమ్ ను తక్షణమే అమలు చేయాల్సిందిగా కోరుతున్నాను.

ఇలా జులై 8న ఈ కార్యక్రమాన్ని పున: ప్రారంభించడం ద్వారా మనం అందరి ఆదర్శ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి కార్యక్రమాలకు సార్ధకత చేకూర్చ వచ్చు. మన ప్రియతమ నాయకుడు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనునిత్యం ఒక విషయం చెప్పేవారు. ఏపి అంటే అన్న పూర్ణ (ఆకలితీర్చే తల్లి), ఏపి అంటే అక్షయ పాత్ర(ఎన్నిటికి తరగనిది) గా ఉండాలనేది ఆ మహానేత ఆశయం. ఆయన జయంతి కార్యక్రమం సందర్భంగా మీరు జగనన్న క్యాంటిన్ లేదా రాజన్న క్యాంటిన్ పేరుతో ఈ స్కీమ్ ను మళ్లీ ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

భవదీయుడు

కె.రఘురామకృష్ణంరాజు

Related posts

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై త్వరలో వేటు?

Satyam NEWS

చట్టసభల నిర్వహణ కత్తిమీద సాము

Satyam NEWS

18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్‌ డోసు

Sub Editor 2

Leave a Comment