ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొట్టేసిన ఫర్నీచర్ లెక్కకు మించేఉన్నట్లుగా గుర్తించారు. గుంటూరు తొట్రుగుంటలోని కోడెల శివప్రసాదరావు కుమారుడికి చెందిన గౌతమ్ హీరో షోరూంలో అసెంబ్లీ అధికారులు మూడురోజుల క్రితం జరిపిన తనిఖీల్లో కొంత ఫర్నిచర్‌ను గుర్తించారు. ఈ విషయంలో తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ, రెవెన్యూ, పోలీసు అధికారుల బృందం షోరూంకు వచ్చి ఫర్నిచర్‌ను అసెంబ్లీకి తరలించారు. 70 వస్తువులను షోరూంలో గుర్తించినట్లు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసెంబ్లీ అధికారులు ఇచ్చిన జాబితా కంటే ఎక్కువ ఫర్నిచర్‌ను కోడెల తరలించినట్లు ఆయన చెప్పారు. మాజీ స్పీకర్ అక్రమంగా, దొంగతనంగా తరలించిన అసెంబ్లీ ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తి అయింది. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారని, ఆ తర్వాత వారిచ్చిన ఫిర్యాదు మేరకు తాము కూడా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.