28.7 C
Hyderabad
April 20, 2024 08: 04 AM
Slider సంపాదకీయం

ఏపీ బీజేపీ: ఇది రెండు నాలుకల పార్టీ

#BJP AP

సాధారణంగా ఒక పార్టీకి ఏ అంశం పైన అయినా ఒకటే విధానం ఉండాలి. కానీ అదేంటో ఏపీలో బీజేపీ కి మాత్రం ఒకే అంశంపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ వుంటాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి లాంటి వారు ఒకే అంశంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం కొత్త కాకపోయినా తాజాగా మళ్లీ అదే పని చేశారు. సాధారణంగా జీవీఎల్, సోము వీర్రాజ్ అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. బీజేపీలోని ఒక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా విమర్శలు చేస్తుంటుంది. ముఖ్యమంత్రి జగన్ పై ఈగవాలనివ్వని వారు కూడా ఏపి బిజెపిలో చాలా మంది ఉన్నారు. కొందరు నేతలు పురందేశ్వరి, సుజనా చౌదరి లాంటి వారు మాత్రం వైసీపీపై తమదైన రీతిలో విమర్శలు చేస్తారు.

ఏపీలో మంగళవారం, బుధవారం జరిగిన పరిణామాలపై బీజేపీ నేతలు స్పందించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్రం దృష్టి పెట్టాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు ఎలా ప్రవర్తించారో, అప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. గతంలో ఏపీలోకి అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అర్హత లేదని చంద్రబాబు అన్నారని జీవీఎల్ గుర్తుచేశారు.

సీబీఐకి కూడా చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టపడలేదని.. అలాంటిది ఇప్పుడెలా మాట్లాడతారని మండిపడ్డారు జీవీఎల్. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఏం ముఖం పెట్టుకుని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తారని జీవీఎల్ నిలదీశారు. గతంలో ఏపీలో చోటుచేసుకున్న అనుభవాలను టీడీపీ మరిచిపోయినా బీజేపీ ఇంకా మరిచిపోలేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. గతంలో చేసిన తప్పులను చంద్రబాబు ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదంతా ఒక ఎత్తయితే …నిత్యం వైసీపీని అంతగా విమర్శించని సోము వీర్రాజు సైతం ఈసారి రొటీన్‌కి భిన్నంగా స్పందించడం విశేషం. ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో నేడు జరిగిన సంఘటనలు చాలా విషాదకరమన్నారు. పార్టీ కార్యాలయాలపైన ఇలాంటి దుశ్చర్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇలాంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు.

మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి వైఖరి జీవీఎల్‌కు భిన్నంగా వుంది. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులను పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. వైస్సార్సీపీ కార్యకర్తల గూండాయిజాన్ని నేను ఖండిస్తున్నాను….విమర్శలను తట్టుకునే మనస్థైర్యం నాయకుడికి ప్రజాజీవితంలో ఉండాలి. విమర్శకు దాడులు జవాబు కాదు.ప్రజాస్వామ్యంలో గొంతులు అణచివేయలేరు.. అంటూ సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపించారు.

మరో బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి, ఎంపీ సుజనా చౌదరి కూడా తన అభిప్రాయం వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు,నేతల ఇళ్లపై దాడులు చేయడం గర్హనీయం. ప్రశ్నిస్తే సహించమనడం ఫ్యాక్షన్ భావజాలం. దాడులు చేసినవారిపై పోలీసుల కఠిన చర్య తీసుకోవాలి. వైసిపి నేతల పాత్ర ఉంటే వారిపై సీఎం జగన్ చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ వైఎస్ చౌదరి ట్వీట్ చేశారు. దీనిని బట్టి గమనిస్తే చంద్రబాబు విషయంలో ఒక పార్టీ నుంచే రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తం కావడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఏపీలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలను వివరించేందుకు శనివారం నాడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్న సంగతి తెలిసిందు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను చంద్రబాబు కలిసే అవకాశాలున్నాయి. అయితే, చంద్రబాబుకి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసే అవకాశం వుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts

వచ్చేది టీడీపీ ప్రభుత్వమే: టిడ్కో బాధితులకు న్యాయం చేస్తాం

Satyam NEWS

రైతు బాలాజీకి సీఎం కేసీఆర్ నుంచి పిలుపు

Satyam NEWS

Analysis: విరాళాలు ఇచ్చేవారిపై విసుర్లా?

Satyam NEWS

Leave a Comment