ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సుమారు 45 నిమిషాల సేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మరోసారి సిఎం విజ్ఞప్తి చేశారు. రెవిన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్, శ్రీశైలంలకు గోదావరి వరదజలాల తరలింపుపై ఇచ్చిన హామీను నెరవేర్చాలని అమిత్‌షా కు ముఖ్య మంత్రి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర విభజన పరిశ్రమలు, సేవారంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని, వీటివాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందని, ప్రత్యేక హోదాద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని హోంమంత్రికి ఆయన వివరించారు. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు కాకుండా పరిశ్రమలు ఏపీ వైపు చూడాలంటే ప్రత్యేక తరగతి హోదా ఉండాలని ఆయన అన్నారు. 2014-2015లో రెవిన్యూలోటును కాగ్‌తో సంప్రదించి సవరిస్తామని గతంలో హామీ ఇచ్చారంటూ అమిత్‌షాకు ఆయన గుర్తు చేశారు. ఆమేరకు సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.22948.76 కోట్లు రెవిన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ ఇంకా రూ.18969.26 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి చెల్లించాల్సి ఉందని హోంమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికోసం రాష్ట్ర పునర్ విభజన చట్టంద్వారా కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్నికూడా ఆయన ప్రస్తావించారు. వీటితోపాటు విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు.
previous post