వైఎస్ఆర్ సీపీ విషయంలో అందరూ ఊహించిందే జరుగుతోంది. ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి అడ్డగోలుగా సిట్టింగ్‌లను మార్చిన సంగతి తెలిసిందే. జగన్ వల్ల నొచ్చుకున్న ఎంతోమంది ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మొన్నటిమొన్న గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మద్దాలి గిరి గెలిచి.. తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రస్తుతం వైసీపీ గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న రెండు రోజుల క్రితమే ఆయన పార్టీని వీడారు. తాజాగా అదే గుంటూరు జిల్లాలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై రోశయ్య తీవ్రమైన విమర్శలు చేశారు. వైసీపీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోందని.. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు.
గుంటూరు నుంచి తనను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారన.. కొందరు మానసికంగా కుంగదీశారని వాపోయారు. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్టాలతోనే పార్టీని నడుపుతున్నారని.. ఇక తాను వైసీపీలో కొనసాగలేనని తేల్చి చెప్పేశారు. పార్టీకి మోసం చేసిన కొందరు వ్యక్తులకు పిలిచి మరీ పట్టం కట్టారని రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపులను చేరదీసిన వాళ్లు.. ఇవాళ పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని.. అయినా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వాపోయారు.
అటు తన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఎంతో అనుభవం ఉన్నా కూడా మరో వ్యక్తికి మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి ఇచ్చారని రోశయ్య అన్నారు. అయితే, మొన్న గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి పార్టీకి రాజీనామా చేయగా.. ఇప్పుడు కిలారి రోశయ్య పార్టీని వీడడం చర్చనీయాంశం అయింది. రోశయ్య జనసేన పార్టీలోకి వెళతారని అంటున్నారు.
ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వేళ.. ఇక్కడ పార్టీ నేతలు చేజారిపోతున్నారు. మరోవైపు, ఢిల్లీలో జగన్ ధర్నాకు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా హాజరు కాని సంగతి తెలిసిందే. దీంతో వారు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.