37.2 C
Hyderabad
April 19, 2024 14: 25 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు

అందరూ బాగుండాలని, అన్ని ప్రాంతాలు బాగుండాలని, ప్రతి నిర్ణయం ఇదే ప్రాతిపదికన జరుగుతోందని ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. గ్రామ పరిపాలన నుంచి రాష్ట్ర పరిపాలన వరకు అందరూ సమానమే అన్న ఆయన, అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం అని నమ్ముతున్నానని స్పష్టం చేశారు.

ఆ దిశలోనే రాష్ట్రంలో అత్యున్నత పాలన పరంగానూ, అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని సగర్వంగా తెలియజేస్తున్నానని అన్నారు. గతంలో అన్యాయంగా తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుతామన్న సీఎం, అన్నదమ్ముల్లా అన్ని ప్రాంతాలు ఉండేలా, ఎప్పటికీ అనుబంధాలు నిల్చేలా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, దేవుడి దయతో వచ్చిన ఈ పదవిని అందరి అభివృద్ధికి ఉపయోగిస్తామని మరోసారి చెబుతున్నానని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రూ.1000 ఖర్చు దాటిన ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేయడంతో పాటు, పథకంలో కొత్తగా 1000 వ్యాధులను చేరుస్తున్నట్లు తెలిపారు. దీంతో పాదయాత్రలో ఇచ్చిన మరో మాటను కూడా నిలబెట్టుకున్నామని అన్నారు.

ఇంకా ఆరోగ్యశ్రీ కోనం కొత్తగా క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న కార్డులు జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తొలిరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల కార్డులు పంపిణీ చేస్తున్నామని, వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.42 కోట్ల కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి కార్డు ఇస్తామని చెప్పారు.

2059 వ్యాధులకు పథకాన్ని వర్తింప చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నేడు ప్రారంభించారు. జిల్లాలో మూడు నెలల పాటు ఈ పైలట్‌ ప్రాజెక్టు కొనసాగనుంది. ఏలూరు ఇండోర్‌ స్టేడియమ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ‘క్యూఆర్‌’ కోడ్‌ కలిగిన ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను కూడా సీఎం జారీ చేశారు.

ఆ వెంటనే రాష్ట్రమంతటా గ్రామ సచివాలయాల ద్వారా 1.5 లక్షల కార్డులు పంపిణీ చేయడంతో పాటు, ఫిబ్రవరి నెలాఖరు నాటికి మొత్తం 1.42 కోట్ల (95 శాతానికి పైగా కుటుంబాలకు) ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ కార్డులు ఇస్తారు.

తాడేపల్లి నుంచి నేరుగా ఏలూరు మండలం వంగాయగూడెం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. ఆ తర్వాత ఏలూరు ఇండోర్‌ స్టేడియమ్‌ చేరుకున్న ఆయన, అక్కడ వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.

ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్‌ మిల్లర్ల సంఘం తరపున ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కు కోటి రూపాయల విరాళం అందించారు.

ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని), నారాయణస్వామి, మంత్రులు సీహెచ్‌ శ్రీరంగనాథ రాజు, తానేటి వనితతో పాటు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Related posts

సోము వీర్రాజూ… ఏమిటీ ఈ అపరిపక్వ వ్యాఖ్యలు?

Satyam NEWS

కోర్టు తీర్పులతో బెంబేలెత్తుతున్న యంత్రాంగం

Satyam NEWS

మర్రిగూడెం గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎస్ కె మౌలానా

Satyam NEWS

Leave a Comment