21.7 C
Hyderabad
December 2, 2023 04: 08 AM
Slider సినిమా

మీకు తెలియకుండానే అరెస్టు జరిగిందా?

#KS Rama Rao

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ప్రధాని నరేంద్రమోదీకి బహిరంగ లేఖ రాశారు. మీకు తెలియకుండానే ఈ అరెస్ట్ జరిగిందా? అని ప్రశ్నించారు. ఏపీలో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాములు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. వంటివి చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో, బాధ్యతతో ఈ లేఖ రాసినట్టు పేర్కొన్నారు.

మీరు జీ20 సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు, సీఎం జగన్ లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలతో చంద్రబాబును జైలులో పెట్టడం చూసి తన హృదయం రగిలిపోయిందని అన్నారు.

తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని లేఖలో స్పష్టం చేసిన కేఎస్ రామారావు.. రాష్ట్ర పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా ఏపీలో ప్రస్తుత పరిస్థితులు చూసి విసిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అంటూ లేని రాష్ట్రానికి చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని, శంకుస్థాపనకు మీరూ వచ్చారని గుర్తుచేశారు.

ఆర్థిక మోసాల కేసులో 16 నెలలు జైలులో గడిపి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజా వేదిక కూల్చివేతతో విధ్వంసక పాలన మొదలుపెట్టారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. మీరు శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో అలా చేయకూడదని మీరు హెచ్చరించి ఉండాల్సిందని అన్నారు. చంద్రబాబు కారణంగానే నేడు లక్షలాదిమంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారని గుర్తు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులను చంద్రబాబు అరెస్ట్ వార్త కదిలించిందని, వారంతా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్న వైనాన్ని గమనించాలని కోరారు.దివంగత ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్నప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని జైలులో పెట్టి ఇబ్బందులు పెడుతుంటే తెలుగు ప్రజల హృదయాలు రగిలిపోతున్నాయని పేర్కొన్నారు.

జైలు నుంచి చంద్రబాబును విడుదల చేయించి జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు. అంతేకాదు, రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడు మాత్రమే తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని స్పష్టం చేశారు. వెంటనే స్పందించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఆ లేఖలో కేఎస్ రామారావు కోరారు.

Related posts

వైభవంగా శ్రీ వేణుగోపాల, సీతారామచంద్ర స్వామి కోవెలలో లక్ష కుంకుమార్చన

Satyam NEWS

మంత్రి బొత్స చెప్పింది తప్పు: భరత్

Satyam NEWS

జై తెలంగాణ: వందేళ్ల ప్రగతి ఆరేళ్లలోనే సాధించాం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!