28.7 C
Hyderabad
April 25, 2024 04: 10 AM
Slider ముఖ్యంశాలు

వీరవిధేయుడిని ఆ పోస్టులో ఎలా నియమిస్తారు?

#raghurama

పోలీసుల పనితీరుపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాల్సిన అత్యంత సంక్లిష్టమైన రాజ్యాంగ పోస్టులో అత్యంత విధేయుడిని, వయసుమీరిన వ్యక్తిని నియమించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసులపై ఇప్పటికే పలురకాల ఫిర్యాదులు ఉండటం, పోలీసుల వివాదాస్పద పనితీరు ఉన్న సందర్భంలో అత్యంత విధేయుడిని ఏపి పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ చైర్మన్ గా నియమించడం తీవ్రమైన విషయమని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖ పూర్తి పాఠం ఇది:

ముఖ్యమంత్రి గారూ,

పోలీసులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఉండాలని 1979లో వచ్చిన తొలి జాతీయ పోలీస్ కమిషన్ నివేదిక స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత 1998లో వచ్చిన రెబిరో కమిటీ కూడా ఇదే విషయాన్ని మరింత విపులంగా చెప్పింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన పద్మనాభయ్య కమిటీ నివేదిక, 2006లో సోరాబ్జీ నేతృత్వంలోని పోలీసు చట్టం సిఫార్సు కమిటీ కూడా పోలీసులపై వచ్చే ఫిర్యాదులు పరిశీలించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఉండాలని స్పష్టం చేశాయి.

దేశంలో పోలీసు వ్యవస్థ పనితీరును మెరుగు పరిచేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే ఏడు సార్లు రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశ పత్రాలు జారీ చేసింది. పోలీసు వ్యవస్థ ను సంస్కరించేందుకు సూచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా వివిధ సందర్భాలలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలలో ఆరోది అన్ని రాష్ట్రాలలో పోలీసు కంప్లయింట్స్ అథారిటీ (పిసిఏ) లను ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రత్యేకంగా జారీ చేసినది.

ఈ నేపథ్యంలో రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ వి కనగరాజ్ ను పిసిఏ చైర్మన్ గా నియమిస్తూ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేయడానికే నేను ఈ లేఖ రాస్తున్నాను.

నేను ఆందోళన ఎందుకు చెందుతున్నానో మరింత స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. పోలీసు కంప్లయింట్స్ అథారిటీ (పరిపాలన మరియు విధి విధానాలు) 2020 కు నిబంధనలు రూపొందించేందుకు విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం 125లో పేర్కొన్న అంశాలను ముందుగా పరిశీలించాలని కోరుతున్నాను.

పోలీసు కంప్లయింట్స్ అథారిటీ చైర్ పర్సన్ ఆ స్థానంలోకి వచ్చే వ్యక్తి ఆ పదవి స్వీకరించిన నాటి నుంచి మూడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకూ, ఏది ముందు అయితే ఆ పదవీకాలం వర్తిస్తుందని నిబంధనల్లో పేర్కొన్నారు. అంటే 65 సంవత్సరాల కన్నా తక్కువ వయసు వారు మాత్రమే ఈ పదవికి అర్హులు. అయితే జస్టిస్ వి కనగరాజ్ ను ఈ పోస్టులో నియమించేందుకు వీలుగా దీనికి ప్రతిబంధకంగా ఉన్న నిబంధన 4(ఏ) ను సవరించారు.

పరిమిత వయసును ఎప్పుడో దాటేసిన రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను ఈ స్థానంలో నియమించాలని ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఈ సడలింపు తీసుకువచ్చారనేది నిర్వివాదాంశం.

ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని మళ్లీ గుర్తు చేయాలని అనుకుంటున్నాను. జస్టిస్ కనగరాజ్ ను 2020 ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించగా ఒక నెల రోజుల లోపునే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంబంధిత ఆదేశాలను రాష్ట్ర హైకోర్టు కొట్టేసి మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్ నియమించిన విషయం మీకు గుర్తు ఉండే వుంటుంది.

రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్ధించిన విషయం కూడా మీకు గుర్తు ఉండే వుంటుంది. నెల రోజుల్లోనే పదవీచ్యుతుడైన జస్టిస్ కనగరాజ్ ఆ రోజు నుంచి అంటే.. దాదాపు ఏడాది కాలంగా మీతో, మీ బృందంలో కలిసి ఉన్నాడనే విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకునే మీరు జస్టిస్ కనగరాజ్ కు ఈ పదవి ఇచ్చి పునరావాసం కల్పించారు. కనుసైగతో నిబంధనలు మార్చి తన నియామకానికి రూటు వేసిన వ్యక్తికి వీరవిధేయుడుగా ఆయన ఉండడు అని ఎవరైనా అనుకుంటే అది సత్యదూరమే అవుతుంది.

భారతీయుల ఆయు: ప్రమాణం 69 సంవత్సరాలు కాగా ఎప్పుడో దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు అంటే 1936లో పుట్టిన (వికిపీడియా సమాచారం) జస్టిస్ కనగరాజ్ 85 ఏళ్ల వయసులో తన భుసస్కంధాలపై ఇంత బరువు బాధ్యతలు మోయగలరని ఎవరూ అనుకోలేరు.

అదీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్రమైన ఆక్షేపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆ ఫిర్యాదులన్నింటిని ఈ వయోవృద్ధుడు పరిశీలించి, ఫిర్యాదుదారులకు తగిన న్యాయం సత్వరంగా, అత్యంత వేగంగా చేస్తారని ఊహించడం కూడా కష్టమే. నియమ నిబంధనలు రూపొందించిన వారు శారీరక సామర్ధ్యాన్ని అంచనావేసే వయోపరిమితిని నిర్ణయించారనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఏదో ఒకటో రెండో సంవత్సరాలు పెద్దవారైనా లేదా కొత్తగా పదవి విరమణ చేసిన వారైనా సర్దుకోవచ్చు కానీ ఏకంగా నియమిత వయో పరిమితి దాటి 20 సంవత్సరాలు అయిన వ్యక్తిని నియమించడం ఎట్టిపరిస్థితుల్లో అమోదయోగ్యం కాదని చెప్పకతప్పదు. అసలైనా ఇంత మేరకు వయోపరిమితిని పెంచాలంటే అసెంబ్లీ ఆమోదమైనా ఉండాలి లేదా ఆర్డినెన్సు ద్వారా అయినా జరగాలి.

ఆయనలో అత్యద్భుతమైన న్యాయశాస్త్ర సంబంధిత ప్రతిభ దాగి ఉన్నదని మీరు భావిస్తే ఆయనను మీరు మీ న్యాయ సలహాదారుడుగా నియమించుకోవచ్చు. వివిధ స్థాయిలలో పెండింగ్ లో ఉన్న వందలాది కేసులను మీరు పరిష్కరించుకోవచ్చు. అంతే తప్ప ఇలాంటి చట్టబద్ధమైన పోస్టులో అంత వయసు రాయితీ ఇచ్చి ఆయనను నియమించడం తగని పని. దీన్ని సాధారణ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో హర్షించరు.

ఏపి స్టేట్ పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ అనేది లాకప్ లో జరిగే హింస, మరణాలు, అత్యాచారం లాంటి ఎంతో తీవ్రమైన నేరాలకు సంబంధించి పోలీసులపై వచ్చే ఆరోపణలను పరిశీలించే ఉన్నతస్థాయి సంస్థ. ఇలాంటి అత్యున్నత సంస్థ ను ఏర్పాటు చేయాలని గత 15 సంవత్సరాలుగా వివిధ సందర్భాలలో న్యాయస్థానాలు చెబుతూ వచ్చాయి. చివరకు తమ ఆదేశాలను ఖాతరు చేయని రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులను తమంతట తాము (సుమోటో) గా కేసు స్వీకరించి హైకోర్టు సీరియస్ గా తీసుకుంటే తప్ప ఈ నిబంధన అమలు చేయలేదు.

పిసిఏ లో లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులను చేర్చుకునే అంశంలో హైకోర్టు చేసిన సవరణలు సంబంధిత వ్యక్తుల ఆశలను కొద్ది మేరకు నీరుగార్చాయని వారు భావించి నిరాశకు గురయ్యారు. ఈ దశలో మీరు ఏకపక్షంగా చేసిన ఈ వయోపరిమితి వారిని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుందనడంలో సందేహం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు చేస్తున్నఅకృత్యాలను ప్రశ్నించే వ్యవస్థ ఉండాలనే అంశంపై సుదీర్ఘ పోరాటం జరిగింది. ఎస్ సి ఎస్ టిలపైనే ఎస్ సి, ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు పెట్టడం, చట్ట సభలో సభ్యుడుగా ఉండి చట్టాలు చేసే నన్నే లాకప్ లో చిత్ర హింసలకు గురిచేయడం లాంటి పనులను ఏపి పోలీసులు యథేచ్ఛగా చేసేస్తున్నారు.

ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. పోలీసులు తమ విస్తృత అధికారాలను విచ్చలవిడిగా వినియోగిస్తూ ఇలాంటి ఎన్నో అత్యాచారాలను సామాన్య ప్రజలపై చేస్తున్నారు. మానవ హక్కులపై ఇలా పోలీసులు చేస్తున్న విచక్షణారహిత దాడులపై కేవలం 27.7 శాతం మాత్రమే కేసులు పరిశోధన స్థాయి వరకూ వస్తున్నాయని మానవహక్కుల సంఘాలు చేసిన ఒక పరిశీలనలో వెల్లడి అయింది.

ఇలా పరిశోధన స్థాయి వరకూ వచ్చిన కేసులలో కేవలం 20 శాతం మాత్రమే విచారణ స్థాయి వరకూ వస్తున్నాయని కూడా వారు వెల్లడించారు. విచారణ స్థాయికి వచ్చిన 20 శాతం కేసుల్లో కూడా కేవలం మూడు శాతం మాత్రమే శిక్షలు పడుతున్నాయి.

పోలీసు కంప్లయింట్స్ అథారిటీలు ప్రస్తుతం కోరల్లేని పాముల్లా ఉంటున్నాయనేది ప్రజాభిప్రాయం. పలుచనైపోయిన అధికారాలతో కేవలం అధికారంలో ఉన్నవారి ఆలోచనలకు అనుగుణంగా పని చేసే కీ ఇచ్చే యంత్రాలుగా ఉండిపోతున్నాయనేది కూడా మెజారిటీ ప్రజల అభిప్రాయం. చాలా సందర్భాలలో న్యాయం జరగడంలో విపరీతమైన జాప్యం కారణంగా ప్రజలకు ఇలాంటి వ్యవస్థలపైనే నమ్మకం పోతున్నది.

ప్రజలలో మీ ఇమేజ్ పలుచన కాకూడదని భావించే నాలాంటి వ్యక్తులు మాత్రమే ఇంత నిష్కర్షగా మీకు అభిప్రాయం చెప్పగలరు. అందువల్ల మీరు ఇలాంటి చౌకబారు పనులకు దిగకుండా, మళ్లీ న్యాయపరమైన చిక్కుల్లోకి ఇలాంటి సంస్థలను నెట్టకుండా మీరు వివేచనతో ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను.

ఇలాంటి అసంబద్ధమైన నిర్ణయాలను కోర్టులు తమత తామే తీసుకునే అవకాశాన్ని గానీ, మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులు సవాల్ చేసే వీలును కానీ కల్పించకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకుంటారని, అది గౌరవప్రదమైన నిర్ణయంగా ఉంటుందని ఆశిస్తున్నాను.

భవదీయుడు

కె.రఘురామకృష్ణంరాజు

Related posts

పోలింగ్ సందర్భంగా పోలీసులు ఓదార్యం…!

Satyam NEWS

శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచడం వల్ల కరోనా వైరస్ దరిచేరదు

Satyam NEWS

ఆదిమూలం నిర్ణయంతో షాక్ లో వైసీపీ నేతలు

Satyam NEWS

Leave a Comment