అమరావతి పేరే వినిపించకుండా అత్యంత కటువుగా ఏపి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఉన్న ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును ఆకస్మికంగా తొలగించారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ని రాజధానిగా ప్రకటించిన అనంతరం ఈ బోర్డును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆదివారం నాడు ఆ బోర్డును ఏపీ భవన్ సిబ్బంది తొలగించారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో బోర్డును తొలగించడం గమనార్హం.
కోతుల బెడదతో తొలగించామని అధికారులు చెబుతున్నారు. కోతుల బెడద వల్ల తొలగించడం ఏమిటని ఢిల్లీలోని ఏపీ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇంతలోనే ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘ఐ లవ్ అమరావతి’ బోర్డు సెల్ఫీ స్పాట్‌కు వేదికగా ఉండేదని నెటిజన్లు చెబుతున్నారు. దీంతో అధికారుల చర్యను వారు తప్పుబడుతున్నారు. తిరిగి అక్కడే బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానిని తరలించానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న సందర్భంలో బోర్డు తొలగింపు మరింత ఆజ్యం పోసినట్లు అయింది.