కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఓకే చెప్పేసింది. అయితే బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ సమయంలో సమస్య తలెత్తింది. విభజన బిల్లుపై చైర్మన్ వెంకయ్యనాయుడు తొలుత మూజువాణీ ఓటుకు పిలిచారు. అయితే కొందరు సభ్యులు డివిజన్ ఓటింగ్ కోరడంతో ప్రక్రియకు మరింత సమయం పట్టింది. మొదటగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌పై ఓటు వేయాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో చైర్మన్ మాన్యువల్ ఓటింగ్‌కు ఓకే చెప్పారు. సభలో ఉన్న సభ్యులందరికీ ఓటింగ్ స్లిప్పులను జారీ చేశారు. వాస్తవానికి రాజ్యసభ జనరల్ సెక్రటరీ దీపక్ శర్మ ఓటింగ్ కోసం సభలోని స్క్రీన్‌ను ఆన్ చేశారు. కానీ ఆ స్క్రీన్‌పై ఎటువంటి సంకేతాలు కనిపించలేదు. దీంతో డివిజన్ ఓటింగ్‌ను స్లిప్పులతో నిర్వహించారు. అనుకూలంగా 125 మంది ఓటేశారు. 61 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఒకరు ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం దక్కింది.