భారీగా వర్షాలు కురుస్తూ ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తున్నా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి చెరువులు ఎందుకు నింపుకోలేకపోతున్నామో పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం వల్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణాజలాలు వస్తున్నాయని, అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని, పూర్తిగా ధ్యాసపెట్టి అన్ని రిజర్వాయర్లనూ పూర్తిగా నింపాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలిచ్చారు. ఇన్ని జలాలు ఉన్నా.. మనం ఎందుకు చెరువులు నింపలేకపోతున్నామో అధ్యయనం చేయండి అని ఆయన అన్నారు. మనకు కేవలం నెలరోజులు మాత్రమే అవకాశం ఉంటుంది, ఈ ఒక నెలలోనే అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపుకోగలగాలి, దీనికోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి అని ఆయా జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి కోరారు. అలాగే కృష్ణా పరీవాహక ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోండి, కొన్ని చోట్ల కాల్వలకు గండ్లు పడుతున్నాయి.. తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి అని ఆయన ఆదేశాలిచ్చారు. చాలా ప్రాంతాలలో గోదావరి కి వరదలు తగ్గు ముఖం పడుతున్నాయని అందువల్ల ఆయా ప్రాంతాలలో అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే విధంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు తక్షణమే వ్యవసాయానికి కంటెంజెన్సీ ప్లాన్ సిద్ధం చేయాలని, ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలను సేకరించాలని, వాటి పంపిణీలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఆగస్టు చివరి నాటికి ఈ ప్రణాళిక సిద్ధం కావాలని ముఖ్యమంత్రి గడువు విధించారు. కరువుకు సంబంధించిన ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ప్రతిపాదనలు పంపిన వెంటనే ప్రభుత్వం తగిన సహాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
previous post