మంత్రి వర్గ సమావేశం తేదీని ఏపి ముఖ్యమంత్రి ఎందుకో తెలియదు కానీ ముందుకు జరిపారు. ఈ నెల 20 న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ తాజాగా రేపటికే మారుస్తూ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
పరిపాలన వికేంద్రీకరణ, ఏపీ సమగ్రాభివృద్ధి పై జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్‌లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ నివేదికలపై పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. కేబినెట్ భేటీకి ముందే ఆ కమిటీ తమ నివేదికను సీఎం జగన్‌కు అందించే అవకాశముంది.
కేబినెట్ భేటీలో పలు అంశాలతో పాటు హైపవర్ కమిటీ నివేదిక పైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చంటూ గతంలో సీఎం జగన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మరో వైపు ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హైపవర్ కమిటీ నివేదిక, రాజధానుల అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాజధానులపై ఎలాంటి ప్రకటన చేయనుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.