28.7 C
Hyderabad
April 20, 2024 03: 21 AM
Slider సంపాదకీయం

లేనివాడికి ఆకలి ఉన్నవాడికి అజీర్తి

KCR Jagan

ఏమీ లేనివాడు ఆకలితో చస్తుంటే అన్నీ ఉన్నవాడు అరక్క చచ్చాడట. తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు అటు రాజకీయంగా ఇటు పరిపాలనా పరంగా చూస్తుంటే ఈ విషయమే గుర్తుకు వస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మంచి పరిపాలనా దక్షుడు అని పేరు తెచ్చుకున్న చంద్రబాబునాయుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చి ఆ పేరుకు మచ్చ తెచ్చుకున్నాడు. ఒకే కులానికి పనులు, పదవులు కట్టబెట్టే క్రమంలో పరిపాలన మరచిపోయాడు. ఆయన మచ్చ తెచ్చుకుంటే ఫర్వాలేదు కానీ నవజాత శిశువు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు చేశాడు. ఆయన పాలనపై చిరాకుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీని ప్రజలు కట్టబెట్టారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. అందువల్ల ఆయన అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు.ఢిల్లీలో లాబీ చేయలేకపోవడంతో జగన్ నిర్ణయాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రివర్స్ టెండరింగ్ లాంటి వినూత్న విధానాలను ఆయన తీసుకువద్దామన్నా కుదరడం లేదు. చంద్రబాబు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే అమరావతి ప్రాంతం నుంచి ఆయన పాలన చేయడానికి ఇష్టపడటం లేదన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో రాజధాని మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు మంత్రులు కూడా అదే తరహా వ్యాఖ్యానాలు చేస్తుండటంతో రాజధాని అంశం తడిసి మోపెడైంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే తెలుగుదేశం పార్టీ దారుణమైన అసత్యాలను అవలీలగా ప్రచారం చేసేస్తున్నది. తన పర్యటన సందర్భంగా అడ్వాన్సు టీం లను పంపి ఏర్పాటు చేసుకునే అలవాటు ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయానికి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేనట్లుగా కనిపిస్తున్నది. అందుకనే పరిపాలనలో లోపాలు ఉన్నట్లు తెలుగుదేశం చేసే ప్రచారాన్ని ప్రజలు నమ్ముతున్నారు. ప్రకాశం బ్యారేజిలో నీళ్లు వదిలేస్తే తప్పు అనాలి గానీ నీళ్లు నిలిపితే కూడా తప్పుగా ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి కౌంటర్ ఇచ్చే నాథుడే లేకుండా పోయాడు. అలాగే రాజధాని మీద కూడా. అన్ని చోట్లా కన్ఫ్యూజన్ రాజ్యమేలుతున్న ఆంధ్రప్రదేశ్ అలా ఉంటే తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలు లేకుండా చేసుకున్న కేసీఆర్ స్వపక్షానికి కూడా కబురు చెప్పకుండా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. పైకి ఆహా ఓహొ అంటున్నారు కానీ టిఆర్ఎస్ లో అంతా కన్ఫ్యూజనే ఉంది. బంగారం లాంటి సెక్రటేరియేట్ ను ఎందుకు పడగొడుతున్నాడో చెప్పడు. రెవెన్యూ రికార్డులు గల్లంతయి గ్రామాల్లో ప్రజలు అలో లక్షణా అంటుంటే అదేమని అడిగే నాధుడే లేడు. మంత్రులకు, అధికారులకు కూడా మాట మాత్రం చెప్పకుండా తీసుకునే నిర్ణయాలతో తెలంగాణలో చాలా మందిలో అనుమానాలే తలెత్తుతున్నాయి. ఎంత మిగులు రాష్ట్రం అయినా బాగున్న భవనాలు కూల్చి వెయ్యి కోట్లతో కొత్త సెక్రటేరియేట్ అసెంబ్లీలు కట్టుకుంటాయా? అక్కడ రాజధాని ఉండి లేనట్లు, ఇక్కడ సెక్రటేరియేట్ ఉండి లేనట్లు. రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్దగా తేడాలేకుండా పోయింది.

Related posts

దాయాదులపై వైసీపీ నేతల దాష్టీకం

Bhavani

అంకితభావంతో పని చేసే గాజువాక ట్రాఫిక్ సిఐ కోటేశ్వరరావు

Satyam NEWS

మరో మూడేళ్ళ లో గురజాడ వారి “కన్యాశుల్కం”..వస్తుంది..!

Satyam NEWS

Leave a Comment