వక్రీకరించి రాసిన చరిత్రను సరిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 గురించి ఇప్పటి వరకూ చరిత్రలో వక్రీకరించి చెప్పారని దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో నేడు జరిగిన ఆర్ ఎస్ ఎస్ కీలక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 1947 నుంచి కాశ్మీర్ ను చర్చల్లో ఉంచడం ద్వారా దేశానికి ఈ చరిత్రకారులు ఎలాంటి సందేశం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కాశ్మీర్ లోయ నుంచి కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోసి వెళ్లగొట్టిన విషయాలను చరిత్రలో ఎక్కడా లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోస్తున్నప్పుడు ఈ మానవ హక్కుల సంఘాల వారు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాశ్మీరీ పండిట్లనే కాకుండా సూఫీ పెద్దల ను కూడా కాశ్మీర్ నుంచి వెళ్లగొట్టినప్పుడు ఎవరూ మాట్లాడలేదని ఆయన అన్నారు. సూఫీ పెద్దల ను కాశ్మీర్ నుంచి తరిమివేసినప్పుడు మానవహక్కులు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 370 కారణంగా దేశం మొత్తం ఇబ్బంది పడిందని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశామని అమిత్ షా అన్నారు. సమావేశంలో పాల్గొన్న ఆర్ ఎస్ ఎస్ పెద్దలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు.