ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే మంకుపట్టుతో ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అభీష్టానికి అనుకూలంగానే బోస్టన్ గ్రూప్ కూడా నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. అమరావతిలో సీఎం జగన్‌కు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ నేడు నివేదిక సమర్పించింది.
ఆ నివేదికలో ఏపీ అభివృద్ధి, రాజధానిపై ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దేశంలో బహుళ రాజధానులున్న రాష్ట్రాలపై అధ్యయనం చేసిన బీసీజీ కమిటీ ఆయా రాష్ట్రాల అభివృద్ధిని నివేదికలో వివరించారు.
రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణను సైతం నివేదికలో ప్రస్తావించారు. అంతేకాదు అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాన్ని కూడా బీసీజీ నివేదికలో సూచించింది. ఏయే రంగాల్లో పెట్టబడులు పెట్టాలి.. వికేంద్రీకరణకు ప్రభుత్వం ఏం చేయాలన్న వివరాలను వివరించారు. అభివృద్ధి సూచికల వారీగా జిల్లాల పరిస్థితి వివరించారు.
వ్యవసాయ, పర్యాటక, పరిశ్రమ, మత్స్య రంగాల అభివృద్ధిని నివేదికలో పేర్కొన్నారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలపై త్వరలో ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది. అనంతరం జనవరి 20 తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మూడు రాజధానుల అంశంపై ప్రకటన చేసే అవకాశముంది.